The National Rural Employment Guarantee Scheme
-
వాడివేడిగా..
కర్నూలు(అగ్రికల్చర్) : కేంద్రం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు వందల కోట్లు వస్తున్నాయి.. ఖర్చవుతున్నాయి. కానీ అభివృద్ధి జాడలేదు. రోడ్లు లేవు... కాల్వలు లేవు. సుస్థిరమైన సహజ వనరుల అభివృద్ధికి పాటుపడాల్సి ఉన్నా ప్రగతి అనేదే లేకుండాపోయింది. నిధులు ఏమవుతున్నాయి, ఎటుపోతున్నాయంటూ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై నంద్యాల ఎస్పీ ఎస్పీవై రెడ్డి అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, కర్నూలు, పాణ్యం, డోన్, ఆదోని, నందికొట్కూరు, కోడుమూరు, ఆలూరు ఎమ్మెల్యేలు ఎస్.వి.మోహన్‌రెడ్డి, గౌరుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో సహా టీడీపీ ఎమ్మెల్యే గైర్హాజర్ అయ్యారు. వివిధ శాఖలకు చెందిన 13 అంశాలపై చర్చ జరగాల్సి ఉన్నా ఎన్ఆర్ఈజీఎస్, ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్స్, ఇందిర జలప్రభ, ఐఏవై, ఎన్ఆర్ఎల్ఎం(పింఛన్లు), ఐసీడీఎస్, అటవీశాఖ, గిరిజన ఉపప్రణాళికపై మాత్రమే చర్చ జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై ఎంపీతోపాటు, ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాలను వివరిస్తూ ఈ ఏడాది ఉపాధి పనులకు లేబర్ రిపోర్టు తగ్గిందని, అందువల్ల లక్ష్యాలు సాధించలేకపోయామని డ్వామా అదనపు పీడీ నాగసులోచన పేర్కొన్నారు. దీనిపై ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పనులులేక అల్లాడుతున్నారని, దీనికి తోడు కరువు వచ్చిందని, ఈ సమయంలో ఉపాధి పనులకు లేబర్ రావడం లేదనడం దారుణమన్నారు. పనులు కల్పించకపోవడం వల్ల లేబర్ రిపోర్టు తగ్గిందని అన్నారు. 13 కీలకమైన అంశాలపై 3 గంటల్లో పూర్తిస్థాయిలో చర్చించడం ఎలా సాధ్యం, పనికిరాని జన్మభూమి - మా ఊరు కార్యక్రమానికి ఊళ్లుళ్లూ తిప్పారు. దీనివల్ల జరిగింది ఏమీ లేదు. ముఖ్యమైన సమావేశం నిర్వహించడానికి మాత్రం తగిన సమయం లేకపోవడం దారుణమని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథథ్రెడ్డి ధ్వజమెత్తారు. పథకాల అమలు లొసుగులు సమగ్ర చర్చ ద్వారా బయటికి వస్తాయి. దీనిని బట్టి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చట్టాలు తయారు చేస్తారు. లొసుగులు బయటికే రాకపోతే చట్టాలు ఎలా సాధ్యమవుతాయంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా తగిన సమయం కేటాయించాలని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చెక్‌డ్యామ్‌లు నిర్మించారా...బావులు తవ్వారా.. అంటూ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరా తీశారు. ఎన్ఆర్ఈజీఎస్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం లేదని, కేవలం మరమ్మతులు మాత్రమే ఉన్నాయని, అయితే బావులు మాత్రం తవ్వుకోవచ్చని డ్వామా పీడీ పుల్లారెడ్డి తెలిపారు. ఎన్ని చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేశారు. ఎన్ని బావులు తవ్వారో వివరించాలని ఎంపీ కోరగా చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయని, బావుల తవ్వకం ఇంకా మొదలు కాలేదని అధికారులు పేర్కొనడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో ఐదారు ఎకరాల్లో సర్కులేషన్ ట్యాంకులు నిర్మించాలని పదేపదే కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని డోన్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. నందికొట్కూరు ప్రాంతంలో పనులు లేక వ్యవసాయ కూలీలు అల్లాడుతుంటే ఎన్ఆర్ఈజీఎస్ పనులు యంత్రాలతో జరుగుతున్నాయని, ఇందువల్ల కేంద్రం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్లో యంత్రాల వినియోగం లేదని, అయితే ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్లలో మాత్రం ఉందని డ్వామా అధికారులు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ అక్రమాలపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్ఆర్ఈజీఎస్లో 9090 కేసులు పెట్టామని, రూ.9 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలిందని, ఇప్పటివరకు రూ.2 కోట్లు రికవరీ అయిందని అధికారులు తెలిపారు. క్రిమినల్ కేసులు పెట్టారా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా 32 కేసులు పెట్టామని తెలిపారు. 9 వేలకుపైగా అవినీతి కేసులు ఉంటే క్రిమినల్ కేసులు 32 మాత్రమేనా బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కలెక్టర్ జోక్యం చేసుకుంటూ కేసుల స్థాయిని బట్టి నెల రోజుల్లో అందరిపైన క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే కదా అవినీతి జరిగింది, మరి అధికారులపై చర్యలు తీసుకోరా.. అంటూ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు 3 నెలలుగా పేమెంట్లు రావడం లేదని, ఇందువల్ల అల్లాడుతున్నారని, అధికారులకు ఒక్క నెల జీతం రాకపోతే ఊరుకుంటారా అంటూ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ప్రశ్నించారు. కల్లూరు ఏపీఓ రాజారావు అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు కానీ ఆయనపై చర్యలు లేవు కానీ ఆయనకు జిల్లాస్థాయిలో పోస్టు కల్పిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమంటూ ధ్వజమెత్తారు. ఉపాధి పేమెంట్ల పంపిణీలో కొంత ఇబ్బంది ఉందని, వచ్చే నెల ఒకటి నుంచి పోస్టల్ ద్వారా పేమెంట్లు అందుతాయని కలెక్టర్ వివరించారు. ఏపీఓ రాజారావు విషయాన్ని పరిశీలిస్తానని పీడీ పుల్లారెడ్డి పేర్కొన్నారు. సర్పంచుల హక్కులను కాలరాస్తున్నారని డోన్, కోడుమూరు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. జిల్లాలో రూ.323 కోట్లతో ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్లు జరుగుతున్నా ఎమ్మెల్యేలకు కనీసం సమాచారం కూడా ఉండటం లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలు లేవు. వారి పరిస్థితి ఎలా, అందరికీ వీలుగా సామూహిక లెట్రిన్లు నిర్మించాలని ఎమ్మెల్యే ఐజయ్య, గౌరుచరిత కోరారు. తాను బేతంచెర్ల సర్పంచుగా ఉన్నప్పుడు లెట్రిన్లు నిర్మించామని, అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఇటువంటి వాటిని నిర్మిస్తే బాగుంటుందని డోన్ ఎమ్మెల్యే తెలిపారు. -
ఓట్లేసినందుకు పేదల పథకాలకు కోత
ఒంగోలు టౌన్ : ఓట్లేసి గెలిపించినందుకు పేదల పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోతలు విధిస్తున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు పాటూరు రామయ్య ధ్వజమెత్తారు. నూతన ప్రభుత్వాలొచ్చి ఆరు నెలలు పూర్తి కాకముందే వ్యవసాయ కార్మికులు, పేదలపై బహుముఖ దాడులు సాగిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు, జిల్లా కార్యదర్శుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు ఆసరాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెనుకబడిన మండలాల్లో ప్రత్యేక కేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం కుదిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆహార భద్రత చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోగా, నేడు ఆహార ధాన్యాల లెవీ సేకరణ 70శాతం నుంచి 25 శాతానికి కుదించిందన్నారు. దీనివల్ల రైతులు, రైతు కూలీలు నష్టపోవడంతో పాటు పేదలకు చౌకధరలకు సరుకులు దక్కే పరిస్థితులు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు కార్మిక చట్టాలు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని రామయ్య ఖండించారు. ఇదిలా ఉండగా శ్రామిక వర్గాన్ని మతం పేరుతో చీల్చేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. 2019లోపు అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని, దేశంలో ఒక్క మతమే ఉందని చెప్పడం ద్వారా ప్రజలను మతం పేరుతో చీల్చడంతో పాటు మైనార్టీలపై దాడులకు దారితీస్తున్నాయన్నారు. వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పాటూరు రామయ్య పిలుపునిచ్చారు. ఉపాధి హామీ రక్షణకై 26న ధర్నాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మురళీకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ జరగనున్న ధర్నాల్లో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు, మేట్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వృద్ధుల పింఛన్లు రద్దు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సాంకేతిక సమస్యల సాకుతో పింఛన్లు రద్దు చేయడం సరికాదన్నారు. వెంటనే వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.శేషారత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు టి.క్రాంతికిరణ్, పి.హనుమంతురావు, రవి, జి.మాల్యాద్రి, ఓ.నల్లప్ప, ప్రభాకర్, కె.శ్రీనివాస్, నారాయణరావు, కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం నాయకురాలు తవనం సుబ్బాయమ్మ మృతికి, హుదూద్ తుఫాన్లో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. -
ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంటికే..
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి రాగానే తన అసలు రూపం బయటపెట్టారు. ఉద్యోగం మాట దేవుడెరుగు.. ఉన్న చిరుద్యోగం కూడా ఊడబెరికేందుకు సిద్ధమవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదర్శ రైతులు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు రంగం సిద్ధమవుతుండటం ఎన్నో జీవితాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదర్శ రైతు వ్యవస్థను టీడీపీ నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను సమీక్షిస్తూ రద్దు దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ల మెడపై మొదటగా కత్తి పెడుతోంది. ప్రస్తుతం జిల్లాలో 1,658 మంది ఆదర్శ రైతులు పని చేస్తుండగా.. ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 గౌరవ వేతనం చెల్లిస్తోంది. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామ పంచాయతీకి ఒకరు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఉపాధి పనుల నిర్వహణలో వీరే కీలకం. ఆదర్శ రైతలు, ఫీల్డ్ అసిస్టెంట్లలో అధిక శాతం కాంగ్రెస్ కార్యకర్తలే పని చేస్తున్నారనేది టీడీపీ నేతల భావన. ఆ మేరకు ఈ పోస్టులను రద్దు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామన్న చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనగా ఆందోళన బాట పట్టేందుకు వీరు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలాఉండగా అన్ని శాఖల్లో కలిపి జిల్లాలో దాదాపు 30వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలం ఈనెల చివరితో ముగియనుంది. ప్రభుత్వం వీరి కాంట్రాక్టు పొడిగిస్తుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు శాఖల్లో వీరిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. -
గుండెచెరువు
కర్నూలు రూరల్: ఏటా అదే అలసత్వం.. నిర్లక్ష్యం.. వ్యవసాయానికి జీవధారమైన చెరువుల మరమ్మతుల్లో అంతులేని జాప్యం. ఫలితం వేలాది ఎకరాలు బీడు భూములుగా దర్శనం. వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం. వరుణుడు కరుణిస్తే జిల్లాలో చెరువులు, కుంటలు నిండుతాయి. అయితే నీరు నిలబడేందుకు పట్టిష్టమైన కరకట్టలు ఉండడంలేదు. తూములు శిధిలావస్థకు చేరి అప్పటికే సాగు చేసిన పంటపొలాలు మునకకు గురవుతున్నాయి. కాల్వలు సైతం అధ్వానంగా ఉండి రైతుకు పరీక్ష పెడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలతో ఖరీఫ్ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు చెరువుల బాగోగులను పట్టించుకోలేదు. మరమ్మతుల కోసం కనీసం నిధులు కూడా విడుదల కాలేదు. గతంలో వివిధ పథకాల కింద మరమ్మతు, పునరుద్ధరణ పనుల కోసం సుమారు రూ. 243 కోట్ల రూపాయలు(నాలుగేళ్లలో) ఖర్చు చేసినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. తూతూ మంత్రంగా పనులు చేయడంతో చెరువుల కింద అదనంగా ఒక ఎకరా ఆయకట్టు కూడా పెరగలేదు. జిల్లాలో చెరువుల దుస్థితి ఇది.. ఆలూరు: మండల పరిధిలోని ఆలూరు, కురువళ్లి, అరికెర, పెద్దహోతూరు, హత్తిబెళగల్ చెరువులు బ్రిటీష్ కాలం నాటివి. ఈ చెరువుల్లో పూడిక పూర్తిగా పేరుకుపోయింది. భారీ వర్షాలు కురిసిన ప్రతియేటా కురువళ్లి, అరికెర తదితర గ్రామాల్లో ఉన్న చెరువులకు గండి పడుతూనే ఉన్నాయి. గత ఆరేళ్ల క్రితం హుళేబీడు గ్రామంలో జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.కోటి రూపాయలతో నిర్మించిన చెరువు ఇంతవరకు నిండ లేదు ఆస్పరి: మండలంలో వెంగళాయదొడ్డి, చిన్నహోతూరు, ముత్తుకూరు చెరువుల కింద 1300 ఎకరాలు సాగవుతోంది. భారీ వర్షాలు వస్తే వీటిలో నీరు నిల్వ ఉండటం లేదు. చిప్పగిరి: మండలంలోని తిమ్మాపురం చెరువు కొన్నేళ్లుగా ఆయకట్టు రైతులకు ఎలాంటి ప్రయోజనాన్ని అందించడం లేదు. ప్రతియేటా వర్షాలు కురిసి చెరువు నిండినా గండ్లు పడి నీరు వృథాగా పోతోంది. హాలహర్వి: మండలంలో చింతకుంట, విరుపాపురం, కామినహాల్, బిలేహాల్ చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల కింద దాదాపు 1100 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. భారీ వర్షాలు కురిసిన ప్రతియేటా బిలేహాల్, కామినహాల్ చెరువులకు గండ్లు పడుతూనే ఉన్నాయి. దేవనకొండ: మండలంలోని కరివేముల, మాచాపురం, నేలతలమరి గ్రామాల్లో బ్రిటీష్ కాలం నాటి చెరువులు ఉన్నాయి. వీటి కింద దాదాపు రెండు వేలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. పాలకులు పట్టించుకోక పోవడంతో వీటిలో పూడిక పేరుకుపోయింది. హొళగుంద: మండలంలోని హెబ్బటం, నెరణికి, ఎల్లార్తి, సుళువాయి తదితర గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. గతంలో భారీ వర్షాలతో హెబ్బటం చెరువుకు పెద్ద ఎత్తున గండి పడి వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. డోన్: సబ్‌డివిజన్‌లోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో 45 చెరువులు ఉన్నాయి. వీటి కింద 15వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. డోన్ మండలంలోని వెంకటాపురం చెరువు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 3500 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. అయితే పదేళ్లుగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరు కోలేదు. మరమ్మతుల కోసం రూ. 37లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. కోడుమూరు: నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, కర్నూలు మండలాల్లో 15 చెరువులు, 5 కుంటల ద్వారా 22,900 ఎకరాలు సాగునీరు అందుతోంది. కోడుమూరు మండలంలోని కొత్తపల్లె చెరువు కరకట్టలు బలహీనం కావడంతో నీరు నిల్వ ఉండడం లేదు. ఎర్రదొడ్డి, అమడగుంట్ల పోచమ్మ చెరువుల నామ రూపాలే కనిపించడం లేదు. తిమ్మాపురం చెరువు కింద 180 ఎకరాలు, మునగాలలోని కత్వంక చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తూములు శిథిలావస్థకు చేరడంతో చెరువుల్లోని నీరంతా వృథాగా పోతుంది. కర్నూలు మండలంలో బి.తాండ్రపాడు, తులశాపురం, గార్గేయపురం చెరువులు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. బనగానపల్లె: మండలంలో అక్కజమ్మ పసుపల, రామతీర్థం, మీరాపురం, యనకండ్ల చెరువులు అభివృద్ధి చెందలేదు. మరమ్మతుల కోసం జోళాపురం చెరువుకు రూ. 16 లక్షలు, యనకండ్ల చెరువుకు రూ. 15 లక్షల నిధులు మంజూరై టెండర్ల పక్రియ పూర్తయింది. అయితే సంబంధిత కాంట్రాక్టర్ మృతితో అభివృద్ధి పనులు మొదలు కాలేదు. 260 ఎకరాల ఆయకట్టు గల అక్కజమ్మ చెరువు మధ్యలో గాలేరు నగరి సుజల స్రవంతి కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో ఆ చెరువు ఉనికి కోల్పోయింది. కోవెలకుంట్ల: మండలంలోని మారుతినగర్ సమీపంలో ఉన్న లింగారెడ్డి చెరువు నిరుపయోగంగా మారింది. ఈ చెరువు పరిధిలో 300 ఎకరాలకుసాగునీరందడం లేదు. జోళదరాశి పెలైట్ ప్రాజెక్టు ద్వారా చెరువుకు నీరు మళ్లించాలనే ప్రయత్నాలు ఫలించలేదు. సంజామల: మండలంలో రాంభ్రదునిపల్లె, ముక్కమల్ల, నొస్సం, కానాల చెరువులు ఉన్నాయి. రాంభద్రునిపల్లె చెరువు కింద 800 ఎకరాల ఆయకట్టు ఉండగా రూ.70 లక్షలు వెచ్చించి కుడి, ఎడమ కాల్వలు ఏర్పాటు చేశారు. తూము ఎత్తును పెంచకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందటం లేదు. ముక్కమల్ల చెరువు కింద 520 ఎకరాల సాగుభూమి ఉంది. కాల్వల్లో పూడిక తీయకపోవడంతో సాగునీందని పరిస్థితి నెలకొంది. నొస్సం చెరువు పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ చెరువు కింద 600 ఎకరాల సాగు భూమి ఉండగా సంగం కూడా సాగుకావడం లేదు. కానాల చెరువు కింద 350 ఎకరాల ఆయకట్టు భూమి ఉండగా తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. -
తవ్వేకొద్దీ అవినీతి!
కర్నూలు(కలెక్టరేట్) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. కోట్లాది రూపాయలతో ముడిపడిన ఈ పథకంలో తవ్వేకొద్దీ అవినీతి వెలుగు చూస్తోంది. ఎవరి స్థాయిలో వారు దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 9,798 మంది ఈ కోవలో ఉన్నారంటే అవినీతి ఏ స్థాయిలో చోటుచేసుకుందో అర్థమవుతోంది. జిల్లాలో 2007 సంవత్సరం నుంచి పథకం అమలవుతుండగా.. ఇప్పటి వరకు రూ.1,650 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.235 కోట్లు వ్యయమైంది. ఇంత చేసినా ఎక్కడా ఆ పనుల జాడ లేకపోవడం గమనార్హం. జిల్లాలో వెలుగుచూసిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడా లేని విధంగా సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా రూ.124.9 కోట్ల దుర్వినియోగం వెలుగుచూసింది. పథకంలోని అక్రమాలపై యేటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏడో విడత తనిఖీ కొనసాగుతుండగా.. రూ.756.9 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. మొత్తం 7.50 లక్షల జాబ్ కార్డుల్లో అత్యధికం బోగస్‌వేనని తెలుస్తోంది. చనిపోయిన.. విద్యార్థులు.. ఉద్యోగుల పేర్లతో జాబ్ కార్డులు సృష్టించి కొందరు సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. అక్రమాలపై విచారణ చేపట్టి శిక్షించేందుకు మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మూడేళ్లుగా ప్రచారంలో ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి. మొబైల్ కోర్టుల ప్రచారం నేపథ్యంలో అక్రమార్కులను మూడు కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మొబైల్ కోర్టుల్లో సత్వరం విచారణ జరిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కోర్టును ఏర్పాటు చేయకపోవడంతో అక్రమార్కులు మరింత చెలరేగుతున్నారు. సామాజిక తనిఖీల్లో రూ.795 కోట్లు దుర్వినియోగమైనట్లు తేలినా.. అధికారులు కేవలం గ్యాప్‌లు మాత్రమేనంటూ అవినీతి మొత్తాన్ని రూ.8,68,06,259కు కుదించడం గమనార్హం. ఈ మొత్తంలోనూ రూ.1.79 కోట్లు మాత్రమే రికవరీ చేయడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. అవినీతిలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అగ్రస్థానం అక్రమించారు. అధికారికంగానే టెక్నికల్ అసిస్టెంట్లు రూ.2.18కోట్లు.. ఫీల్డ్ అసిస్టెంట్లు రూ.1.41 కోట్లు స్వాహా చేసినట్లు స్పష్టమైంది. వెల్దుర్తి, కృష్ణగిరి, ఎమ్మిగనూరు, పాములపాడు, పత్తికొండ, ప్యాపిలి, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు, మద్దికెర తదితర మండలాల్లో నిధుల దుర్వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు కళ్లెం వేయలేని పరిజ్ఞానం: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ఆర్ఈజీఎస్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించినా ఫలితం లేకపోయింది. జాబ్ కార్డు వెరిఫికేషన్ చేపట్టినా తూతూమంత్రంగా సాగింది. జిల్లాలో 2.15 లక్షల బోగస్ జాబ్ కార్డులు ఉన్నట్లు మాత్రమే తేల్చగలిగారు. ఈఎంఎంఎస్, ఈ-మెజర్మెంట్ విధానాలను అమల్లోకి తీసుకొచ్చినా.. ఆన్లైన్ పేమెంట్ చేపడుతున్నా అక్రమాలను అడ్డుకోలేకపోవడం గమనార్హం. అక్రమాలను తగ్గిస్తున్నాం - హరినాథ్‌రెడ్డి, డ్వామా పీడీ ఎన్ఆర్ఈజీఎస్లో అక్రమాలను తగ్గిస్తున్నాం. పీడీగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజోపకర పనులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. డంపింగ్ యార్డులు, పండ్ల తోటల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించం. ఇప్పటికే బాధ్యులపై చర్యలు మొదలుపెట్టాం. దుర్వినియోగం చేసిన మొత్తాన్ని రికవరీ కూడా చేస్తున్నాం. -
రూ.124 కోట్లు హాంఫట్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాలో రూ.124 కోట్లు దుర్వినియోగం అయినట్లుగా సీఐడీ అధికారులు తేల్చారు. జిల్లాలో 2 లక్షలకు పైగా బోగస్ జాబ్ కార్డులు ఉన్నట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు ఎమ్మిగనూరు కేసులో సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. 2011లో ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో సమగ్ర విచారణ కోసం సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు రెండేళ్లలో జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. కొద్ది నెలల క్రితమే ఎన్ఆర్ఈజీఎస్ బనవాసి అక్రమాలపై సీఐడీ అధికారులు ఇద్దరు ఎంపీడీఓలు, ఇద్దరు ఏపీఓలు, ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంటుపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. తర్వాత సీఐడీ విచారణలో ఉపాధి అక్రమాలు భారీగా వెలుగు చూశాయి. జిల్లా మొత్తం మీద 6.50 లక్షల జాబ్ కార్డులు ఉండగా ఇందులో 2 లక్షలకు పైగా బోగస్‌వి ఉన్నట్లు నిర్ధారించారు. రూ.124 కోట్లు దుర్వినియోగం అయ్యాయని తేల్చారు. ఈ మేరకు కోర్టుకు అక్రమాలను వివరిస్తూ చార్జిషీట్ వేసినట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు ఉపాధి అక్రమాల గుట్టు విప్పడంతో ‘ఉపాధి’ అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. -
ఓటరు కార్డు లేకున్నా.. ఓటు వేయవచ్చు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యే కార్యక్రమం చేపడుతున్నట్లు జేసీ కడవేరు సురేంద్రమోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం చేస్తున్నామని, ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆటోల ద్వారా ప్రచారం చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల సంఘం మంజూరు చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటరు జాబితాలో పేరుంటే వారందరు ఓటు వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వారు ఓటు వేసేందుకు 13 రకాల గుర్తింపు కార్డులను ఎంపిక చేశారని, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్డులు, ధ్రువపత్రాలు 2009 ఫిబ్రవరి 28వ తేదీ నాటికి నిర్ధారించి జారీ చేసినవై ఉండాలని పేర్కొన్నారు. ఓటు హక్కు ఉండి కార్డు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల సంఘం గుర్తించి కార్డుల వివరాలిలా ఉన్నాయి. డ్రైవింగ్ లెసైన్స్ పాస్‌పోర్టు ఇన్‌కం ట్యాక్స్ గుర్తింపు ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, లోకల్‌బాడీలు, పబ్లిక్‌లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు, పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటోలతో ఉన్న పాస్‌పుస్తకాలు, కిసాన్పాస్ పుస్తకాలు ఫొటోలతో కూడిన భూమి పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాల వంటి ఆస్తి డాక్యుమెంట్లు సంబంధిత అధికారులు జారీ చేసిన ఎస్సీ, బీసీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఫొటోలతో జారీ అయిన మాజీ సైనికుల పింఛన్ పుస్తకాలు, పెన్షన్ డాక్యుమెంట్ ఆర్డర్, ఎక్స్ సర్వీస్ మెన్విడో, డిపెండెంట్ సర్టిఫికెట్, వృద్ధాప్యపు, వితంతు పింఛన్ ఆర్డర్ స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలతో కూడిన గుర్తింపుకార్డులు ఆయుధలెసైన్స్ ఫొటోలతో ఉన్న వికలాంగుల సర్టిఫికెట్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన ఫొటోగురింపుకార్డు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్కీం కింద జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం స్మార్టు కార్డులు అనుమతించనున్నారు. -
‘ఉపాధి’ లేక వలస బాట
ఆత్మకూరు రూరల్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా చాలా గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు. దీంతో వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతుంది. వలసల నివారణ కోసం దృష్టి సారించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పనుల్లేక కొందరు, చేసిన పనులకు సరైన వేతనాలు ఇవ్వలేదంటూ మరికొందరు ఈ విధంగా వలస బాట పట్టారు. ఇలాంటి పరిస్థితులు ఆత్మకూరు మండలంలోని కురుకుంద, అమలాపురం, ముష్టపల్లె, వడ్లరామాపురం గ్రామాల్లో వెలుగు చూస్తున్నాయి. ఆత్మకూరు మండలంలో 771 శ్రమశక్తి సంఘాలున్నాయి. వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టడంతో అన్ని గ్రామాల్లో పనులు కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశించింది. అందులో ఆత్మకూరు మండలంలో 3వేల మందికి పైగా ఉపాధి కల్పించేలా లక్ష్యాలను నిర్దేశించారు. జనవరి మాసం నుంచి పనులు ప్రారంభించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో పనులు కల్పించడంలో విఫలమయ్యారు. మండలంలో 13,241 మంది ఉపాధి కూలీలుండగా ప్రస్తుతం 110 మంది మాత్రమే పనులు చేస్తున్నారు. వీటిలో పనులు కల్పించడంలో అధికారులు ఏమేరకు లక్ష్యాలు సాధిస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇందిరేశ్వంలో 139 మంది, నల్లకాల్వలో 130 మంది మినహా ఏ గ్రామంలో కూడా అధిక సంఖ్యలో పనులకు వెళ్లడం లేదు. ఇదిలా ఉంటే కురుకుంద గ్రామంలో చేసిన పనులకు కేవలం రూ.30, రూ.40లు మాత్రమే వేతనాలు రావడంతో నిరాశకు లోనైన వారు మిరపపండు తెంచేందుకు గానూ రూ.200, రూ.300లు కూలిలు పడుతున్నాయని మూటె, ముల్లెలు సర్దుకుని గుంటూరు, దోర్నాల, కుంట, తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అందరికీ పనులు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. నేటికీ పనులకు నోచుకోని గ్రామాలు : మండలంలో పనులు ప్రారంభించి దాదాపు మూడునెలలు కావస్తోంది. అయితే కురుకుంద, అమలాపురం, ముష్టపల్లె గ్రామాల్లో నేటికీ పనులు కల్పించలేదు. అధికారులు పనులు కల్పిస్తామని గ్రామసభలు నిర్వహించినప్పటికీ అమలు చేయలేదు. అమలాపురంలో రాజకీయ జోక్యంతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించడంతో పనులు చేపట్టలేదు. కురుకుంద, ముష్టపల్లె గ్రామాల్లో పనులకు తగ్గ వేతనాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అలాగే క్రిష్ణాపురం గ్రామంలో గతేడాది చేసిన పనులకు గానూ వేతనాలు చెల్లించకపోవడంతో ఆ గ్రామంలో కొందరు పనులకు వెళ్లడం లేదు. మూడు గ్రామాల్లో ఇప్పటి వరకూ దాదాపు వంద కుటుంబాలు వలసలు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. అందువల్ల సంబంధిత అధికారులు స్పందించి గ్రా మీణ ప్రాం తాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి, వల సలు వెళ్లకుండా అందరికీ పను లు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. అందరికీ పనులు కల్పించేందుకు చర్యలు : మధుబాబు, ఏపీఓ మండలంలోని అన్ని గ్రామాల్లో అందరికీ పనులు కల్పించేవిధంగా చర్యలు తీసుకున్నాం. వేతనాల విషయంలో వ్యత్యాసం వల్ల వలసలు వెళ్తున్నారు. అయితే అందరికీ పనులు కల్పించి వలసలు వెళ్లకుండా చూస్తాం. ప్రతి గ్రామంలో పర్యటించి పనులకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి పనులు కల్పించేలా వివరిస్తున్నాం. వేతనాల విషయంపై ఉన్నతస్థాయి అధికారులకు తెలియజేస్తాం. -
చేతు లెత్తేసిన గ్రామీణాభివృద్ధి శాఖ
సాక్షి, కొత్తగూడెం : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉసూరుమంటోంది. నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉన్న ఈ పథకంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. నిధుల్లేవం టూ గ్రామీణాభివృద్ధి శాఖ చేతులెత్తేయడంతో నెలన్నరరోజులుగా జిల్లాలోని కూలీలకు వేతనం చెల్లింపు నిలిచిపోయింది. దీంతో కూలీలకు రూ.10 కోట్లు వేతనం బకాయి పేరుకుపోయింది. కూలీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధి హామీ నిబంధనల ప్రకారం వారానికోసారి కూలీలకు వేతనాలు అందించాలి. కానీ ఈ నిబంధనను సంబంధిత శాఖ అధికారులు బేఖాతర్ చేస్తుండడం గమనార్హం. నిధులు లేవని గత నెల 7 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా కూలీలకు వేతనాల చెల్లింపులను గ్రామీణాభివృద్ధి శాఖ నిలిపివేసింది. కూలీలకు వేతనాలు నిలిపివేసిన సదరు శాఖ .. అధికారులు, సిబ్బందికి మాత్రం జీతభత్యాల చెల్లింపు ఠంఛన్‌గా చేస్తోంది. ప్రస్తుతం పల్లెల్లో ‘ఉపాధి’ కరువు కాగా, చేసిన పనికి కూలీ డబ్బు కూడా అందకపోవడంతో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పస్తులతో అలమటిస్తున్నామని కూలీలు అధికారులతో మొర పెట్టుకుంటున్నా మేము చేసేదేమీ లేదని వారు చేతులెత్తేశారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 5,77,053 వేల మంది శ్రామికులు జాబ్ కార్డు కలిగి ఉన్నారు. పనుల కల్పనకు ప్రభుత్వం శ్రమశక్తి గ్రూపుల ఏర్పాటు తప్పనిసరి చేయడంతో వీరంతా 29,250 గ్రూపులుగా ఏర్పడి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గత నెల నుంచి కూలీ డబ్బు చెల్లింపు నిలిచిపోయింది. గత నెల, ఈ నెల 23 వరకు కలిపి సుమారు 40 వేల మంది కూలీలకు 10 కోట్ల రూపాయలు వేతనంగా చెల్లించాలి. దీంతో పాటు ఆన్లైన్ ఎన్రోల్మెంట్ సమస్యవల్ల దీర్ఘకాలికంగా చెల్లించని వేతనాలు కలిపితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు కార్యాలయం జిల్లాలో మొత్తం కూలీలకు చెల్లించాల్సిన బకాయిల వివరాల సేకరణలో పడింది. కొన్ని మండలాల నుంచి ఇప్పటికే వివరాలు అందగా మరికొన్ని మండలాల నుంచి అందాల్సి ఉంది. నిర్వీర్యమవుతున్న పంపిణీ వ్యవస్థలు.. ఉపాధి నిధులు సక్రమంగా ఖర్చు చేయడానికి, కూలీలకు డబ్బు చెల్లింపునకు ప్రభుత్వం పలు రకాలుగా పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇన్ని చేసినా సకాలంలో కూలీలకు డబ్బు అందడం లేదు. సాధారణ రోజుల్లో సైతం కూలీలకు వారానికోసారి వేతనం చెల్లింపు జరగడం లేదు. జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో తపాలాశాఖ, మరికొన్ని పంచాయతీల్లో బ్యాంకులు, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా కూలీలకు వేతన పంపిణీ ఏర్పాట్లు జరిగాయి. వేతనాలు నేరుగా పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్ పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. కూలీలకు వారానికోసారి వేతనాలు పంపిణీ చేయడానికి బ్యాంకులు జీరోమాస్‌లాంటి సంస్థలను సర్వీస్ ప్రొవైడర్లుగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇలా అంచెలంచెలుగా వ్యవస్థలు ఏర్పడినా కూలీలకు మాత్రం ఠంఛన్‌గా వేతనాలు అందించే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ప్రధానంగా భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందులోని ఏజెన్సీ ప్రాంతాల్లో చేసిన పనికి సక్రమంగా వేతనం అందడం లేదని కూలీలు ఆందోళన చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. చేసిన పనికి సంబంధించి అధికారులు, కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో వాటి విచారణలకే ఉన్నతస్థాయి అధికారులు పరిమితమయ్యారు.. తప్ప కూలీల ఇబ్బందులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఈనెలలో కూడా వేతనం రాకుంటే తాము ఎలా బతకాలని మరోవైపు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.