Peace security
-
‘కోడ్’ కట్టుదిట్టంగా అమలు చేయాలి
ఆదిలాబాద్: ఎన్నికల కోడ్ కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. 24 గంటల వ్యవధిలో ప్రభుత్వ భవనాల్లో వివిధ రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, ఫొటోలు, వాల్‌రైటింగ్ తొలగించాలన్నారు. అలాగే 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద, 72 గంటల్లోగా ప్రైవేట్ స్థలాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. నవంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు, ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది శిక్షణ, తదితర కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలు సమర్పించాలన్నారు. శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, ర్యాంపు వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులకు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియా, తదితరులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జట్టీ పోలీసులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నంచి అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలు ఉన్నచోట 30 పోలీసు యాక్టు, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో నేరస్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్నారు. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై నేరాలు జరగకుండా చూడాలన్నారు. బాల నేరస్తులైన వారి ఆలోచన విధానాలను మార్చేలా చూడాలన్నారు. ఈ చలనాలో రెండు సార్లు పట్టుబడిన వారు జిల్లాలో 650 మంది ఉన్నారని, వారి డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లలో పట్టుబడిన వారిలో మార్పు వచ్చేలా చూడాలన్నారు. జాతీయ రహదారులకు అనుకొని ఉన్న పోలీసు స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు పి.షేక్షావలి, ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు ఖాదర్‌బాషా, వెంకటాద్రి, హుస్సేన్ పీరా, నజీముద్దీన్, సీఐలు దివాకర్‌రెడ్డి, షరీఫ్ ఉద్దీన్ పాల్గొన్నారు. -
నిఘా నీడలో సిటీ!
- జంట కమిషనరేట్ల పరిధిలో 2000 సీసీ కెమెరాలు - ప్రాంతాల గుర్తింపునకు నిఘా వర్గాల సర్వే సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో త్వరలో 2000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏఏ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే విషయంపై కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ నిఘావర్గాలతో సర్వే చేయిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది. గత రెండు దశాబ్దాల కాలంలో నగరంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిఘా వర్గాలు కమిషనర్లకు సూచించాయి. శివార్లలో కాలనీలు, బస్తీలు విస్తరించడంతో రెండు కమిషనరేట్ల పరిధిలో గతంలో కంటే సమస్యాత్మక ప్రాంతాలు పెరిగాయి. మత ఘర్షణలు, అల్లర్లు, రౌడీముకల దాడులు జరిగిన ప్రాంతాలు కూడా వీటిలో ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా.. ఎందుకు జరిగింది? కారకులు ఎవరు అనేది సులభంగా తెలిసిపోతుంది. సీసీ కెమెరాల్లోని ఫుటేజీ నిందితుడికి శిక్షపడేందుకు కూడా దోహదపడుతుంది. గతంలో ఏదైనా గొడవ జరిగితే స్థానిక యువకులను అనుమానితులుగా స్టేషన్‌కు పిలిచి విచారణ పేరుతో వేధించేవారు. సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తే నిందితుడి గుర్తింపు వెంటనే జరిగిపోవడంతో పాటు అమాయకులను వే ధించడం ఆగిపోతుంది. సీసీ కెమెరాల్లో ప్రతి చిన్న విషయం రికార్డు అయిపోతుంటుంది కాబట్టి ఎవ్వరూ నేరం చేయడానికి సాహసించరని, దీంతో నేరాలు అదుపులోకి వస్తాయని పోలీసులంటున్నారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా వచ్చే ఫుటేజీల పర్యవేక్షణకు జోన్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి నిత్యం ఆయా కూడళ్లలో వాహనాల రద్దీని పరిశీలించి, ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సహకరిస్తుంటారు. అలాగే, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న కెమెరాల ద్వారా ఎక్కడైన గొడవలు జరుగుతుంటే గుర్తించి వెంటనే అదుపులోకి తెచ్చేయవచ్చు. వ చ్చే రెండు మూడు నెలల్లో నగరంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఉపయోగంలోకి తీసుకొస్తామని అధికారులంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సీసీ కెమెరాలతో పాటు హోటళ్లు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు, ఆసుపత్రుల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసేలా యజమానులుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయితే నగర జీవి అనుక్షణం మూడో కన్ను నీడలో పయనించకతప్పదు. -
వీక్లీ ఆఫ్ ప్లీజ్
శాంతి భద్రతలను సంరక్షించడంలో కీలకపాత్ర పోషించే పోలీసుల సేవలు ఎనలేనివి. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా 24గంటలు విధినిర్వహణ చేస్తుంటారు. నిత్యం ఏదో ఒకచోట సమస్యలు వస్తుండడంతో విరామం లేకుండా పని చేస్తూ.. ఒత్తిడి అధికమై అనారోగ్యం పాలవుతున్న పోలీసులు ఒక్కోసారి విధి నిర్వహణలోనే మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజు సెలవు ఇవ్వాలనే డిమాండ్ పోలీస్‌శాఖలో ఎప్పటి నుంచో ఉంది. ఇటీవలికాలంలో ఈ డిమాండ్ మరింత బలపడుతోంది. వారంలో ఒక్కరోజు సెలవు ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి.. విధి నిర్వహణలో మరింత చురుగ్గా పాల్గొంటామనేది వారి వాదన. రాయవరం : రాజకీయ నాయకుల ఎస్కార్ట్, బందోబస్తు, ధర్నా, రాస్తారోకో, నిరసన ప్రదర్శన, ప్రమాదాలు ఇలా ఏ సంఘటన జరిగినా పోలీసులు తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో పోలీసులు రాత్రి పగలనక డ్యూటీ చేయాల్సిందే. వీటితో పాటు వాహనాల తనిఖీ, పెట్రోలింగ్, కేసుల విచారణ, కోర్టు కేసులకు నిందితులను తీసుకుని వెళ్లడం, ఉన్నతాధికారుల రక్షణ ఇలా పలు పనులకు కానిస్టేబుల్ స్థాయి నుంచి పనులు చేయాల్సిందే. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సమయంతో సంబంధం లేకుండా చూడాల్సి రావడంతో పోలీసులు శారీరకంగా, మానసికంగా అలసట చెందుతున్నారు. ఇబ్బందుల్లో సిబ్బంది రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది నియామకాలు జరగడం లేదు. దీనితో ఉన్న సిబ్బందిపైనే పూర్తి భారం పడుతోంది. రోజుల తరబడి 24గంటలు విధులు నిర్వర్తించడంతో పాటు ఎంత పనిచేస్తున్నా అనుకున్న సమయానికి పదోన్నతులు రాక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. విరామం లేకుండా విధులు నిర్వర్తించడంతో సిబ్బందిలో చాలామంది గుండెజబ్బులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. బ్రిటిష్‌కాలం నాటి మాన్యువల్ బ్రిటిష్‌కాలం నాటి పోలీస్ మాన్యువల్‌నే నేటికీ కొనసాగిస్తున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మాన్యువల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయ పడుతున్నారు. 1861లో బ్రిటిష్‌కాలంలో పోలీస్యాక్టును రూపొందించారు. పోలీస్ శాఖలో సంస్కరణల కోసం 1902లో ఏహెచ్ఆర్ ప్రేసర్, 1977లో మాజీ గవర్నర్ ధరమ్వీర్ నేతృత్వంలో ఏర్పడ్డ జాతీయ పోలీస్ కమిషన్, 1998లో రేబిరో, 2000లో మిలిమత్, 2005లో సోలీసొరాబ్జీ కమిటీలు పోలీస్‌శాఖలో కొన్ని సూచనలు, మార్పులు సూచించాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేయగా మరికొన్ని నేటికీ అమలుకు నోచుకోలేదు. 2006, 2013లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. పోలీస్ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, సేవల్లో మరింత పారదర్శకత పెంచేందుకు అనేక మార్పులు సూచించింది. మారుతున్న కాలానికి , పరిస్థితులకు అనుగుణంగా సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. 1,999 మందికో పోలీసు.. జిల్లాలో సుమారుగా 51లక్షల54వేల మంది జనాభా ఉన్నారు. వీరిలో పురుషులు 25లక్షల 69వేల 688 మంది ఉండగా, 25లక్షల 84వేల 608 స్త్రీలు ఉన్నారు. వివిధ విభాగాల్లో కలిపి సుమారు 2,578 మంది సివిల్ పోలీసులు పనిచేస్తున్నారు. అంటే సుమారుగా 1,999 మందికి ఒక పోలీస్ పనిచేస్తున్నారన్న మాట. సిబ్బంది సరిపడనంతగా లేకపోవడంతో కేసులు కూడా పెండింగ్‌లో పడిపోతున్నట్టుగా సమాచారం. పెరగాల్సిన మహిళా పోలీసులు.. మహిళల సంఖ్యకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉంది. గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఇటీవల రాష్ర్టంలో మహిళా పోలీసుల ఎంపికలో 33 శాతం రిజర్వేషన్లు పాటిస్తామని ప్రకటించారు. అదే విధానం రాష్ట్రంలో అమలు చేస్తే బావుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీస్స్టేషన్లలో మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉంది. కాని జిల్లాలో వివిధ స్థాయిల్లో సుమారుగా వంద మంది మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. ఒత్తిడికి గురవుతున్న మాట వాస్తవం సమయంతో సంబంధం లేకుండా విధి నిర్వహణ చేయడం వల్ల పోలీసులు ఒత్తిడికి గురవుతున్నారు. విరామం లేకుండా డ్యూటీ చేయడంతో బీపీ, చక్కెర, గుండె సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. - జి.బ్రహ్మాజీరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు. వారాంతపు సెలవు ఇవ్వాలి ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల మాదిరిగానే వారాంతపు సెలవులు ఇవ్వాలి. ఈ విషయంపై ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిల్లా నుంచి హోం మంత్రి ఉన్నందున మానవతా ధృక్పథంతో పరిశీలించాలి. - జి.బలరామమూర్తి, పోలీసు అధికారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు. సమర్థవంతంగా పనిచేస్తాం.. వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడం వల్ల మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుంటుంది. సెలవుల్లేక ఒత్తిడికి గురవుతున్నందున త్వరగా అలసట చెందుతున్నాం. - ఎం.వి.రమణమూర్తి, పోలీసు అధికారుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. జిల్లాలో పోలీసుల ప్రస్థుత పరిస్థితి హోదా ఉండాల్సింది ఉన్నది అదనపు ఎస్పీలు 4 2 డీఎస్పీలు 8 6 సీఐలు 44 37 రిజర్వు ఇన్స్పెక్టర్లు 5 2 సబ్ ఇన్స్పెక్టర్లు 154 132 ఆర్.ఎస్.ఐ.లు 14 14 ఏ.ఎస్.ఐ.లు 217 125 హెడ్‌కానిస్టేబుల్స్ 515 507 సివిల్, ఆర్మ్డ్కానిస్టేబుల్స్ 2518 1954