ఆత్మకూరు రూరల్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా చాలా గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు. దీంతో వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతుంది. వలసల నివారణ కోసం దృష్టి సారించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పనుల్లేక కొందరు, చేసిన పనులకు సరైన వేతనాలు ఇవ్వలేదంటూ మరికొందరు ఈ విధంగా వలస బాట పట్టారు. ఇలాంటి పరిస్థితులు ఆత్మకూరు మండలంలోని కురుకుంద, అమలాపురం, ముష్టపల్లె, వడ్లరామాపురం గ్రామాల్లో వెలుగు చూస్తున్నాయి. ఆత్మకూరు మండలంలో 771 శ్రమశక్తి సంఘాలున్నాయి.
వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టడంతో అన్ని గ్రామాల్లో పనులు కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశించింది. అందులో ఆత్మకూరు మండలంలో 3వేల మందికి పైగా ఉపాధి కల్పించేలా లక్ష్యాలను నిర్దేశించారు. జనవరి మాసం నుంచి పనులు ప్రారంభించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో పనులు కల్పించడంలో విఫలమయ్యారు. మండలంలో 13,241 మంది ఉపాధి కూలీలుండగా ప్రస్తుతం 110 మంది మాత్రమే పనులు చేస్తున్నారు. వీటిలో పనులు కల్పించడంలో అధికారులు ఏమేరకు లక్ష్యాలు సాధిస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది.
ఇందిరేశ్వంలో 139 మంది, నల్లకాల్వలో 130 మంది మినహా ఏ గ్రామంలో కూడా అధిక సంఖ్యలో పనులకు వెళ్లడం లేదు. ఇదిలా ఉంటే కురుకుంద గ్రామంలో చేసిన పనులకు కేవలం రూ.30, రూ.40లు మాత్రమే వేతనాలు రావడంతో నిరాశకు లోనైన వారు మిరపపండు తెంచేందుకు గానూ రూ.200, రూ.300లు కూలిలు పడుతున్నాయని మూటె, ముల్లెలు సర్దుకుని గుంటూరు, దోర్నాల, కుంట, తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అందరికీ పనులు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.
నేటికీ పనులకు నోచుకోని గ్రామాలు :
మండలంలో పనులు ప్రారంభించి దాదాపు మూడునెలలు కావస్తోంది. అయితే కురుకుంద, అమలాపురం, ముష్టపల్లె గ్రామాల్లో నేటికీ పనులు కల్పించలేదు. అధికారులు పనులు కల్పిస్తామని గ్రామసభలు నిర్వహించినప్పటికీ అమలు చేయలేదు. అమలాపురంలో రాజకీయ జోక్యంతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించడంతో పనులు చేపట్టలేదు.
కురుకుంద, ముష్టపల్లె గ్రామాల్లో పనులకు తగ్గ వేతనాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అలాగే క్రిష్ణాపురం గ్రామంలో గతేడాది చేసిన పనులకు గానూ వేతనాలు చెల్లించకపోవడంతో ఆ గ్రామంలో కొందరు పనులకు వెళ్లడం లేదు. మూడు గ్రామాల్లో ఇప్పటి వరకూ దాదాపు వంద కుటుంబాలు వలసలు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. అందువల్ల సంబంధిత అధికారులు స్పందించి గ్రా మీణ ప్రాం తాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి, వల సలు వెళ్లకుండా అందరికీ పను లు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అందరికీ పనులు కల్పించేందుకు చర్యలు : మధుబాబు, ఏపీఓ
మండలంలోని అన్ని గ్రామాల్లో అందరికీ పనులు కల్పించేవిధంగా చర్యలు తీసుకున్నాం. వేతనాల విషయంలో వ్యత్యాసం వల్ల వలసలు వెళ్తున్నారు. అయితే అందరికీ పనులు కల్పించి వలసలు వెళ్లకుండా చూస్తాం. ప్రతి గ్రామంలో పర్యటించి పనులకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి పనులు కల్పించేలా వివరిస్తున్నాం. వేతనాల విషయంపై ఉన్నతస్థాయి అధికారులకు తెలియజేస్తాం.
‘ఉపాధి’ లేక వలస బాట
Published Sat, Mar 15 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement