ఆదిలాబాద్: ఎన్నికల కోడ్ కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. 24 గంటల వ్యవధిలో ప్రభుత్వ భవనాల్లో వివిధ రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, ఫొటోలు, వాల్‌రైటింగ్ తొలగించాలన్నారు.
అలాగే 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద, 72 గంటల్లోగా ప్రైవేట్ స్థలాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. నవంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు, ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది శిక్షణ, తదితర కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలు సమర్పించాలన్నారు.
శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, ర్యాంపు వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులకు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment