విభేదాల్లేవ్.. షరతులు ఉన్నాయి!
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీతో ఎటువంటి విభేదాల్లేవని.. కానీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పలు అంశాలపై హామీ ఇవ్వాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. నెలరోజుల రాజకీయ అనిశ్చితికి తెరదించేందుకు గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా.. పీడీపీ నేతలను భేటీకి ఆహ్వానించారు. పలువురు పార్టీ ప్రముఖులతో కసి ముఫ్తీ ఈ భేటీలో పాల్గొన్నారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ముందు పలు డిమాండ్లుంచారు. రాష్ట్రంలో శాంతి స్థాపన, అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ (నమ్మకాన్ని పెంచే చర్యలు) కావాలన్నారు.
రాష్ట్ర సవాళ్లను అధిగమించటంలో కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలన్నారు. కశ్మీర్ అభివృద్ధి కోసమే దివంగత సీఎం సయీద్.. ప్రధాని మోదీతో దోస్తీ చేశారన్నారు. మరోవైపు, పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ నాయకత్వంలో గవర్నర్‌ను కలిశారు. ‘పీడీపీతో పొత్తు కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఆ పార్టీ (పీడీపీ) శాసనసభాపక్షనేతను ఎన్నుకున్నాకే మా స్పందన తెలియజేస్తాం’ అని నిర్మల్ మీడియాకు తెలిపారు. మోదీ-సయీద్‌లకు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉండేదన్నారు.