బెజవాడ వాసికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు
విజయవాడ :బెజవాడ నగరానికి చెందిన రచయిత పట్టాభిరామ్ తుర్లపాటి (47)కు తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం దక్కింది. లండన్‌లోని ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ వివిధ రంగాల్లో అద్భుత రికార్డులను సృష్టించే తెలుగువారికి ఈ అవార్డు ఇస్తుంది. ఇప్పటివరకు ఇంగ్లిష్‌లో 75 పుస్తకాలను రచించిన రచయితలుండగా, పట్టాభిరామ్ 200కి పైగా ఇంగ్లిషు రచనలు చేశారు. ఈ అరుదైన రికార్డును గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరు నమోదు చేశారు. పట్టాభిరామ్ ఎంఎ (ఇంగ్లిష్), ఎంఎ (సోషియాలజీ) ఎంఎ (సైకాలజీ), ఎంఫిల్‌తో పాటు జర్నలిజంలోనూ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఐలాపురం హోటల్లో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.
ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు కూడా పంపాలని కొంతమంది ప్రవాసాంధ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. పట్టాభిరామ్ ప్రస్తుతం స్కోర్ మోర్ యూత్ మాసపత్రికకు చీఫ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్‌గా, ఇండియన్ బ్యాడ్మింటన్ హౌస్ పత్రికకు రెసిడెంట్ ఎడిటర్‌గా, జర్నలిస్టు వ్యూస్ అండ్ న్యూస్ మాస పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్కోర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థకు వ్యవస్థాపక సీఈవోగా పనిచేస్తూ పేద విద్యార్థుల అభ్యున్నతికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.