గుండెచెరువు
కర్నూలు రూరల్: ఏటా అదే అలసత్వం.. నిర్లక్ష్యం.. వ్యవసాయానికి జీవధారమైన చెరువుల మరమ్మతుల్లో అంతులేని జాప్యం. ఫలితం వేలాది ఎకరాలు బీడు భూములుగా దర్శనం. వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం. వరుణుడు కరుణిస్తే జిల్లాలో చెరువులు, కుంటలు నిండుతాయి. అయితే నీరు నిలబడేందుకు పట్టిష్టమైన కరకట్టలు ఉండడంలేదు. తూములు శిధిలావస్థకు చేరి అప్పటికే సాగు చేసిన పంటపొలాలు మునకకు గురవుతున్నాయి.
కాల్వలు సైతం అధ్వానంగా ఉండి రైతుకు పరీక్ష పెడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలతో ఖరీఫ్ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు చెరువుల బాగోగులను పట్టించుకోలేదు. మరమ్మతుల కోసం కనీసం నిధులు కూడా విడుదల కాలేదు. గతంలో వివిధ పథకాల కింద మరమ్మతు, పునరుద్ధరణ పనుల కోసం సుమారు రూ. 243 కోట్ల రూపాయలు(నాలుగేళ్లలో) ఖర్చు చేసినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. తూతూ మంత్రంగా పనులు చేయడంతో చెరువుల కింద అదనంగా ఒక ఎకరా ఆయకట్టు కూడా పెరగలేదు.
జిల్లాలో చెరువుల దుస్థితి ఇది..
ఆలూరు: మండల పరిధిలోని ఆలూరు, కురువళ్లి, అరికెర, పెద్దహోతూరు, హత్తిబెళగల్ చెరువులు బ్రిటీష్ కాలం నాటివి. ఈ చెరువుల్లో పూడిక పూర్తిగా పేరుకుపోయింది. భారీ వర్షాలు కురిసిన ప్రతియేటా కురువళ్లి, అరికెర తదితర గ్రామాల్లో ఉన్న చెరువులకు గండి పడుతూనే ఉన్నాయి. గత ఆరేళ్ల క్రితం హుళేబీడు గ్రామంలో జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.కోటి రూపాయలతో నిర్మించిన చెరువు ఇంతవరకు నిండ లేదు
ఆస్పరి: మండలంలో వెంగళాయదొడ్డి, చిన్నహోతూరు, ముత్తుకూరు చెరువుల కింద 1300 ఎకరాలు సాగవుతోంది. భారీ వర్షాలు వస్తే వీటిలో నీరు నిల్వ ఉండటం లేదు.
చిప్పగిరి: మండలంలోని తిమ్మాపురం చెరువు కొన్నేళ్లుగా ఆయకట్టు రైతులకు ఎలాంటి ప్రయోజనాన్ని అందించడం లేదు. ప్రతియేటా వర్షాలు కురిసి చెరువు నిండినా గండ్లు పడి నీరు వృథాగా పోతోంది.
హాలహర్వి: మండలంలో చింతకుంట, విరుపాపురం, కామినహాల్, బిలేహాల్ చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల కింద దాదాపు 1100 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. భారీ వర్షాలు కురిసిన ప్రతియేటా బిలేహాల్, కామినహాల్ చెరువులకు గండ్లు పడుతూనే ఉన్నాయి.
దేవనకొండ: మండలంలోని కరివేముల, మాచాపురం, నేలతలమరి గ్రామాల్లో బ్రిటీష్ కాలం నాటి చెరువులు ఉన్నాయి. వీటి కింద దాదాపు రెండు వేలకు పైగా ఆయకట్టు భూములు ఉన్నాయి. పాలకులు పట్టించుకోక పోవడంతో వీటిలో పూడిక పేరుకుపోయింది.
హొళగుంద: మండలంలోని హెబ్బటం, నెరణికి, ఎల్లార్తి, సుళువాయి తదితర గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. గతంలో భారీ వర్షాలతో హెబ్బటం చెరువుకు పెద్ద ఎత్తున గండి పడి వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
డోన్: సబ్‌డివిజన్‌లోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో 45 చెరువులు ఉన్నాయి. వీటి కింద 15వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. డోన్ మండలంలోని వెంకటాపురం చెరువు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 3500 ఎకరాలు సాగు కావాల్సి ఉంది. అయితే పదేళ్లుగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరు కోలేదు. మరమ్మతుల కోసం రూ. 37లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది.
కోడుమూరు: నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, కర్నూలు మండలాల్లో 15 చెరువులు, 5 కుంటల ద్వారా 22,900 ఎకరాలు సాగునీరు అందుతోంది. కోడుమూరు మండలంలోని కొత్తపల్లె చెరువు కరకట్టలు బలహీనం కావడంతో నీరు నిల్వ ఉండడం లేదు. ఎర్రదొడ్డి, అమడగుంట్ల పోచమ్మ చెరువుల నామ రూపాలే కనిపించడం లేదు. తిమ్మాపురం చెరువు కింద 180 ఎకరాలు, మునగాలలోని కత్వంక చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తూములు శిథిలావస్థకు చేరడంతో చెరువుల్లోని నీరంతా వృథాగా పోతుంది. కర్నూలు మండలంలో బి.తాండ్రపాడు, తులశాపురం, గార్గేయపురం చెరువులు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.
బనగానపల్లె: మండలంలో అక్కజమ్మ పసుపల, రామతీర్థం, మీరాపురం, యనకండ్ల చెరువులు అభివృద్ధి చెందలేదు. మరమ్మతుల కోసం జోళాపురం చెరువుకు రూ. 16 లక్షలు, యనకండ్ల చెరువుకు రూ. 15 లక్షల నిధులు మంజూరై టెండర్ల పక్రియ పూర్తయింది. అయితే సంబంధిత కాంట్రాక్టర్ మృతితో అభివృద్ధి పనులు మొదలు కాలేదు. 260 ఎకరాల ఆయకట్టు గల అక్కజమ్మ చెరువు మధ్యలో గాలేరు నగరి సుజల స్రవంతి కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో ఆ చెరువు ఉనికి కోల్పోయింది. కోవెలకుంట్ల: మండలంలోని మారుతినగర్ సమీపంలో ఉన్న లింగారెడ్డి చెరువు నిరుపయోగంగా మారింది. ఈ చెరువు పరిధిలో 300 ఎకరాలకుసాగునీరందడం లేదు. జోళదరాశి పెలైట్ ప్రాజెక్టు ద్వారా చెరువుకు నీరు మళ్లించాలనే ప్రయత్నాలు ఫలించలేదు.
సంజామల: మండలంలో రాంభ్రదునిపల్లె, ముక్కమల్ల, నొస్సం, కానాల చెరువులు ఉన్నాయి. రాంభద్రునిపల్లె చెరువు కింద 800 ఎకరాల ఆయకట్టు ఉండగా రూ.70 లక్షలు వెచ్చించి కుడి, ఎడమ కాల్వలు ఏర్పాటు చేశారు. తూము ఎత్తును పెంచకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందటం లేదు. ముక్కమల్ల చెరువు కింద 520 ఎకరాల సాగుభూమి ఉంది. కాల్వల్లో పూడిక తీయకపోవడంతో సాగునీందని పరిస్థితి నెలకొంది. నొస్సం చెరువు పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ చెరువు కింద 600 ఎకరాల సాగు భూమి ఉండగా సంగం కూడా సాగుకావడం లేదు. కానాల చెరువు కింద 350 ఎకరాల ఆయకట్టు భూమి ఉండగా తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి.