దాణా కంపెనీలో అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు
పేదల బియ్యం పక్కదారి పట్టాయి.. వేలాది క్వింటాళ్లు అక్రమర్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ దందాకు పరిగి అడ్డాగా మారింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తూ దండుకోగా.. ఇప్పుడు కొంతమంది అక్రమార్కులు తమ దందాకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పేదలు తినే బియ్యాన్ని సేకరించి.. కోళ్ల దాణా తయారీలో వాడుతున్నారు. వందలాది టన్నుల రేషన్ బియ్యాన్ని నూకల పేరుతో కోళ్ల దాణా తయారీ కోసం నిల్వ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఈ విషయం బట్టబయలైంది. పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గేట్ సమీపంలో ఉన్న నాగార్జున ఫీడ్ ఫ్యాక్టరీ ఈ దందాకు వేదికైంది. రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాలో కలిపి సొమ్ము చేసుకుంటున్న ముఠా వ్యవహారం గుట్టురట్టయ్యింది.
సాక్షి, పరిగి: పేదల కడుపునింపే వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం కోళ్ల దాణాగా మారుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొంతమంది గుట్టుగా ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి 10 గంటల తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. రూప్‌ఖాన్‌పేట్ సమీపంలోని నాగార్జున ఫీడ్స్ (కోళ్ల దాణా తయారు చేసే ఫ్యాక్టరీ)పై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2వేల పైచిలుకు బస్తాల (100 టన్నులకు పైగా) రేషన్ బియ్యం గుర్తించి సీజ్ చేశారు. కోళ్ల దాణాలో నూకలు మాత్రమే కలపాల్సి ఉండటంతో రికార్డుల్లో మాత్రం నూకల పేరుతో వీటిని కొనుగోలు చేసినట్లు చూపించారు.
రైస్ మిల్లులు కేంద్రంగా సరఫరా...
ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని.. కోళ్ల దాణాకు ఎవరు సరఫరా చేశారు..? ఇందులో సూత్రధారులు ఎవరు... ఎవరి పేరున కొనుగోలు చేశారు..? అనే విషయాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఫ్యాక్టరీలో ఉన్న రికార్డులు, రిజిస్టర్లు, బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. దోమ మండల పరిధిలోని పోలెపల్లికి చెందిన భాగ్యలక్ష్మి రైస్ మిల్లు మరియు పరిగికి చెందిన ఓ ట్రేడర్ ద్వారా రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణా ఫ్యాక్టరీకి సరఫరా చేసినట్లు గుర్తించారు. అయితే ఫ్యాక్టరీ నిర్వాహకులు కొనుగోలు చేసింది, రేషన్ బియ్యమే అయినా.. నూకల పేరుతో బిల్లులు ఇవ్వటం గమనార్హం.
దందాలో పలువురి పాత్ర....
ఈ దందాలో పలువురి పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. నిఘావర్గాలపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టడం వెనక కొందరు రేషన్ డీలర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. మరో వైపు రైస్ మిల్లుల నిర్వాహకులు చిన్న స్థాయిలో బియ్యం దందా చేసే వారి నుంచి రేషన్ బియ్యం సేకరించి.. డంపులుగా మార్చి.. ఇలా దాణా ఫ్యాక్టరీలకు.. ఇతర చోట్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా పలు శాఖల అధికారుల సహకారంతోనే జరిగినట్లు తెలుస్తోంది. దాడుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌలి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఫేక్ ఫయాజ్ అహ్మద్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ నోముల మురళి సంఘట స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పచ్ నర్సింహ్మ, బీజేపీ నాయకులు పెంటయ్యగుప్త, హరికృష్ణ, సీపీఎం నాయకులు వెంకటయ్య, సీపీఐ నాయకులు పీర్ మహ్మద్ వెంకటేశ్ తదితరులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని డిమాండ్ చేశారు.
కేసు నమోదు చేస్తాం
రికార్డుల్లో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. నాగార్జున ఫీడ్ కంపెనీ యజమాని రాజేందర్‌రెడ్డి, ట్రేడర్ కిరణ్, భాగ్యలక్ష్మి రైస్‌మిల్ ఓనర్ నారాయణపై కేసులు నమోదు చేస్తాం. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేసి గోదాంకు తరలిస్తున్నాం.
– నోముల మురళి, విజిలెన్స్ అడిషనల్ ఏఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment