‘ఉపాధి బిల్లులు తక్షణం చెల్లించాలి’
అనంతపురం అర్బన్ : ఉపాధి కూలీలకు తక్షణమే బిల్లులు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు బిల్లులు రూ.28.72 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటిని విడుదల చేయకుండా వలసల నివారణ సాధ్యపడదన్నారు. పెనుకొండ మండలం అడదాకులపల్లి దళిత కాలనీ కూలీల గోవిందప్పకు పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వనందుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు.
ఆయన ఆరు వారాలు చేసిన కూలికి సంబంధించి రూ.5,700 బిల్లు పెండింగ్లో ఉందన్నారు. ఒక్క పెనుకొండ మండలంలోనే రూ.56 లక్షలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లో లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో లక్షలాది మంది వ్యవసాయ కూలీలు, పేద రైతులు వలసలు పోతుంటే నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధి హామీ కింద గిట్టుబాటు కాని పనులు చేయించి నెలల కొద్దీ బిల్లులు పెండింగ్ ఉంచుతూ పేదలను ఈ పథకానికి దూరం చేస్తోందని దుమ్మెత్తిపోశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఒ.నల్లప, కార్యవర్గ సభ్యులు బి.హెచ్.రాయుడు పాల్గొన్నారు.