మొక్కకు ఊపిరి
♦ రైతన్నకు ఊరట చినుకులతో చిగురిస్తున్న ఆశలు
♦ ఇప్పటి వరకు 122.9 మి.మీ. వర్షపాతం నమోదు
♦ ‘సాధారణం’కంటే అధికమే..
♦ 1.86 లక్షల హెక్టార్లకు చేరుకున్న సాగు విస్తీర్ణం
♦ ఇంకా పెరిగే అవకాశం పరిస్థితి ఆశాజనకమే..
మూడు ఎకరాలలో పెసర, సోయ పంటలు వేశాను. అంతర పంటగా కంది సాగు చేస్తున్నాను. ఇప్పటి వరకు కురిసిన వర్షాలు ఆశాజనకంగానే ఉన్నాయి. నెల రోజుల వరకు నీటితడి అవసరం లేదు. అప్పుడప్పుడు వర్షాలు కురిస్తే పంటలు ఏపుగా పెరుగుతాయి. కురిసిన వర్షాలు మాకు మంచే చేశాయి. -నింగాల సాయిలు, బాన్సువాడ, కంగ్టి మండలం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ ఆశలు చిగురిస్తున్నా యి. రెండేళ్లుగా కరువుతో అతలాకుతలమైన మెతుకుసీమ ఇప్పుడిప్పుడే కుదటపడుతోంది. నాలుగు రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చేనెల మరింతగా వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతుండటంతో ఖరీఫ్‌పై రైతుల్లో భరోసా పెరుగుతోంది. ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. విత్తులు విత్తుకున్నాక వర్షాల జాడలేకపోవటంతో మొలకెత్తిన మొక్క లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
కొన్నిరోజులుగా మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో పంటలకు ఊపిరి ఊదినట్లయింది. ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఈ నెలలో 117.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 122.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 4.8 మి.మీ. అధికం. గత ఏడాది జూన్ మాసంలో 129 మి.మీటర్ల వర్షపాతానికి 125.6 మి.మీటర్లే నమోదైంది. సాధారణం కంటే 2.7 మి.మీ. మేర తక్కువ వర్షపాతం నమోదైంది. ఈసారి సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.
1.86 లక్షల హెక్టార్టలో పంటల సాగు
ఖరీఫ్‌లో వర్షాలు కురుస్తుండటంతో పంటల సాగు ఊపందుకుంది. జిల్లాలో ఇప్పటి వరకు 1,86,475 హెక్టార్టలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. వరి సాధారణ విసీర్ణం 82,206 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 8,533 హెక్టార్టలో వరి సాగు చేశారు. అలాగే 21,532 హెక్టార్ల చెరకు సాధారణ విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు 6,814 హెక్టార్టలో చెరకు నాటారు. ఆరుతడి పంటలకు సంబంధించి 1,79,661 హెక్టార్టలో పంటలు వేశారు. 4,116 హెక్టార్టలో జొన్న, 59,997 హెక్టార్లలో మొక్కజొన్న, 13,703 హెక్టార్టలో పెసర, 8147 హెక్టార్టలో మినుము, 23,863 హెక్టార్టలో కంది, 17,938 హెక్టార్టలో సోయాబీన్, 104 హెక్టార్టలో నువ్వులు, 80 హెక్టార్టలో ఇతర పప్పుధాన్యాల పంటలను రైతులు సాగు చేశారు.
కాగా వ్యవసాయశాఖ ఖరీఫ్ పత్తి పంట వేసుకోవద్దని, వరి సాగు తగ్గించాలని ప్రచారం చేసినా ఫలితం కనిపించటంలేదు. రైతులు అత్యధికంగా పత్తిపంట సాగువైపే మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 1.22 లక్షల హెకార్లు ఉండగా రైతులు ఇప్పటి వరకు 51,545 హెక్టార్టలో పత్తి సాగు అవుతోంది. వర్షాలు కురుస్తుండటంతో గజ్వేల్, సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పత్తి స్థానంలో సోయాబీన్ సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం కానరావటంలేదు.