PDP chief Mehbooba Mufti
-
భారత్, బంగ్లాదేశ్ రెండూ ఒక్కటే
జమ్మూ: భారత్‌లోని మైనారిటీల పరిస్థితి మాదిరిగానే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై అణచివేత కొనసాగుతోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులు అణచివేతకు గురవుతున్నారని వింటున్నాం, మరి మన దేశంలోని మైనారిటీలు కూడా అలాంటి అనుభవాలనే చవిచూస్తున్నారు. రెండూ ఒక్కటే. నాకైతే తేడా కనిపించడం లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు బాగో లేవన్నారు. ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో ఏఎస్ఐ సర్వే వ్యవహారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దర్గాను కూడా తవ్వేస్తారా. ఇలా ఎంతకాలం?’’ అని ముఫ్తీ ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించే శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోకుంటే 1947 నాటి ఘర్షణలు పునరావృత్తమయ్యే ప్రమాదముంది’’ అన్నారు. -
గృహ నిర్బంధంలో మెహబూబా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆందోళనలు జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలను అదుపులోకి తీసుకుంది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో ఉంచింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితులున్నాయంటూ సుప్రీంకోర్టుకు చెబుతున్న కేంద్రం.. ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మెహబూబా ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు నాలుగేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరుతూ భారీ హోర్డింగులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..మరో వైపు ప్రజల నిజమైన ఆకాంక్షలను అణగదొక్కుతోందన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సమయంలో ఇలాంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆమె కోరారు. తాము శాంతియుతంగా నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదని పీడీపీ తెలిపింది. రాజ్భాగ్లో కొందరు పీడీపీ కార్యకర్తలు ‘ఆగస్ట్ 5 బ్లాక్ డే’అనే ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. కాగా, శ్రీనగర్‌లోని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫీస్‌లను పోలీసులు మూసివేశారు. -
గృహ నిర్బంధంలోకి ముఫ్తీ
శ్రీనగర్: ఉగ్రవాద కేసులో అరెస్టయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వహీద్ పర్రా కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతినివ్వడం లేదని పీడీపీ నాయకురాలు, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. "చట్టవిరుద్ధంగా నన్ను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. నా కుమార్తె ఇల్టిజాను గృహ నిర్బంధంలో ఉంచారు" అని తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబుతో సంబంధం ఉన్న వహీద్ పర్రాను బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వహీద్ పర్రా ముఫ్తీకి అత్యంత సన్నిహితుడు. ఈ సందర్బంగా ముఫ్తీ పుల్వామాలోని వాహిద్ కుటుంబాన్ని సందర్శించడానికి రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారని తెలిపారు. కాగా.. బీజేపీ మంత్రులు వారి సహాచరులు రాష్ట్రంలోని ప్రతి మూలకు తిరగడానికి అనుమతి ఉంది కానీ మేము వెళ్లాలంటే భద్రత సమస్య ఉందంటూ సాకులు చెప్తున్నారని ముఫ్తీ శుక్రవారం ట్వీట్టర్లో పేర్కొన్నారు. తన ఇంటి ముందు ఉన్న పోలీసు వాహనం ఫోటోను కూడా జత పోస్ట్ చేశారు. దక్షిణ కశ్మీర్లో ముఖ్యంగా ఉగ్రవాద బారినపడిన పుల్వామాలో పీడీపీ పునరుద్ధరణలో వహీద్ పర్రా కీలక పాత్ర పోషించారు. అక్కడి జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మొదటి దశ ఎన్నికలు నవంబర్ 28న జరుగనున్నాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్-జమ్మూ హైవేపై ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను వాహనంలో తీసుకెళ్తుండగా అరెస్టయిన డీఎస్పీ డేవిందర్ సింగ్ కేసు దర్యాప్తులో వహీద్ పర్రా పేరు బయటపడింది. నిరాధార ఆరోపణలపై వహీద్ పర్రాను అరెస్టు చేశారన్నారు. ముఫ్తీ ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 తొలగించినప్పుడు ఆమెను అదుపులోకి తీసుకుని అక్టోబర్‌లో విడుదల చేశారు. -
మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు
శ్రీనగర్: పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. గత ఏడాది ఆగస్టులో కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన సందర్భంగా ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న వారిలో మెహబూబా కూడా ఒకరు. ఆగస్టు 5వ తేదీ నాటికి ఆమె నిర్బంధకాలం ఏడాది పూర్తవుతుంది. దీంతో, మెహబూబా గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన అధికార నివాసం శ్రీనగర్‌లోని ఫెయిర్‌వ్యూ బంగళాలో ఉన్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ గనీ లోన్‌ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని లోన్ కూడా ట్విట్టర్ ద్వారా నిర్ధారించారు. ఆయన కూడా దాదాపు ఏడాదిపాటు నిర్బంధంలో ఉన్నారు. పలువురు ప్రధాన రాజకీయ నేతలు సహా నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నేతలు ఫరూఖ్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. -
విభేదాల్లేవ్.. షరతులు ఉన్నాయి!
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీతో ఎటువంటి విభేదాల్లేవని.. కానీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పలు అంశాలపై హామీ ఇవ్వాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. నెలరోజుల రాజకీయ అనిశ్చితికి తెరదించేందుకు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా.. పీడీపీ నేతలను భేటీకి ఆహ్వానించారు. పలువురు పార్టీ ప్రముఖులతో కసి ముఫ్తీ ఈ భేటీలో పాల్గొన్నారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ముందు పలు డిమాండ్లుంచారు. రాష్ట్రంలో శాంతి స్థాపన, అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ (నమ్మకాన్ని పెంచే చర్యలు) కావాలన్నారు. రాష్ట్ర సవాళ్లను అధిగమించటంలో కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలన్నారు. కశ్మీర్ అభివృద్ధి కోసమే దివంగత సీఎం సయీద్.. ప్రధాని మోదీతో దోస్తీ చేశారన్నారు. మరోవైపు, పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ నాయకత్వంలో గవర్నర్‌ను కలిశారు. ‘పీడీపీతో పొత్తు కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఆ పార్టీ (పీడీపీ) శాసనసభాపక్షనేతను ఎన్నుకున్నాకే మా స్పందన తెలియజేస్తాం’ అని నిర్మల్ మీడియాకు తెలిపారు. మోదీ-సయీద్‌లకు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉండేదన్నారు.