పరమం.. పవిత్రోత్సవం
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లోని ఉత్సవమూర్తులకు స్పృశ్య, అస్పృశ్యత కారణాలు కలిగే దోషాల నివారణకు ఏటా శ్రావణమాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది శ్రావణంలో పుష్కరాలు రావడంతో భాద్రపద శుద్ధ త్రయోదశి నుంచి బహుళ పాడ్యమి వరకు అంటే ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం మహానివేదన అనంతరం ఆలయ తలుపులు మూసివేశారు.
దేవాలయం అంతా శుభ్రం
పవిత్రోత్సవాల సందర్భంగా అంతరాలయంతో పాటు దేవాలయ ప్రాంగణాన్ని నీటితో శుభ్రం చేశారు. మధ్యాహ్నం నుంచి దర్శనం లేకపోవడంతో అన్ని హుండీలకు తాళాలు వేశారు. క్యూలైన్లు మూసివేశారు. ఒంటిగంట తరువాత ఆలయమంతా నిర్మానుష్యంగా కనిపించింది. ఇది తెలియక వచ్చిన భక్తులు రాజగోపురం బయట నుంచి అమ్మవారికి నమస్కరించుకుని వెనుదిరిగారు.
నేటి ఉదయం 9 గంటల నుంచి దర్శనం
స్నపనాభిషేకం, అమ్మవారి అలంకరణ, పవిత్రల సమర్పణ తరువాత గురువారం ఉదయం 9 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
– సాక్షి, విజయవాడ