
న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తోన్న డాక్టర్ వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు న్యాయవాదులను ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకుంటున్నారని న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్‌రావు చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లా నేస్తం, సంక్షేమ నిధి పథకాలతో న్యాయవాదులు పొందుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు.
ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో జూనియర్ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడం కష్టమని, అలాంటి వారిని ఆదుకునేందుకే లా నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. 2019 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్ల పాటు స్టైఫండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు.
గత మూడున్నర ఏళ్లలో 65,537 మంది న్యాయవాదులకు రూ.34.39 కోట్లను స్టైపెండ్ రూపంలో చెల్లించామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల కార్పస్‌ఫండ్‌తో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సంక్షేమ నిధి నుంచి అర్హులైన న్యాయవాదులకు వైద్య ఖర్చులు, లా పుస్తకాలు, మేజర్ ఆపరేషన్లు, ఇన్సూరెన్స్ వంటి అత్యవసరాలకు నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధి ద్వారా ఇప్పటివరకు 7,733 మంది న్యాయవాదులకు రూ.25 కోట్ల మేర సాయం చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment