షిండే తీరును తప్పుబట్టిన బీజేపీ
లక్నో/న్యూఢిల్లీ: పాట్నా వరుస బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బాలీవుడ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరవడాన్ని ప్రతిపక్ష బీజేపీ తప్పుబట్టింది. పరిపాలనను నిర్లక్ష్యం చేయడం కేంద్ర మంత్రులకు అలవాటుగా మారిందని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి విమర్శించారు.
పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని షిండే పరిశీలిస్తారని అనుకున్నామని, కానీ ఆయన సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. అంతేకాకుండా ఆలస్యంగా కార్యక్రమానికి వచ్చినందుకు క్షమాపణ చెప్పారని వెల్లడించారు. 26/11 దాడులు జరిగినప్పుడు అప్పటి కేంద్ర హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి సిద్దార్థనాథ్ సింగ్ ఢిల్లీలో అన్నారు. షిండే కూడా ఇప్పుడు ఇదే దారిలో పయనిస్తున్నారని విమర్శించారు. బాధితులను పరామర్శించడం మాని పంక్షన్లకు వెళతారా అంటూ ధ్వజమెత్తారు.