paturi Ramaiah
-
పోరాటాలు లేకుండానే మా ఆశయం నెరవేర్చారు.. సీఎం జగన్పై ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీపీఎం కురువృద్ధుడు, కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయ్యారు. పేదల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, రైతు బాంధవుడు, భూపోరాట యోధుడుగా పేరు పొందారు. ఉద్యమాలే ఊపిరిగా బతికిన ఆయన ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన రామయ్య సీఎంను కలిశారు. సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఉద్యమాలు, పోరాటాలు లేకుండా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్న సీఎంను రామయ్య అభినందించారు. తమ ఆశయాన్ని నెరవేర్చారని ప్రశంసించారు. 2024లో మళ్లీ అధికారంలోకి రాగానే పేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయాలని సీఎంను కోరారు. ప్రజల గుండెల్లో ఉంటారు పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను మెరుగు పరిచేందుకు విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా గొప్ప విషయమని రామయ్య అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా వైఎస్ జగన్ నేడు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. తాను జన్మించిన కొన్ని ఘడియలకే పోషకాహార లోపంతో తన తల్లి కన్నుమూసిందని తెలిపారు. ‘మీ లాంటి మనసున్న మహారాజు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే, ప్రభుత్వమే పోషకాహారం అందజేసి ఉంటే తన తల్లి బతికి ఉండేది’ అంటూ రామయ్య గద్గద స్వరంతో అన్నారు. పేదల గురించి ఇంతలా ఆలోచించటం చాలా గొప్ప విషయమని, ఇదే దృక్ప«థం కొనసాగించాలని సీఎం జగన్కు సూచించారు. సీఎంను ప్రశంసించాలనే వచ్చా సీఎంతో భేటీ అనంతరం రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ను కలవటంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఎలాంటి కోర్కెలు, అవసరాల కోసం కలవలేదన్నారు. సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించడానికే వచ్చానని తెలిపారు. ఊహ తెలిసినప్పటి నుంచి సీపీఎం ఆశయాలకు కట్టుబడి పని చేశానని, తుది శ్వాస వరకు అలాగే ఉంటానని అన్నారు. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిన్నానని, జైలు జీవితం కూడా అనుభవించానని చెప్పారు. -
ఓట్లేసినందుకు పేదల పథకాలకు కోత
ఒంగోలు టౌన్ : ఓట్లేసి గెలిపించినందుకు పేదల పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు పాటూరు రామయ్య ధ్వజమెత్తారు. నూతన ప్రభుత్వాలొచ్చి ఆరు నెలలు పూర్తి కాకముందే వ్యవసాయ కార్మికులు, పేదలపై బహుముఖ దాడులు సాగిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు, జిల్లా కార్యదర్శుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు ఆసరాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెనుకబడిన మండలాల్లో ప్రత్యేక కేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం కుదిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆహార భద్రత చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోగా, నేడు ఆహార ధాన్యాల లెవీ సేకరణ 70శాతం నుంచి 25 శాతానికి కుదించిందన్నారు. దీనివల్ల రైతులు, రైతు కూలీలు నష్టపోవడంతో పాటు పేదలకు చౌకధరలకు సరుకులు దక్కే పరిస్థితులు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని రామయ్య ఖండించారు. ఇదిలా ఉండగా శ్రామిక వర్గాన్ని మతం పేరుతో చీల్చేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. 2019లోపు అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని, దేశంలో ఒక్క మతమే ఉందని చెప్పడం ద్వారా ప్రజలను మతం పేరుతో చీల్చడంతో పాటు మైనార్టీలపై దాడులకు దారితీస్తున్నాయన్నారు. వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పాటూరు రామయ్య పిలుపునిచ్చారు. ఉపాధి హామీ రక్షణకై 26న ధర్నాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మురళీకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ జరగనున్న ధర్నాల్లో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు, మేట్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వృద్ధుల పింఛన్లు రద్దు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సాంకేతిక సమస్యల సాకుతో పింఛన్లు రద్దు చేయడం సరికాదన్నారు. వెంటనే వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.శేషారత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు టి.క్రాంతికిరణ్, పి.హనుమంతురావు, రవి, జి.మాల్యాద్రి, ఓ.నల్లప్ప, ప్రభాకర్, కె.శ్రీనివాస్, నారాయణరావు, కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం నాయకురాలు తవనం సుబ్బాయమ్మ మృతికి, హుదూద్ తుఫాన్లో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు.