అవినీతి భారతీ లక్ష్మి
► పే అండ్ అకౌంట్స్‌లో కలకలం
► సీనియర్ అసిస్టెంట్ భారతీ లక్ష్మి ఇంటిపై ఏసీబీ దాడులు
► భర్త వ్యాపార లావాదేవీలే విభేదాలతో వాస్తవాలు వెల్లడి
శ్రీకాకుళం సిటీ : హొటల్ వ్యాపారంలో భాగస్వాముల మధ్య వచ్చిన వివాదాలు ఒక అవినీతి తిమింగలాన్ని ఏసీబీ వలకు చిక్కేలా చేశాయి. జిల్లా నీటి పారుదలశాఖ పరిధిలోని ప్రధాన ప్రాజెక్టు వంశధార పే అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న యలమంచిలి భారతీ లక్ష్మి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై అవినీతి నిరోధకశాఖ ఆమె ఇంటిపై దాడు లు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని బాకర్‌సాహేబ్‌పేటలో నివాసం ఉంటున్న భారతీ లక్ష్మి ఇంటికి చేరుకున్న ఏసీబీ డీఎస్పీ రంగరాజు బృందం సోదాలు చేపట్టింది. ఆమె భర్త నాగేశ్వరరావు జీటీరోడ్‌తోపాటు బాకర్‌సాహేబ్‌పేటలో హొటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
వ్యాపారలావాదేవీల్లో వచ్చిన విభేదాల కారణంగా ప్రత్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ నెలరోజులుగా దృష్టి సారించి అక్రమ ఆస్తులను గుర్తించింది. వాస్తవ విలువ రూ.5కోట్లు పట్టణంలోని బాకర్‌సాహేబ్‌పేటలో ఇటీవల దుర్గాఆలయం సమీపంలో కొత్తగా ఇంటి నిర్మాణం పనులు చేపట్టారు. ఈ ఇంటితోపాటు పట్టణంలో మరో నాలుగు ఇళ్లు, విశాఖపట్నంలో మూడు ఇళ్లు, హైదరాబాదులో ఒక ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 15 ఇళ్ల స్థలాలను ఆమె కొనుగోలు చేసిన ట్లు గుర్తించారు. వీటివిలువ సుమారు రూ.1.34 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ విలువను నిర్థారించిన అధికారులు వాస్తవానికి సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
వీటికి తోడు 1308 గ్రాముల బంగారం, రూ. 87,400నగదు లభ్యమైనట్లు డీఎస్పీ రంగరాజు నిర్థారించారు. వారి బ్యాంకు లాకర్‌ను కూడా పరిశీలించి తదుపరి అంచనాలు ప్రకటిస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీరింగ్ శాఖలతో పాటు పే అండ్‌అకౌంట్స్ విభాగం కీలకమైంది. ఈ శాఖలో చెల్లింపులు కోట్లల్లో జరగాల్సి ఉంటుంది. పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగే ఈ శాఖలో అవినీతి నిరోధక శాఖ దాడులు జరపడం కలకలం రేపింది. ఈ దాడుల్లో విజయనగరం, విశాఖపట్నం సీఐలు లక్ష్మోజీ, రామకృష్ణ కూడా పాల్గొన్నారు.