pds rice seized
-
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్!
పేదల బియ్యం పక్కదారి పట్టాయి.. వేలాది క్వింటాళ్లు అక్రమర్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ దందాకు పరిగి అడ్డాగా మారింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తూ దండుకోగా.. ఇప్పుడు కొంతమంది అక్రమార్కులు తమ దందాకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పేదలు తినే బియ్యాన్ని సేకరించి.. కోళ్ల దాణా తయారీలో వాడుతున్నారు. వందలాది టన్నుల రేషన్ బియ్యాన్ని నూకల పేరుతో కోళ్ల దాణా తయారీ కోసం నిల్వ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఈ విషయం బట్టబయలైంది. పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గేట్ సమీపంలో ఉన్న నాగార్జున ఫీడ్ ఫ్యాక్టరీ ఈ దందాకు వేదికైంది. రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాలో కలిపి సొమ్ము చేసుకుంటున్న ముఠా వ్యవహారం గుట్టురట్టయ్యింది. సాక్షి, పరిగి: పేదల కడుపునింపే వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం కోళ్ల దాణాగా మారుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొంతమంది గుట్టుగా ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి 10 గంటల తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. రూప్‌ఖాన్‌పేట్ సమీపంలోని నాగార్జున ఫీడ్స్ (కోళ్ల దాణా తయారు చేసే ఫ్యాక్టరీ)పై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2వేల పైచిలుకు బస్తాల (100 టన్నులకు పైగా) రేషన్ బియ్యం గుర్తించి సీజ్ చేశారు. కోళ్ల దాణాలో నూకలు మాత్రమే కలపాల్సి ఉండటంతో రికార్డుల్లో మాత్రం నూకల పేరుతో వీటిని కొనుగోలు చేసినట్లు చూపించారు. రైస్ మిల్లులు కేంద్రంగా సరఫరా... ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని.. కోళ్ల దాణాకు ఎవరు సరఫరా చేశారు..? ఇందులో సూత్రధారులు ఎవరు... ఎవరి పేరున కొనుగోలు చేశారు..? అనే విషయాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఫ్యాక్టరీలో ఉన్న రికార్డులు, రిజిస్టర్లు, బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. దోమ మండల పరిధిలోని పోలెపల్లికి చెందిన భాగ్యలక్ష్మి రైస్ మిల్లు మరియు పరిగికి చెందిన ఓ ట్రేడర్ ద్వారా రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణా ఫ్యాక్టరీకి సరఫరా చేసినట్లు గుర్తించారు. అయితే ఫ్యాక్టరీ నిర్వాహకులు కొనుగోలు చేసింది, రేషన్ బియ్యమే అయినా.. నూకల పేరుతో బిల్లులు ఇవ్వటం గమనార్హం. దందాలో పలువురి పాత్ర.... ఈ దందాలో పలువురి పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. నిఘావర్గాలపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టడం వెనక కొందరు రేషన్ డీలర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. మరో వైపు రైస్ మిల్లుల నిర్వాహకులు చిన్న స్థాయిలో బియ్యం దందా చేసే వారి నుంచి రేషన్ బియ్యం సేకరించి.. డంపులుగా మార్చి.. ఇలా దాణా ఫ్యాక్టరీలకు.. ఇతర చోట్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా పలు శాఖల అధికారుల సహకారంతోనే జరిగినట్లు తెలుస్తోంది. దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఫేక్ ఫయాజ్ అహ్మద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ నోముల మురళి సంఘట స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పచ్ నర్సింహ్మ, బీజేపీ నాయకులు పెంటయ్యగుప్త, హరికృష్ణ, సీపీఎం నాయకులు వెంకటయ్య, సీపీఐ నాయకులు పీర్ మహ్మద్ వెంకటేశ్ తదితరులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేస్తాం రికార్డుల్లో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. నాగార్జున ఫీడ్ కంపెనీ యజమాని రాజేందర్‌రెడ్డి, ట్రేడర్ కిరణ్, భాగ్యలక్ష్మి రైస్‌మిల్ ఓనర్ నారాయణపై కేసులు నమోదు చేస్తాం. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేసి గోదాంకు తరలిస్తున్నాం. – నోముల మురళి, విజిలెన్స్ అడిషనల్ ఏఎస్పీ -
పదేళ్లు సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం కిలో రూ.15
సాక్షి, నల్లగొండ: పదేళ్ల నుంచి సీజ్ చేసిన పీడీఎస్ బియ్యానికి ఇటీవల నిర్వహించిన వేలంలో మంచి ధర లభించింది. తినడానికి పనికిరాని బియ్యం కిలోకు రూ.15 పలకగా.. మంచిగా ఉన్న బియ్యానికి రూ.17 ధర వచ్చింది. సీజ్ చేసిన బియ్యాన్ని వేలం వేయాలని రెండేళ్ల క్రితమే ఆదేశాలు వచ్చినా.. అప్పట్లో కిలోకు రూ.6 పలకడంతో వేలం పాట వాయిదా వేశారు. అయితే ఇటీవల జేసీ చంద్రశేఖర్ చాకచక్యంగా వ్యవహరించి తానే స్వయంగా వేలం పాట ప్రారంభించి మంచి ధర వచ్చేలా చూశారు. దీంతో ప్రభుత్వానికి అదనంగా రూ.46 లక్షల ఆదాయం సమకూరినట్లయ్యింది. అక్రమమార్గంలో తరలుతూ అధికారులకు పట్టుబడిన రేషన్ బియ్యానికి (పీడీఎస్ బియ్యానికి) ఇటీవల నిర్వహించిన వేలం గిట్టుబాటైంది. దాదాపు పదేళ్ల నుంచి సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని రెండేళ్ల క్రితమే వేలం వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ అప్పట్లో ధర గిట్టుబాటు కాక వేలం వాయిదా చేశారు. కానీ.. వారం రోజుల క్రితం అదే బియ్యానికి వేలం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ చాకచక్యంగా వ్యవహరించి తానే స్వయంగా పాటను మొదలు పెట్టి వేలం ప్రారంభించారు. దీంతో రెండేళ్ల క్రితం ధరకంటే అధిక రేటు పలికాయి. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరినట్టు అయ్యింది. 2017లోనే వేలం వేయాలని ఆదేశాలు.. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుండగా ఇటు విజిలెన్స్, సివిల్‌సప్లయ్ అధికారులు.. అటు పోలీసులు పట్టుకున్నారు. జిల్లా యంత్రాంగం ఇటీవలే వేలం వేసింది. గత పది సంవత్సరాల నుంచి జిల్లాలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడడంతో ఆ బియాన్ని అధికారులు సీజ్ చేస్తూ వచ్చారు. అయితే వాటిని వేలం వేసే విషయంలో మాత్రం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో పౌర సరఫరాల శాఖ దాన్ని పట్టించుకోలేదు. 2017 సంవత్సరంలో వేలం వేయాలని ఆదేశాలు రావడంతో అప్పట్లో అధికారులు సీజ్ చేసిన బియ్యానికి వేలం పాట పెట్టగా తినడానికి ఉపయోగపడే, ఉపయోగపడని బియ్యానికి సంబంధించి వ్యాపారులు రెండు రకాల బియ్యానికి కూడా కిలో ఒక్కంటికీ 6రూపాయలే పాట పాడారు. దీంతో గిట్టుబాటు కాదని భావించిన అధికారులు అప్పట్లో బియ్యం వేలాన్ని వాయిదా వేశారు. ఇటీవల బియ్యాన్ని వేలం వేసిన జేసీ పదేళ్ల నుంచి పట్టుబడిన రేషన్ బియ్యాన్ని ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్ వేలంపాట నిర్వహించారు. గతంలో నిర్వహించిన వేలానికి భిన్నంగా పాటను వ్యాపారుల నుంచి మొదలు కాకుండా తానే ధర నిర్ణయించి వేలం పాటను ప్రారంభించారు. అయి తే మొత్తం తినడానికి ఉపయోగపడని అన్‌ఫిట్ బియ్యం 3011.95 క్వింటాళ్లు ఉండగా అందులో డీఎం పరిధిలో 198 క్వింటాళ్లు ఉన్నాయి. తినడానికి అనుకూలమైనటువంటి బియ్యం 2813.95 క్వింటాళ్లు ఉన్నాయి. అయితే తినడానికి పనికిరాని బియ్యాన్ని మొదట ఒక కిలోకు రూ.8 చొప్పున పాట ప్రారంభించగా వేలంలో పాల్గొన్న వ్యాపారులు చివరికి కిలో రూ.15 చొప్పున పాట పాడి తీసుకున్నారు. అయితే తినడానికి అనుకూలమైన బియ్యానికి సంబంధించి పాటను రూ.10 నుంచి మొదలుపెట్టగా పాటలో పాలొన్న వ్యాపారులు ఫైనల్ ధర రూ.17కు దక్కించుకున్నారు. ఇలా తినడానికి పనికిరాని బియ్యానికి రూ.32,28,164, తినడానికి ఉపయోగకరమైన బియ్యానికి రూ.42,20925 వచ్చాయి. రెండూ కలిపి రూ.74,49,089 ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇదే బియ్యాన్ని 2017లో రూ.6 ధరకే అమ్మి ఉంటే కేవలం రూ.28లక్షలు మాత్రమే వచ్చేవి. ప్రస్తుతం జేసీ చాకచక్యంగా వ్యవహరించి వేలం పాడడంతో అదనంగా రూ.46లక్షల ఆదాయం వచ్చినట్లయ్యింది. రేషన్‌బియ్యం బ్లాక్ ఇలా.. గతంలో అర్హులతో పాటు చాలామంది అనర్హులకు తెల్లరేషన్ కార్డులు ఉండేవి. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం, స్కాలర్షిప్ కోసం అడ్డదారిన చాలా మంది అనర్హులు కార్డులు పొందారు. వీరిలో కొందరు రేషన్ తీసుకుని బ్లాక్‌లో ఎక్కువ ధరకు విక్రయించేవారు. మరికొందరు రేషన్ షాపుల్లోనే వదిలేసేవారు. అప్పట్లో రేషన్‌షాపుల్లో బయోమెట్రిక్ విధానం లేదు. దాంతో డీలర్లకు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరించేవారు. కార్డుదారులు బియ్యం తీసుకోకపోవడంతో డీలర్లకు కాసుల వర్షం కురిసేది. ప్రతినెలా క్వింటాళ్ల కొద్దీ బియ్యం మిగిలేవి. వాటన్నింటినీ వ్యాపారులకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వాటిని తీసుకెళ్లే క్రమంలో ఇటు డీలర్లు, అటు బ్లాక్ దందా చేసే వారిపై దాడులు చేసిన సందర్భంలో బియ్యం పట్టుబడడంతో వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసేవారు. కొన్ని సందర్భంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినప్పుడు దాడులు చేసి పట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. పదేళ్ల నుంచి జరుగుతున్న ఇలాంటి సంఘటనల్లో లభ్యమైన బియ్యాన్ని ఆయా ఏరియాల్లోని ఎంఎల్ఎస్ గోదాముల్లో నిల్వ చేస్తూ వస్తున్నారు. దీంతో మొత్తం 5,900 క్వింటాళ్ల వరకు సీజ్ చేసిన బియ్యం నిల్వలు ఉన్నాయి. -
పదిన్నర క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
నందిపేట్(ఆర్మూర్) : మండల కేంద్రంలోని బర్కతుపుర కాలనీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. విశ్వనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. రేషన్ దుకాణం నం.10 నుంచి ఎం.సాయన్న 18 సంచుల బియ్యాన్ని(8 క్వింటాళ్లు) అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. మండల కేంద్రంలోని రేషన్ దుకాణం నం.26 నుంచి 2.5 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో వేసి తరలిస్తుండగా వలవేసి పట్టుకుని బియ్యాన్ని సీజ్ చేశారు. అనంతరం డీలర్లపై 6ఏ కింద కేసులు నమోదు చేశారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
వెంబడించి పట్టుకున్నారు..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ఆర్మూర్ నుంచి శుక్రవారం రాత్రి నిజామాబాద్‌కు 24.30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం బస్తాలతో వస్తున్న టీఎస్16 యూబీ 3872 నంబరు గల వ్యాన్‌ను రాష్ట్ర టాస్క్‌ఫోర్స్, జిల్లా సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఆర్మూర్ నుంచి వ్యాన్‌ను వెంబడించగా నిజామాబాద్ బైపాస్ రోడ్డు వరకు వచ్చిన డ్రైవర్ అధికారుల రాకను గమనించి రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. అయితే వ్యాన్‌లో 55 బస్తాలతో ³పీడీఎస్ బియ్యం ఉండగా, బస్తాలను నిజామాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. వ్యాన్‌ను నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అయితే ఆర్మూర్ నుంచి నిజామాబాద్ మీదుగా పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న వ్యాన్ ఎక్కడి నుంచి వస్తుంది? సంబంధిత వ్యక్తులెవరు? వ్యాన్ ఎవరిది..? డ్రైవర్ ఎవరనే దానిపై ఒకటి, రెండు రోజుల్లో విచారించి వివరాలను తెలుసుకుంటామని డీఎస్వో కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. పీడీఎస్ బియ్యంను పట్టుకున్న వారిలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ డీటీ శంకర్, సిబ్బంది ఉన్నారు. -
22 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
మాచర్ల: గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాచర్ల మండలం బూర్జ- అడిగొప్పల రహదారిలో ఆదివారం ఉదయం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 22 టన్నుల రేషన్ బియ్యంతో పాటు 9మందిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని రెండు లారీల్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని, నిందితులను బూర్జ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 60 కింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని సీజ్ చేసి... పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.