తిక్కముదిరింది ... లెక్కే లేదంది
‘శిష్యా ఏమి చేస్తున్నావ్ ’ అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నానని గురువుకు సమాధానమిచ్చాడట వెనుకటికో శిష్యుడు. తప్పులు దిద్దుకోవడం మంచిదే కానీ చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు లేవు కాబట్టే ఈ సామెత పుట్టుకొచ్చినట్టుంది. ఈ చందంగానే చంద్రబాబు రుణమాఫీ తయారైంది. ‘నేనే మోనార్క్‌ని ... ఆర్థిక శాస్త్రం అవపోసన పట్టేశాను ... రుణమాఫీ అమలు నాకే సాధ్యమంటూ’ డాంబికాలు పలికి ఆచరణలో బోర్లా పడ్డారు. అయినా నేనే గెలిచానంటూ రెండు వేళ్లు విజయ సంకేతంగా గాలిలో ఊపుతున్న నారా నైజం అర్థం కాక రుణ మాఫీ బాధితులు జుత్తు పీక్కుంటున్నారు. హైటెక్ జాబితాల్లో ఈ తప్పులేమిటని ప్రశ్నిస్తున్నారు రైతన్నలు.
ఒంగోలు వన్‌టౌన్: ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసిన మొదటి విడత రుణమాఫీ జాబితాలు తప్పుల తడకగా తయారవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రుణం పొందిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం అమల్లో ఉన్న స్కేలు ఆఫ్ ఫైనాన్స్‌ను (ఎస్.ఒ.ఎఫ్) ప్రాతిపదికగా తీసుకోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశంలో ప్రకటించిన విషయాలకు ఆచరణలో రుణమాఫీ జాబితాల్లో పేర్కొన్న అంశాలకు అసలు పొంతనే లేకుండా పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీడీసీసీ బ్యాంకు ఆర్థిక సాయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ద్వారా వ్యవసాయ రుణాలు పొందిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ప్రధానంగా కందుకూరు ప్రాంతంలోని ఐదు సొసైటీల రైతులను రాయలసీమ జిల్లాలకు చెందిన వారుగా జాబితాలో పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వివిధ పంటల సాగుకు అక్కడి జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదించిన ఎఫ్.ఒ.ఎస్.కు జిల్లాలోని జిల్లా కమిటీ ఆమోదించిన స్కేలు ఆఫ్ ఫైనాన్స్‌కు తేడా ఉంది. ఇతర జిల్లాలకంటే జిల్లాలో పంట సాగుకే అధిక వ్యయమవుతోంది. కందుకూరు ప్రాంతంలోని ఐదు సొసైటీల్లో 773 మంది రైతులను వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులుగా జాబితాల్లో పేర్కొనడంతో ఈ రైతులందరూ ఆయా జిల్లాల స్కేలు ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా రుణమాఫీకి అర్హులు కావడంతో రూ.1.53 కోట్ల రుణాల మాఫీని నష్టపోతున్నారు.
- పోకూరు సొసైటీలో 210 మంది రైతులను అనంతపురం జిల్లాకు చెందిన వారిగా, 9 మంది రైతులను వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారిగా రుణమాఫీ జాబితాలో పేర్కొన్నారు.
- యర్రారెడ్డిపాలెం సొసైటీలో 100 మంది రైతులను చిత్తూరు జిల్లావాసులుగా జాబితాలో చూపించారు.
- మోపాడు సొసైటీలో 109 మంది రైతులను కర్నూలు జిల్లా రైతులుగా చూపించారు. తూనుగుంట సొసైటీలో 58 మంది, ధారకానిపాడు సొసైటీలో 287 మందిని చిత్తూరు జిల్లా రైతులుగా పేర్కొన్నారు.
ఈ జాబితాలను చూసిన రైతులు విస్తుపోతున్నారు. ఈ విషయమై ఇక్కడి జిల్లా రైతులను రాయలసీమ జిల్లా రైతులుగా రుణమాఫీ జాబితాల్లో పేర్కొన్న విషయమై పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదరమోహన్ బాబును వివరణ కోరగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలిసి రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరించి సవరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.