Sayyadpalli
-
పెళ్లి ఖర్చులకు చిల్లిగవ్వ లేదు.. యువతి బలవన్మరణం
పరిగి: అప్పుల బాధతో తండ్రి ఉరివేసుకున్నాడు... అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు... ఉన్నత చదువులు చదివి ఎన్నాళ్లు ఎదురు చూసినా ఉద్యోగం రాలేదు.. చివరకు పెళ్లి కుదిరిందన్న ఆనందమూ మిగల్లేదు... అప్పు చేస్తే తప్ప పెళ్లి జరిగే పరిస్థితి లేదు... కానీ పెళ్లి చేసుకుంటే అప్పు తీర్చేవారు లేరు... ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారమని భావించిన ఓ యువతి రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్పల్లికి చెందిన వడ్ల అనిత (29) పీజీతోపాటు బీఈడీ చేసింది. అప్పుల బాధతో తండ్రి పదేళ్ల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసే సోదరుడు 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనికితోడు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోవడం, తల్లి బయటకు వెళ్లి పని చేసే స్థితిలో లేకపోవడంతో అనిత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు. ఇటీవల పెళ్లి కుదరగా మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి ఖర్చులకు చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో అప్పు చేస్తే తప్ప చేసుకోలేని పరిస్థితి ఆమెకు నెలకొంది. కానీ ఒకవేళ అప్పు చేసినా దాన్ని తిరిగి తీర్చేవారు కూడా లేరని భావించిన అనిత తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఆవేదనను సూసైట్ నోట్లో రాసుకొని గురువారం ఉదయం తల్లిని పాల కోసం పక్కింటికి పంపించింది. ఆమె వచ్చేలోగా ఇంట్లోని దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి వచ్చి చూసేలోగా మృతిచెందింది. సూసైట్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. చదవండి: నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే కరోనాకు బలి -
సద్దుమణగని సయ్యద్పల్లి
సాక్షి, పరిగి: చిన్నపాటి గొడవలు, అక్కడక్కడ చోటుచేసుకుంటున్న చెదురుమదురు సంఘటనలపై.. దర్యాప్తులో జరుగుతున్న జాప్యం పెద్ద నేరాలకు దారితీస్తోంది. బాధితులు ఫిర్యాదు చేసిన సమయంలో చిన్నపాటి గొడవలుగా భావిస్తున్న పోలీసులు.. పరిస్థితులు చేయి దాటేవరకూ పట్టించుకోవడం లేదు. పోలీసుల డైరీలోని కొన్ని నేరాలను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. ఆరు నెలల క్రితం పరిగి మండలం సల్తాన్పూర్లో టీఆర్ఎస్ నేత హత్యకు గురికావడం, దోమ మండంలో జంట హత్యల ఉదంతాలను ప్రజలు ఇంకా మర్చి పోలేదు.. ఈ రెండు ఘటనలు ముందస్తు హెచ్చరికల తర్వాత జరిగినవే. స్థానిక పరిస్థితులను అంచనా వేడయంలో పోలీసులు విఫలం కావడం వల్లే ఈ హత్యలు జరిగాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయా గ్రామాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికీ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరో సమస్యాత్మక గ్రామమైన.. పరిగి మండలం సయ్యద్పల్లిలో చోటుచేసుకున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కారు తగలబెట్టి.. చంపుతామని రాతలు... గత జూన్ 4వ తేదీ రాత్రి సయ్యద్పల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అప్పటి ఎంపీటీసీ సభ్యురాలి కుమారుడు అయిన తైలం వెంకటయ్య ఇంటి ఎదుట పార్క్ చేసిన కారును పెట్రోల్ పోసి తగెలబెట్టారు. మరుసటి రోజు స్థానిక ఎమ్మెల్యేతోపాటు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. కారును తగులబ్టెన ఘటన జరిగిన వారంలోపే అదే టీఆర్ఎస్ నాయకుడు వెంకటయ్యకు హెచ్చరికలు పంపారు. ఇప్పుడు కారు మాత్రమే తగలబెట్టాం.. త్వరలో వెంకటయ్యను చంపేస్తామంటూ గోడలు, విద్యుత్ స్తంభాలు, శిలాఫలకాలపై పెయింటింగ్తో రాశారు. మూడు నెలలు దాటినా ..... అతి సమస్యాత్మక గ్రామాల జాబితాలో ముందు వరుసలో ఉండే సయ్యద్పల్లిలో ఈ ఘటనలు జరిగి సరిగ్గా మూడు నెలలు దాటింది. బాధితులు, గ్రామస్తులు అనేక సార్లు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు. అనుమానితుల పేర్లను సైతం అందజేశారు. ఎస్ఐ, సీఐ మొదలుకుని డీఐజీ, ఐజీల వరకు వెళ్లి విజ్ఞప్తులు చేశారు. కేసు దర్యాప్తులో పురోగతి కనిపించకపోవటంతో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. దర్యాప్తు చేస్తున్నాం సయ్యద్పల్లిలో చోటు చేసుకున్న కారు దగ్ధంతో పాట టీఆర్ఎస్ నాయకుడిని చంపుతామని బెదిరించిన ఘటనలో కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఆధారాలు లేకుండా అరెస్టు చేయలేం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటాం. – రవీంద్రారెడ్డి, డీఎస్పీ, పరిగి -
వివాహం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య
పరిగి: వివాహం ఇష్టం లేక మనస్తాపం చెందిన ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్పల్లి అనుబంధ రావులపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాళ్లాపూర్ సత్తయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు మౌనిక(15) చిన్నప్పటి నుంచి దోమ మండల పరిధిలోని పాలెపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. దోమ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఇటీవల బాలిక తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పాఠశాలకు వేసవి సెలవులు ఉండటంతో మౌనిక నెలరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా పొలానికి వెళ్లిన బాలిక చున్నీ అంచుపై వేసి బావిలో దూకింది. పక్కపొలం రైతులు గమనించి వెంటనే బావిలోకి దూకి బాలికను బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. అప్పటికే మౌనిక మృతిచెందింది. అయితే.. మౌనికకు ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారని.. మగ పెళ్లివారు ఆదివారం మౌనికను చూసేం దుకు వస్తున్నారని తెలిసి.. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్తులు తెలిపారు. మౌనిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, బాలిక ఆత్మహత్యపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.