రాయలసీమ బిడ్డను అయినప్పటికి ...
మురళీనగర్ : టీవీ యాంకర్ లాస్య మురళీనగర్ సమీపంలోని పట్టాభిరెడ్డితోటలోని వానప్రస్థాశ్రమంలో సందడి చేశారు. జే-చారిటీస్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పెద్దవారికి ‘పలకరింపు’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆశ్రయం పొందుతున్న సుమారు 40మంది వృద్ధులతో ఆమె మాట్లాడారు.
హాయ్...నాన్నమ్మలూ....తాతయ్యలూ అంటూ పలకరించగానే బామ్మలు కూడా హాయ్...అంటూ మురిసిపోయారు. ఈసందర్భంగా లాస్య మాట్లాడుతూ తను రాయలసీమ బిడ్డను అయినప్పటికి తెలంగాణా ప్రజల ఆదరణ పొందగలుతున్నానని, ఇది తెలుగు ప్రజల అభిమానానికి సూచిక అని అన్నారు.
తల్లిదండ్రులను వదిలేయడం సినిమాల్లో చూశానని... అటువంటి వారు పడుతున్న ఆవేదన స్వయంగా ఇక్కడ చూస్తున్నానని లాస్య పేర్కొన్నారు. నాన్నమ్మ, తాతయ్యల దగ్గర గడిపే అదృష్టం ఈరకంగా నాకు లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువైపోవడం వల్ల స్వార్థం పెరిగిపోతోందని, దీంతో ఇంట్లో పెద్దకు ఆదరణ కరవవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లాలం భాస్కరరావు, జే-చారిటీస్ సీఈఓ డి.రామారావు, యువ దర్శకుడు డి.జగదీష్, వానప్రస్థాశ్రమం నిర్వాహకుడు ఆర్.శ్రీనివాసు, బీజేపీ నాయకులు చిరికి శ్రీనివాసరావు, బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.