పీసీబీ ఇంజనీర్‌కు 6 కోట్ల అక్రమాస్తులు
కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఇంజనీర్ రమేష్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ఆయనకు సుమారు రూ .6 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 10 చోట్ల ఉన్న రమేష్ ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు జరిగాయి. రమేష్ ఆస్తులతోపాటు ఆయన భార్య శశి ఆస్తులను కూడా వారు తనిఖీ చేశారు.
ఆయనకు మొత్తం పది ఇళ్ల స్థలాలు, మూడు ఫ్లాట్లు, పదెకరాల వ్యవసాయ భూమి, 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రమేష్ భార్య శశి పేరు మీద మూడు బ్యాంక్ లాకర్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 30-40 తులాల వరకు బంగారం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు పీసీబీ ఇంజనీర్ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.