ఒంగోలు టౌన్ : ఓట్లేసి గెలిపించినందుకు పేదల పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు పాటూరు రామయ్య ధ్వజమెత్తారు. నూతన ప్రభుత్వాలొచ్చి ఆరు నెలలు పూర్తి కాకముందే వ్యవసాయ కార్మికులు, పేదలపై బహుముఖ దాడులు సాగిస్తున్నాయని మండిపడ్డారు.
శుక్రవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు, జిల్లా కార్యదర్శుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు ఆసరాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెనుకబడిన మండలాల్లో ప్రత్యేక కేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం కుదిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆహార భద్రత చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోగా, నేడు ఆహార ధాన్యాల లెవీ సేకరణ 70శాతం నుంచి 25 శాతానికి కుదించిందన్నారు. దీనివల్ల రైతులు, రైతు కూలీలు నష్టపోవడంతో పాటు పేదలకు చౌకధరలకు సరుకులు దక్కే పరిస్థితులు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు.
వీటికి తోడు కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని రామయ్య ఖండించారు. ఇదిలా ఉండగా శ్రామిక వర్గాన్ని మతం పేరుతో చీల్చేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. 2019లోపు అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని, దేశంలో ఒక్క మతమే ఉందని చెప్పడం ద్వారా ప్రజలను మతం పేరుతో చీల్చడంతో పాటు మైనార్టీలపై దాడులకు దారితీస్తున్నాయన్నారు. వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పాటూరు రామయ్య పిలుపునిచ్చారు.
ఉపాధి హామీ రక్షణకై 26న ధర్నాలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మురళీకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ జరగనున్న ధర్నాల్లో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు, మేట్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వృద్ధుల పింఛన్లు రద్దు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
సాంకేతిక సమస్యల సాకుతో పింఛన్లు రద్దు చేయడం సరికాదన్నారు. వెంటనే వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.శేషారత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు టి.క్రాంతికిరణ్, పి.హనుమంతురావు, రవి, జి.మాల్యాద్రి, ఓ.నల్లప్ప, ప్రభాకర్, కె.శ్రీనివాస్, నారాయణరావు, కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం నాయకురాలు తవనం సుబ్బాయమ్మ మృతికి, హుదూద్ తుఫాన్‌లో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు.
ఓట్లేసినందుకు పేదల పథకాలకు కోత
Published Sat, Nov 22 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement