గన్ ఫౌండ్రి: నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా స్వయంకృషితో పి.శివశంకర్ ఉన్నత స్థాయికి చేరుకున్నారని పలువురు ప్రముఖులు కొనియాడారు. అణగారిక వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి శివశంకర్ మరో అంబేడ్కర్ అని అభివర్ణించారు. గురువారం ఇక్కడి రవీంద్రభారతిలో ‘ఉత్తుంగ తరంగాలకు ఎదురీదిన ఓ విజేత జీవితావిష్కరణ’పేరిట కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ ఆత్మకథ గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ న్యాయశాఖలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కోసం అప్పట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి పి.శివశంకర్ తీసుకున్న నిర్ణయాలు ఎన్నో మార్పులు తీసుకు వచ్చాయని గుర్తుచేశారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తరఫున సుప్రీంకోర్టులో పలు కేసులలో న్యాయవాదిగా శివశంకర్ అద్భుతంగా వాదించి ఆమెపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయించగలిగారని గుర్తుచేశారు.
కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీ మాట్లాడుతూ కేంద్ర న్యాయ, మానవ వనరుల శాఖల మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కీర్తించారు. ఆయన ఆత్మకథ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని అన్నారు. నిరుపేద బాల్యం నుంచి అనేక ఆటుపోట్లను అధిగమిస్తూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న శివశంకర్ విజయప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు.
ఆయనతో అప్పట్లో పనిచేసినటువంటి అనుభవాలు, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రాంచందర్‌రావు, రఘువీరారెడ్డి, శివశంకర్ సతీమణి లక్ష్మి, కుమారుడు డాక్టర్ వినయ్, పుస్తక తెలుగు అనువాదకర్త వల్లీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment