గతనెల అక్టోబర్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పాట్నాలో నిర్వహించిన హుంకార్ ర్యాలీ సందర్బంగా సంభవించిన వరుస బాంబు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరిందని పోలీసులు శనివారం పాట్నాలో వెల్లడించారు. బీహార్లోని నలందా జిల్లాలోని పండిట్పూర్ ప్రాంతానికి చెందిన లఖన్ రాజవన్షి గురువారం మరణించాడని తెలిపారు.
మోడీ సభలో పాల్గొనేందుకు వచ్చిన లఖన్ బీహార్ వచ్చారు. అయితే బాంబు పేలుళ్లలో తీవ్రంగా గాయపడ్డాడు. పాట్నాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం అతడు స్వగ్రామానికి పయనమైయ్యాడు. అక్కడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ క్రమంలో అతడు గురువారం మరణించాడు.
పాట్నా నగరంలోని గాంధీమైదాన్లో గుజరాత్ ముఖ్యమంత్రి, భారత ప్రధానమంత్రి అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గత నెల 27న హుంకార్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించారు. ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కు అందజేశారు. క్షతగాత్రులకు ఆర్థిక సాయం అందజేశారు.