చేతు లెత్తేసిన గ్రామీణాభివృద్ధి శాఖ | Lettesina the hands of the Ministry of Rural Development | Sakshi
Sakshi News home page

చేతు లెత్తేసిన గ్రామీణాభివృద్ధి శాఖ

Published Sun, Aug 25 2013 4:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

Lettesina the hands of the Ministry of Rural Development

సాక్షి, కొత్తగూడెం : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉసూరుమంటోంది.  నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉన్న ఈ పథకంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. నిధుల్లేవం టూ గ్రామీణాభివృద్ధి శాఖ చేతులెత్తేయడంతో నెలన్నరరోజులుగా జిల్లాలోని కూలీలకు వేతనం చెల్లింపు నిలిచిపోయింది. దీంతో కూలీలకు రూ.10 కోట్లు వేతనం బకాయి పేరుకుపోయింది. కూలీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.  ఉపాధి హామీ నిబంధనల ప్రకారం వారానికోసారి కూలీలకు వేతనాలు అందించాలి.

కానీ  ఈ నిబంధనను సంబంధిత శాఖ అధికారులు బేఖాతర్ చేస్తుండడం గమనార్హం. నిధులు లేవని గత నెల 7 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా కూలీలకు వేతనాల చెల్లింపులను గ్రామీణాభివృద్ధి శాఖ నిలిపివేసింది. కూలీలకు వేతనాలు నిలిపివేసిన సదరు శాఖ .. అధికారులు, సిబ్బందికి మాత్రం జీతభత్యాల చెల్లింపు ఠంఛన్‌గా చేస్తోంది. ప్రస్తుతం పల్లెల్లో ‘ఉపాధి’ కరువు కాగా, చేసిన పనికి కూలీ డబ్బు కూడా అందకపోవడంతో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పస్తులతో అలమటిస్తున్నామని కూలీలు అధికారులతో మొర పెట్టుకుంటున్నా మేము చేసేదేమీ లేదని వారు చేతులెత్తేశారు.
 
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 5,77,053 వేల మంది శ్రామికులు జాబ్ కార్డు కలిగి ఉన్నారు. పనుల కల్పనకు ప్రభుత్వం శ్రమశక్తి గ్రూపుల ఏర్పాటు తప్పనిసరి చేయడంతో వీరంతా 29,250 గ్రూపులుగా ఏర్పడి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గత నెల  నుంచి కూలీ డబ్బు చెల్లింపు నిలిచిపోయింది. గత నెల, ఈ నెల 23 వరకు కలిపి సుమారు 40 వేల మంది కూలీలకు  10 కోట్ల రూపాయలు వేతనంగా చెల్లించాలి. దీంతో పాటు ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ సమస్యవల్ల దీర్ఘకాలికంగా చెల్లించని వేతనాలు కలిపితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు కార్యాలయం జిల్లాలో మొత్తం కూలీలకు చెల్లించాల్సిన బకాయిల వివరాల సేకరణలో పడింది. కొన్ని మండలాల నుంచి ఇప్పటికే వివరాలు అందగా మరికొన్ని మండలాల నుంచి అందాల్సి ఉంది.
 
నిర్వీర్యమవుతున్న పంపిణీ వ్యవస్థలు..
 ఉపాధి నిధులు సక్రమంగా ఖర్చు చేయడానికి, కూలీలకు డబ్బు చెల్లింపునకు ప్రభుత్వం పలు రకాలుగా పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇన్ని చేసినా సకాలంలో కూలీలకు డబ్బు అందడం లేదు. సాధారణ రోజుల్లో సైతం కూలీలకు వారానికోసారి వేతనం చెల్లింపు జరగడం లేదు. జిల్లాలో పలు  గ్రామ పంచాయతీల్లో తపాలాశాఖ, మరికొన్ని పంచాయతీల్లో బ్యాంకులు, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా కూలీలకు వేతన పంపిణీ ఏర్పాట్లు జరిగాయి. వేతనాలు నేరుగా పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్ పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. కూలీలకు వారానికోసారి వేతనాలు పంపిణీ చేయడానికి బ్యాంకులు జీరోమాస్‌లాంటి సంస్థలను సర్వీస్ ప్రొవైడర్లుగా ఏర్పాట్లు చేసుకున్నాయి.

ఇలా అంచెలంచెలుగా వ్యవస్థలు ఏర్పడినా కూలీలకు మాత్రం ఠంఛన్‌గా వేతనాలు అందించే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ప్రధానంగా భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందులోని ఏజెన్సీ ప్రాంతాల్లో  చేసిన పనికి సక్రమంగా వేతనం అందడం లేదని కూలీలు ఆందోళన చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. చేసిన పనికి సంబంధించి అధికారులు, కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో వాటి విచారణలకే ఉన్నతస్థాయి అధికారులు పరిమితమయ్యారు.. తప్ప కూలీల ఇబ్బందులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఈనెలలో కూడా వేతనం రాకుంటే తాము ఎలా బతకాలని మరోవైపు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement