ఇప్పటికైనా మేల్కొంటారా?!
సంపాదకీయం: ఉగ్రవాద చర్యలు మనకు కొత్తగాదు. దేశంలో ఏదో ఒక మూల అలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినుంచీ గుణపాఠాలు తీసుకుని పాలనా యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ఉంటుందని, ఉండాలని సామాన్యులు ఆశిస్తారు. కానీ, ఆ ఆశ అడియాసేనని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం బీజేపీ బహిరంగ సభకు కొన్ని నిమిషాల ముందు సంభవించిన పేలుళ్లు నిరూపించాయి. ఈ పేలుళ్లలో సాధారణ పౌరులు అయిదుగురు, బాంబు పేల్చడానికి ప్రయత్నించిన ఉగ్రవాది ఒకరు మరణించారు. మరో 98మంది గాయపడ్డారు. సభకు చాలాముందు పేలుళ్లు జరగడంవల్ల తొక్కిసలాట చోటుచేసుకోలేదుగానీ... లేనట్టయితే మృతుల సంఖ్య చాలా ఎక్కువుండేది.
పేలుళ్లు జరిగిన వెంటనే అదుపులోకి తీసుకున్న కొందరిలో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన వారిద్దరున్నట్టు పోలీసులు చెబుతున్న సమాచారం. ఏడుచోట్ల జరిగిన పేలుళ్లలోనూ ఉగ్రవాదులు టైమర్లు వాడారు. పేలుళ్లు పాట్నాకు కొత్త కావొచ్చు. కానీ, కొన్ని నెలలక్రితమే ఆ రాష్ట్రంలోని బుద్ధ గయలో ఇవి సంభవించాయి. అంతేకాదు... పొరుగునే ఉన్న నేపాల్‌లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్టు, వారు బీహార్‌ను రక్షితప్రాంతంగా పరిగణిస్తున్నట్టు ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. దేశంలో పలు ఉగ్రవాద ఘటనలతో సంబంధం ఉన్న యాసిన్ భత్కల్ బీహార్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలోనే పోలీసులకు చిక్కాడు.
సాధారణ పరిస్థితుల్లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసు కోవాల్సి ఉండగా పాట్నాలో ఆదివారం బీజేపీ బహిరంగసభ నిర్వహిస్తున్నందు వల్ల మరింత అప్రమత్తతతో మెలగవలసింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటినుంచో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. అలాంటి నాయకుడు హాజరవుతున్న సభ సందర్భంగా ఒకటికి రెండుసార్లు భద్రతా ఏర్పాట్లను సరిచూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, పాట్నాలోని ఏడుచోట్ల పేలుళ్లు జరగడాన్ని చూస్తే ఆ తరహా చర్యలు తీసుకోలేదని అర్ధమవుతోంది. బీజేపీ సభ కోసం 5,000 మంది పోలీసులను నియమించామని ప్రభుత్వం చెబుతున్నా... వారంతా ట్రాఫిక్‌ను చక్కదిద్దడంలోనే గడిపారు. సభకు హాజరవుతున్న సామాన్య పౌరుల, వీఐపీల భద్రత గురించి, ముందస్తు ఏర్పాట్ల గురించి వారు పెద్దగా పట్టించుకోలేదు.
నిబంధనల ప్రకారం సభా స్థలివద్ద ఉండాల్సిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆ దరిదాపుల్లో లేదు. భారీ బహిరంగ సభ జరుగుతున్నచోట కనీసం ఒక్క అంబులెన్స్‌ను అయినా అందు బాటులో ఉంచాలని పోలీసులకు తోచలేదు. ఘటన జరిగిన వెంటనే అందులో గాయపడినవారిలో కొందరిని మోసుకుపోవడం, మరికొందరిని ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. పేలుళ్లకు వారు స్పందించిన తీరే చిత్రాతిచిత్రం. మొదటి పేలుడు పాట్నా రైల్వే స్టేషన్లో ఉదయం 9.30 సమయానికి జరిగింది. అటు తర్వాత వేర్వేరుచోట్ల వరసపేలుళ్లు సంభవించాయి. చిట్టచివరి పేలుడు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గాంధీమైదాన్ ఆవరణలో జరిగింది. అప్పటికి మోడీ తన ప్రసంగాన్ని ఇంకా ప్రారంభించలేదు. తొలి పేలుడు జరిగాక ఒకటి రెండుచోట్ల బాంబులను కనుగొని నిర్వీర్యంచేసిన మాట వాస్తవమేగానీ భారీగా జనం గుమిగూడుతున్న గాంధీమైదాన్‌లో మాత్రం దుండగులు దాడికి దిగవచ్చన్న అనుమానం ఏ దశలోనూ పోలీసులకు రాలేదు! అక్కడ అయిదుచోట్ల పేలుళ్లు జరిగిపోయాయి.
అయితే, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పోలీసుల వైఫల్యాన్ని అంగీకరించడం లేదు. తమకు సంబంధించినంతవరకూ భద్రతాపరమైన లోపాలు ఏమీ లేవని ఆయనంటున్నారు. అసలు అటు కేంద్ర నిఘా సంస్థగానీ, రాష్ట్ర నిఘా సంస్థలుగానీ ముందస్తు హెచ్చరికలేమీ చేయలేదని ఆయన వివరిస్తున్నారు. కేంద్ర గూఢచార సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) దీనికి భిన్నమైన కథనాన్ని చెబుతోంది. పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నదని తాము ముందే అప్రమత్తం చేశామని అంటున్నది. బీహార్ ప్రభుత్వ ప్రకటనకూ, ఐబీ వివరణకూ పొంతనే లేదు. మన ప్రారబ్ధం ఇదే. అంతా అయిన తర్వాత మేం చెప్పామని వారూ... చెప్పలేదని వీరూ అంటారు. ఎందుకింత గందరగోళం నెలకొంటున్నదో, సమన్వయం కొరవడుతున్నదో అంతుపట్టదు. ఆమధ్య జరిగిన హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్ల సమయంలోనూ ఇలాగే పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించాయి. ముందే చెప్పామని ఐబీ... లేదు లేదని స్థానిక పోలీసులు భిన్న కథనాలు వినిపించారు. అటు తర్వాత బుద్ధగయలో పేలుళ్లు జరిగినప్పుడూ ఇదే పునరావృతమైంది. ఆచరణలో ఇలా వరస వైఫల్యాలు సంభవిస్తున్నప్పుడు ఏ దశలో తలెత్తిన లోపాలు అందుకు దారితీస్తున్నాయో సమీక్షించుకోవాలి. మరోసారి అవి జరగకుండా ఏంచేయాలో ఆలోచించాలి. మార్గదర్శకాలు రూపొందించాలి.
కానీ, అటు కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఇలాంటి కసరత్తులు జరుపుతున్నట్టు లేవు. అందుకే, పదే పదే అవే పొరపాట్లు... అదే గందరగోళం... అవే దుష్ఫలితాలు వస్తున్నాయి. అసలు పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన కొద్దిసేపటికే ఒక చలన చిత్రం ఆడియో ఉత్సవానికి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే హాజరయ్యా రంటేనే మన నేతల్లో నిర్లిప్త ధోరణి ఎంతగా పెరిగిపోయిందో అర్ధమవుతుంది. ఆరుగురు మరణించి, దాదాపు వందమంది గాయపడిన ఉదంతం జరిగిన నగరంలోనే ఈ తరహా కార్యక్రమంలో ఆయన ఎలా పాల్గొనగలిగారో ఊహించ లేం. నేతల్లో ఉండే ఇలాంటి ధోరణే కిందిస్థాయి యంత్రాంగంలో అలసత్వాన్ని పెంచుతున్నది. తమను తాము సరిచేసుకోవడమే కాదు... కిందిస్థాయిలో సమూల ప్రక్షాళనకు పూనుకోనట్టయితే పాట్నా ఘటనల వంటివి పునరావృతమవుతాయని ఇప్పటికైనా నేతలు గుర్తించాలి. తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.