అనిత(ఫైల్ ఫొటో)
పరిగి: అప్పుల బాధతో తండ్రి ఉరివేసుకున్నాడు... అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు... ఉన్నత చదువులు చదివి ఎన్నాళ్లు ఎదురు చూసినా ఉద్యోగం రాలేదు.. చివరకు పెళ్లి కుదిరిందన్న ఆనందమూ మిగల్లేదు... అప్పు చేస్తే తప్ప పెళ్లి జరిగే పరిస్థితి లేదు... కానీ పెళ్లి చేసుకుంటే అప్పు తీర్చేవారు లేరు... ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారమని భావించిన ఓ యువతి రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్‌పల్లికి చెందిన వడ్ల అనిత (29) పీజీతోపాటు బీఈడీ చేసింది. అప్పుల బాధతో తండ్రి పదేళ్ల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసే సోదరుడు 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనికితోడు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవడం, తల్లి బయటకు వెళ్లి పని చేసే స్థితిలో లేకపోవడంతో అనిత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు. ఇటీవల పెళ్లి కుదరగా మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది.
అయితే పెళ్లి ఖర్చులకు చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో అప్పు చేస్తే తప్ప చేసుకోలేని పరిస్థితి ఆమెకు నెలకొంది. కానీ ఒకవేళ అప్పు చేసినా దాన్ని తిరిగి తీర్చేవారు కూడా లేరని భావించిన అనిత తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఆవేదనను సూసైట్ నోట్‌లో రాసుకొని గురువారం ఉదయం తల్లిని పాల కోసం పక్కింటికి పంపించింది. ఆమె వచ్చేలోగా ఇంట్లోని దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి వచ్చి చూసేలోగా మృతిచెందింది. సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment