CPM Senior Leader Paturi Ramaiah Praises CM YS Jagan - Sakshi
Sakshi News home page

పోరాటాలు లేకుండానే మా ఆశయం నెరవేర్చారు.. సీఎం జగన్‌పై పాటూరు రామయ్య ప్రశంసలు

Published Sat, Jan 21 2023 8:07 AM | Last Updated on Sat, Jan 21 2023 1:26 PM

CPM Senior Leader Paturi Ramaiah Praises CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీపీఎం కురువృద్ధుడు, కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. పేదల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, రైతు బాంధవుడు, భూపోరాట యోధుడుగా పేరు పొందారు.

ఉద్యమాలే ఊపిరిగా బతికిన ఆయన ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన రామయ్య సీఎంను కలిశారు. సీఎం జగన్‌ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఉద్యమాలు, పోరాటాలు లేకుండా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్న సీఎంను రామయ్య అభినందించారు. తమ ఆశయాన్ని నెరవేర్చారని ప్రశంసించారు. 2024లో మళ్లీ అధికారంలోకి రాగానే పేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయాలని సీఎంను కోరారు. 

ప్రజల గుండెల్లో ఉంటారు 
పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను మెరుగు పరిచేందుకు విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా గొప్ప విషయమని రామయ్య అన్నారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం లాంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా వైఎస్‌ జగన్‌ నేడు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.

తాను జన్మించిన కొన్ని ఘడియలకే పోషకాహార లోపంతో తన తల్లి కన్నుమూసిందని తెలిపారు. ‘మీ లాంటి మనసున్న మహారాజు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే, ప్రభుత్వమే పోషకాహారం అందజేసి ఉంటే తన తల్లి బతికి ఉండేది’ అంటూ రామయ్య గద్గద స్వరంతో అన్నారు. పేదల గురించి ఇంతలా ఆలోచించటం చాలా గొప్ప విషయమని, ఇదే దృక్ప«థం కొనసాగించాలని సీఎం జగన్‌కు సూచించారు. 

సీఎంను ప్రశంసించాలనే వచ్చా 
సీఎంతో భేటీ అనంతరం రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను కలవటంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఎలాంటి కోర్కెలు, అవసరాల కోసం కలవలేదన్నారు. సీఎం జగన్‌  చేపట్టిన కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించడానికే వచ్చానని తెలిపారు. ఊహ తెలిసినప్పటి నుంచి సీపీఎం ఆశయాలకు కట్టుబడి పని చేశానని, తుది శ్వాస వరకు అలాగే ఉంటానని అన్నారు. పేదల కోసం ఎన్నో పోరా­టా­లు చేసి లాఠీ దెబ్బలు తిన్నానని,  జైలు జీవితం కూడా అనుభవించానని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement