న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంలో మరింత పారదర్శకత కోరుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజును ఆ శాఖ బాధ్యతల నుంచి మోదీ సర్కార్ తప్పించింది. న్యాయవ్యవస్థతో ఎలాంటి బేధాభిప్రాయాలు పొడచూపకూడదనే ఉద్దేశంతోనే ఈయన శాఖను మార్చారని తెలుస్తోంది.
పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల స్వతంత్ర మంత్రి అర్జున్‌సింగ్ మేఘ్‌వాల్‌కు న్యాయశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ ర్యాంక్‌లేని ఒక స్వతంత్ర హోదా మంత్రికి కీలకమైన న్యాయశాఖను అప్పగించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి.
ఎందుకు మార్చారు ?
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీలను సొంతంగా సుప్రీంకోర్టే కొలీజియం పేరిట నియమించుకోవడం ఎక్కడా లేదని, ఇదొక ఏలియన్ విధానం అని, మాజీ జడ్జీలు దేశవ్యతిరేక గ్యాంగ్‌లుగా తయారయ్యారని రిజిజు గతంలో ఆరోపించారు. దీంతో తమ బాధ్యతలు, విధుల్లో ప్రభుత్వ జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు కొలీజియం ఘాటుగా బదులిచ్చింది.
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న ఈ తరుణంలో రిజిజు వ్యాఖ్యలు విపక్షాలకు ఎన్నికల అస్త్రంగా మారకూడదనే ఉద్దేశంతోనే ఆయనను తప్పించినట్లు వార్తలొచ్చాయి. ఇన్నాళ్లూ మరో మంత్రి జితేంద్ర సింగ్ నిర్వహించిన భూ విజ్ఞానశాస్త్ర శాఖను రిజిజుకు అప్పగించారు. ప్రధాని మోదీ సలహా మేరకు రిజిజు, మేఘ్‌వాల్ శాఖలను మార్చుతున్నట్లు గురువారం రాష్ట్రపతిభవన్ ఒక నోటిఫికేషన్ విడుదలచేసింది.
కాగా, బాధ్యతలు మారడంపై రిజిజు స్పందించారు. ‘ భూ విజ్ఞాన శాఖలో ప్రధాని మోదీ దార్శనికతను సుసాధ్యం చేసేందుకు శాయశక్తుల కృషిచేస్తా. ఇంతకాలం న్యాయశాఖ మంత్రిగా కొనసాగడం గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు మద్దతు పలికిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌సహా మొత్తం న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు’ అని రిజిజు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment