వాడివేడిగా.. | Vadivediga .. | Sakshi
Sakshi News home page

వాడివేడిగా..

Published Sun, Nov 23 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

వాడివేడిగా..

వాడివేడిగా..

 కర్నూలు(అగ్రికల్చర్) :  కేంద్రం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు వందల కోట్లు వస్తున్నాయి.. ఖర్చవుతున్నాయి. కానీ అభివృద్ధి జాడలేదు. రోడ్లు లేవు... కాల్వలు  లేవు. సుస్థిరమైన సహజ వనరుల అభివృద్ధికి పాటుపడాల్సి ఉన్నా ప్రగతి అనేదే లేకుండాపోయింది. నిధులు ఏమవుతున్నాయి, ఎటుపోతున్నాయంటూ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్రంగా ధ్వజమెత్తారు.

శనివారం కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై నంద్యాల ఎస్పీ ఎస్పీవై రెడ్డి అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, కర్నూలు, పాణ్యం, డోన్, ఆదోని, నందికొట్కూరు, కోడుమూరు, ఆలూరు ఎమ్మెల్యేలు ఎస్.వి.మోహన్‌రెడ్డి, గౌరుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ,  గుమ్మనూరు జయరాం, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో సహా టీడీపీ ఎమ్మెల్యే గైర్హాజర్ అయ్యారు.

వివిధ శాఖలకు చెందిన 13 అంశాలపై చర్చ జరగాల్సి ఉన్నా ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్స్, ఇందిర  జలప్రభ, ఐఏవై, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం(పింఛన్లు), ఐసీడీఎస్, అటవీశాఖ, గిరిజన ఉపప్రణాళికపై మాత్రమే చర్చ జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై ఎంపీతోపాటు, ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమాలను వివరిస్తూ ఈ ఏడాది ఉపాధి పనులకు లేబర్ రిపోర్టు తగ్గిందని, అందువల్ల లక్ష్యాలు సాధించలేకపోయామని డ్వామా అదనపు పీడీ నాగసులోచన పేర్కొన్నారు.

దీనిపై ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పనులులేక అల్లాడుతున్నారని, దీనికి తోడు కరువు వచ్చిందని, ఈ సమయంలో  ఉపాధి పనులకు లేబర్ రావడం లేదనడం దారుణమన్నారు. పనులు కల్పించకపోవడం వల్ల లేబర్ రిపోర్టు తగ్గిందని అన్నారు. 13 కీలకమైన అంశాలపై 3 గంటల్లో పూర్తిస్థాయిలో చర్చించడం ఎలా సాధ్యం, పనికిరాని జన్మభూమి - మా ఊరు కార్యక్రమానికి ఊళ్లుళ్లూ తిప్పారు. దీనివల్ల జరిగింది ఏమీ లేదు.

ముఖ్యమైన సమావేశం నిర్వహించడానికి మాత్రం తగిన సమయం లేకపోవడం దారుణమని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పథకాల అమలు లొసుగులు సమగ్ర చర్చ ద్వారా  బయటికి వస్తాయి. దీనిని బట్టి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చట్టాలు తయారు చేస్తారు. లొసుగులు బయటికే రాకపోతే చట్టాలు ఎలా సాధ్యమవుతాయంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా తగిన సమయం కేటాయించాలని తెలిపారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చెక్‌డ్యామ్‌లు నిర్మించారా...బావులు తవ్వారా.. అంటూ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరా తీశారు.  ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం లేదని, కేవలం మరమ్మతులు మాత్రమే ఉన్నాయని, అయితే బావులు మాత్రం తవ్వుకోవచ్చని డ్వామా పీడీ పుల్లారెడ్డి తెలిపారు. ఎన్ని చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేశారు. ఎన్ని  బావులు తవ్వారో వివరించాలని ఎంపీ కోరగా చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయని, బావుల తవ్వకం ఇంకా మొదలు కాలేదని అధికారులు పేర్కొనడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో ఐదారు ఎకరాల్లో సర్కులేషన్ ట్యాంకులు నిర్మించాలని పదేపదే కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని డోన్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. నందికొట్కూరు ప్రాంతంలో పనులు లేక వ్యవసాయ కూలీలు అల్లాడుతుంటే ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు యంత్రాలతో జరుగుతున్నాయని, ఇందువల్ల కేంద్రం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో యంత్రాల వినియోగం లేదని, అయితే ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్‌లలో మాత్రం ఉందని డ్వామా అధికారులు తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ అక్రమాలపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో 9090 కేసులు పెట్టామని, రూ.9 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలిందని, ఇప్పటివరకు రూ.2 కోట్లు రికవరీ అయిందని అధికారులు తెలిపారు. క్రిమినల్ కేసులు పెట్టారా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా  32 కేసులు పెట్టామని తెలిపారు.

9 వేలకుపైగా అవినీతి కేసులు ఉంటే క్రిమినల్ కేసులు 32 మాత్రమేనా బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కలెక్టర్ జోక్యం చేసుకుంటూ కేసుల స్థాయిని బట్టి నెల రోజుల్లో అందరిపైన క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే కదా అవినీతి  జరిగింది, మరి అధికారులపై చర్యలు తీసుకోరా.. అంటూ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు 3  నెలలుగా పేమెంట్లు రావడం లేదని, ఇందువల్ల అల్లాడుతున్నారని, అధికారులకు ఒక్క నెల జీతం రాకపోతే ఊరుకుంటారా అంటూ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ప్రశ్నించారు.

కల్లూరు ఏపీఓ రాజారావు అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు కానీ ఆయనపై  చర్యలు లేవు కానీ ఆయనకు జిల్లాస్థాయిలో పోస్టు కల్పిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమంటూ ధ్వజమెత్తారు. ఉపాధి పేమెంట్ల పంపిణీలో  కొంత ఇబ్బంది ఉందని, వచ్చే నెల ఒకటి నుంచి పోస్టల్ ద్వారా పేమెంట్లు అందుతాయని కలెక్టర్ వివరించారు. ఏపీఓ రాజారావు విషయాన్ని పరిశీలిస్తానని పీడీ పుల్లారెడ్డి పేర్కొన్నారు. సర్పంచుల హక్కులను కాలరాస్తున్నారని డోన్, కోడుమూరు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
 
జిల్లాలో రూ.323 కోట్లతో ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్లు జరుగుతున్నా ఎమ్మెల్యేలకు కనీసం సమాచారం కూడా ఉండటం లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలు లేవు. వారి పరిస్థితి ఎలా, అందరికీ వీలుగా సామూహిక లెట్రిన్‌లు నిర్మించాలని ఎమ్మెల్యే ఐజయ్య, గౌరుచరిత కోరారు. తాను బేతంచెర్ల సర్పంచుగా ఉన్నప్పుడు లెట్రిన్‌లు నిర్మించామని, అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఇటువంటి వాటిని నిర్మిస్తే బాగుంటుందని డోన్ ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement