పరిగి: వివాహం ఇష్టం లేక మనస్తాపం చెందిన ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లి అనుబంధ రావులపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాళ్లాపూర్ సత్తయ్యకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు మౌనిక(15) చిన్నప్పటి నుంచి దోమ మండల పరిధిలోని పాలెపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. దోమ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఇటీవల బాలిక తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పాఠశాలకు వేసవి సెలవులు ఉండటంతో మౌనిక నెలరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది.
ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా పొలానికి వెళ్లిన బాలిక చున్నీ అంచుపై వేసి బావిలో దూకింది. పక్కపొలం రైతులు గమనించి వెంటనే బావిలోకి దూకి బాలికను బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. అప్పటికే మౌనిక మృతిచెందింది. అయితే.. మౌనికకు ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారని.. మగ పెళ్లివారు ఆదివారం మౌనికను చూసేం దుకు వస్తున్నారని తెలిసి.. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్తులు తెలిపారు. మౌనిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, బాలిక ఆత్మహత్యపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
వివాహం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య
Published Sun, May 31 2015 2:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement