Pay and Accounts
-
జీతాల సమస్యపై మళ్లీ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లు, సబ్ఇన్ స్పెక్టర్లకు జీతాలు అందలేదన్న అంశంపై పీఅండ్ఎల్, బడ్జెట్ అధికారులతో డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం చర్చించారు. కొత్త జిల్లాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నూతన పోస్టులకు జీతాల చెల్లింపు జీవో జారీ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యలపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మరోసారి చర్చించాలని పీఅండ్ఎల్ అధికారులను ఆదేశించారు. పోస్టులకు సంబంధించి జీతభత్యాల చెల్లింపులో పీఏఓ (పే అండ్ అకౌంట్స్) ఆదేశాలు వెళ్లేలా మరోసారి ప్రతిపాదనలు పంపాలని, రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడేలా కృషి చేయాలని పీఅండ్ ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్ ను డీజీపీ ఆదేశించారు. కాగా.. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల విభజనలో సమయంలోనూ ఇదే సమస్య తలెత్తిందని, 6 నెలల పాటు జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని డీజీపీకి పీఅండ్ఎల్ అధికారులు వివరించారు. -
అవినీతి భారతీ లక్ష్మి
► పే అండ్ అకౌంట్స్‌లో కలకలం ► సీనియర్ అసిస్టెంట్ భారతీ లక్ష్మి ఇంటిపై ఏసీబీ దాడులు ► భర్త వ్యాపార లావాదేవీలే విభేదాలతో వాస్తవాలు వెల్లడి శ్రీకాకుళం సిటీ : హొటల్ వ్యాపారంలో భాగస్వాముల మధ్య వచ్చిన వివాదాలు ఒక అవినీతి తిమింగలాన్ని ఏసీబీ వలకు చిక్కేలా చేశాయి. జిల్లా నీటి పారుదలశాఖ పరిధిలోని ప్రధాన ప్రాజెక్టు వంశధార పే అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న యలమంచిలి భారతీ లక్ష్మి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై అవినీతి నిరోధకశాఖ ఆమె ఇంటిపై దాడు లు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని బాకర్‌సాహేబ్‌పేటలో నివాసం ఉంటున్న భారతీ లక్ష్మి ఇంటికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ రంగరాజు బృందం సోదాలు చేపట్టింది. ఆమె భర్త నాగేశ్వరరావు జీటీరోడ్తోపాటు బాకర్‌సాహేబ్‌పేటలో హొటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారలావాదేవీల్లో వచ్చిన విభేదాల కారణంగా ప్రత్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ నెలరోజులుగా దృష్టి సారించి అక్రమ ఆస్తులను గుర్తించింది. వాస్తవ విలువ రూ.5కోట్లు పట్టణంలోని బాకర్‌సాహేబ్‌పేటలో ఇటీవల దుర్గాఆలయం సమీపంలో కొత్తగా ఇంటి నిర్మాణం పనులు చేపట్టారు. ఈ ఇంటితోపాటు పట్టణంలో మరో నాలుగు ఇళ్లు, విశాఖపట్నంలో మూడు ఇళ్లు, హైదరాబాదులో ఒక ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 15 ఇళ్ల స్థలాలను ఆమె కొనుగోలు చేసిన ట్లు గుర్తించారు. వీటివిలువ సుమారు రూ.1.34 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ విలువను నిర్థారించిన అధికారులు వాస్తవానికి సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. వీటికి తోడు 1308 గ్రాముల బంగారం, రూ. 87,400నగదు లభ్యమైనట్లు డీఎస్పీ రంగరాజు నిర్థారించారు. వారి బ్యాంకు లాకర్‌ను కూడా పరిశీలించి తదుపరి అంచనాలు ప్రకటిస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీరింగ్ శాఖలతో పాటు పే అండ్‌అకౌంట్స్ విభాగం కీలకమైంది. ఈ శాఖలో చెల్లింపులు కోట్లల్లో జరగాల్సి ఉంటుంది. పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగే ఈ శాఖలో అవినీతి నిరోధక శాఖ దాడులు జరపడం కలకలం రేపింది. ఈ దాడుల్లో విజయనగరం, విశాఖపట్నం సీఐలు లక్ష్మోజీ, రామకృష్ణ కూడా పాల్గొన్నారు. -
ఇదేం పద్ధతి?
అడ్వాన్స్ లేకుండా పనులు ఎలా సాధ్యం మేడారం జాతర పనులపై పే అండ్ అకౌంట్స్ అభ్యంతరం ఇరుక్కుపోయిన ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమస్య నుంచి బయటపడేందుకు సచివాలయం వేదికగా పైరవీలు ఎవ్వరూ మనల్ని చూడట్లేదు.. ఏం చేసినా పరవాలేదు అనే ధీమాతో మేడారం జాతర పనుల్లో నిబంధనలను తుంగలో తొక్కిన ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు.. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నారు. జాతర పనుల్లో నిబంధనలు పక్కనపెట్టిన విషయూన్ని పే అండ్ అకౌంట్స్ విభాగం గుర్తించింది. ఏ పద్ధతి ప్రకారం పనులు చేపట్టారో తెలపాలని వివరణ కోరింది. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఐటీడీఏ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సచివాలయం వేదికగా ఎలాగైనా సమస్యను పరిష్కరించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సాక్షి, హన్మకొండ :మేడారం జాతర సందర్భంగా రెడ్డిగూడెం, చిలకలగుట్ట దగ్గర, జంపన్నవాగులో ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్, మంచినీటి సరఫరా పనులు నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ టెండర్లు ఆహ్వానించింది. అయితే జాతరకు సమయం తక్కువగా ఉందని పేర్కొంటూ ఈ టెండర్లు రద్దు చేస్తూ దాదాపుగా 1.42 కోట్ల విలువైన పనులు శాఖ తరఫున సొంతంగా చేపడతామని చివరి నిమిషంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రకటించారు. ఈ అంశంలో కలెక్టర్ దగ్గరి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని పనులు చేపట్టారు. జాతర ముగిసిన తర్వాత ఈ పనికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ పే అండ్ అకౌంట్స్ విభాగానికి సంబంధిత ఫైలును గిరిజన సంక్షేమశాఖ, ఇంజినీరింగ్ విభాగం పంపింది. అడ్వాన్స లేకుండా పనులెలా..? ప్రభుత్వ అధికారులు తమ శాఖ తరఫున సొంతంగా పనిని చేపట్టాలంటే పని మొత్తం విలువలో కొంత మొత్తాన్ని మొదట అడ్వాన్సుగా తీసుకుని పనిని ప్రారంభించాలి. ఆ తర్వాత దశల వారీగా పని చేపడుతూ అడ్వాన్సులు తీసుకుంటూ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే పని పూర్తి చేశాం.. మాకు బిల్లులు మంజూరు చేయండి అంటూ పే అండ్ అకౌంట్స్ విభాగానికి పంపిన ఫైలులో పనిని చేపట్టేందుకు అడ్వాన్సులు తీసుకున్నట్లుగా ఎక్కడా పేర్కొనలేదు. అందుకు సంబంధించిన పత్రాలను దాఖలు చేయలేదు. దాంతో ఈ అంశాన్ని తప్పు బడుతూ పే అండ్ అకౌంట్స్ విభాగం.. బిల్లులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. 1.40 కోట్ల రూపాయల విలువైన పనులు ఎటువంటి అడ్వాన్సులు తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పనులు పూర్తి చేశారో చెప్పాలంటూ వివరణ కోరింది. అడ్వాన్సులు తీసుకోకుండా పనులు పూర్తి చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారో తెలపాలంటూ నిలదీసింది. కమీషన్ల వల్లే సమస్య తమకు అనుకూలుడైన వ్యక్తికి పనిని కట్టబెట్టేందుకు గిరిజన సంక్షేమశాఖ, ఇంజినీరింగ్ అధికారులు నిబంధనలను తొక్కిపెట్టి టెండర్లు రద్దు చేశారనే ఆరోపణలు జాతర ముందే వినిపించాయి. శాఖ తరఫున పనిచేస్తున్నట్లు కాగితాల్లో పేర్కొన్నా... వాస్తవంలో ఈ పనులు ఏటూరునాగారానికి చెందిన ఓ కాంట్రాక్టరుకు కట్టబెట్టారు. దానితో పనిని చేపట్టేందుకు అడ్వాన్సులు తీసుకోవాల్సిన అవసరం అధికారులకు రాలేదు. కానీ జాతర పూర్తయిన తర్వాత బిల్లుల మంజూరు సమయంలో శాఖ తరఫున పనిని చేపట్టామని పేర్కొన్న అధికారులు అందుకు సంబంధించిన అడ్వాన్సు బిల్లులను సమర్పించలేక పోయారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఈ పనికి సంబంధించిన బిల్లులు మంజురుకు ఫైలును పే అండ్ అకౌంట్స్ విభాగానికి పంపారు. ఇప్పుడు అక్కడ కథ అడ్డం తిరిగింది. చినికి చినికి గాలివాన అడ్వాన్సు రూపంలో సొమ్ము డ్రా చేయకుండా గిరిజన సంక్షేమ శాఖ కింది స్థాయి సిబ్బంది పనులు చేపడుతుంటే దాన్ని పర్యవేక్షించాల్సిన పై అధికారులు ఎందుకు చూస్తుండిపోయారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పే అండ్ అకౌంట్స్ విభాగం ఈ అంశాన్ని తప్పు పట్టే వరకు ఏ ఒక్కరూ ఈ ఉందంతంపై నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పే అండ్ అకౌంట్స్ విభాగం ఈ వ్యవహారాన్ని తప్పు పట్టడంతో ఈ అంశం రాష్ట్ర రాజధానికి చేరింది. ఇంతకాలం తమ మధ్య గుట్టుగా ఉన్న అంశం బట్టబయలు కావడంతో ఇంజనీరింగ్ అధికారుల్లో గుబులు మొదలైంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున విచారణ జరిగితే చాలా మంది అధికారులకు అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఎలాగైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సచివాలయం కేంద్రంగా పైరవీలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. -
టీటీడీలో పే అండ్ అకౌంట్స్ విభాగానికి మంగళం
పాత పద్ధతిలోనే జీతభత్యాల చెల్లింపునకు మొగ్గు జూన్ ఒకటిన జీతాల చెల్లింపు అనుమానమే ఉద్యోగుల్లో ఆందోళన సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ఉద్యోగుల జీతభత్యాలను సులభంగా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పే అండ్ అకౌంట్స్ విభాగానికి మంగళం పాడుతున్నారు. ఈ విభాగాన్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు నిన్నటికి నిన్న అధికారులు హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లను ఆయా విభాగాల శాఖాధిపతులకు శనివారంలోగా అందజేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో టీటీడీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మే మాసానికి చెందిన జీతాలు జూన్ ఒకటో తేదీన వచ్చే అవకాశాలు లేవని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల కోసం నాలుగు సంవత్సరాల కిందట ప్రత్యేకంగా పే అండ్ అకౌంట్స్ విభాగం ఏర్పాటు చేశారు. హెచ్ఆర్ మ్యాప్స్ అనే ప్రరుువేటు కంపెనీ సహకారంతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో అన్ని విభాగాల సిబ్బంది, అధికారుల జీతాలు,అలెవెన్స్‌లను పే అండ్ అకౌంట్స్ విభాగం చెల్లించేది. టీటీడీలో 9,163 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా 25 కోట్ల రూపాయలను జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విభాగం ఏర్పాటు కాకముందు ఆయా శాఖల అధిపతుల కార్యాలయాల నుంచి జీతాల బిల్లులు అకౌంట్స్ విభాగానికి వెళ్లేవి. ఇదంతా పెద్ద తతంగం కావడంతో అన్ని విభాగాల సిబ్బంది జీతాలు చెల్లించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు ఒక కంపెనీకి బాధ్యతలు అప్పగించి టీటీడీ పరిపాలనాభవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తగా సాంకేతిక పరికరాలు, ఖరీదైన ఫర్నీచర్ కొనుగోలు చేశారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విభాగంలో 187 మంది సిబ్బందిని కూడా నియమించారు. అయితే సిబ్బంది కొరత తదితర కారణాలు సాకుగా చూపి కొందరు అధికారులు ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదనే భావన కల్పించారు. దీంతో పాత పద్ధతిలో జీతాలు చెల్లించాలని అధికారులు నిర్ణయించి హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. జీతభత్యాల చెల్లింపులకుగాను పాత పద్ధతిని పునరుద్ధరించడంతో వచ్చే నష్టాలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు తాజా ఆదేశాలు జారీ చేయడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఉన్న వ్యవస్థను ఒక్కసారిగా పూర్తిగా రద్దు చేసి సర్వీసు రిజిస్టర్లు ఆయా శాఖల అధిపతులకు అప్పగిస్తే ఆయా రిజిస్టర్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్టయితే సంబంధిత ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో ఉంది. పాత పద్ధతిలో జీతభత్యాల చెల్లింపులు సక్రమంగా జరిగే వరకు పే అండ్ అకౌంట్స్ విభాగం పనిచేసినట్టయితే ఇటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశాలు ఉన్నాయనేది వారి వాదనగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు సర్వీసు రిజిస్టర్లు శాఖాధిపతులకు అప్పగిస్తే వాటిని పరిశీలించి జీతాలు చెల్లించేందుకు పదిరోజులకు పైగా సమయం పడుతుందని అంటున్నారు. ఇదే జరిగితే జూన్ మాసంలో చెల్లించాల్సిన జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం తప్పదని చెబుతున్నారు. మొత్తానికి ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల వ్యవహారంలో టీటీడీ అనుసరిస్తున్న ధోరణి ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్నట్టుగా తయారయిందనే విమర్శలు వస్తున్నాయి.