వీక్లీ ఆఫ్ ప్లీజ్
శాంతి భద్రతలను సంరక్షించడంలో కీలకపాత్ర పోషించే పోలీసుల సేవలు ఎనలేనివి. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా 24గంటలు విధినిర్వహణ చేస్తుంటారు. నిత్యం ఏదో ఒకచోట సమస్యలు వస్తుండడంతో విరామం లేకుండా పని చేస్తూ.. ఒత్తిడి అధికమై అనారోగ్యం పాలవుతున్న పోలీసులు ఒక్కోసారి విధి నిర్వహణలోనే మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజు సెలవు ఇవ్వాలనే డిమాండ్ పోలీస్‌శాఖలో ఎప్పటి నుంచో ఉంది. ఇటీవలికాలంలో ఈ డిమాండ్ మరింత బలపడుతోంది. వారంలో ఒక్కరోజు సెలవు ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి.. విధి నిర్వహణలో మరింత చురుగ్గా పాల్గొంటామనేది వారి వాదన.
రాయవరం :
రాజకీయ నాయకుల ఎస్కార్ట్, బందోబస్తు, ధర్నా, రాస్తారోకో, నిరసన ప్రదర్శన, ప్రమాదాలు ఇలా ఏ సంఘటన జరిగినా పోలీసులు తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో పోలీసులు రాత్రి పగలనక డ్యూటీ చేయాల్సిందే. వీటితో పాటు వాహనాల తనిఖీ, పెట్రోలింగ్, కేసుల విచారణ, కోర్టు కేసులకు నిందితులను తీసుకుని వెళ్లడం, ఉన్నతాధికారుల రక్షణ ఇలా పలు పనులకు కానిస్టేబుల్ స్థాయి నుంచి పనులు చేయాల్సిందే. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సమయంతో సంబంధం లేకుండా చూడాల్సి రావడంతో పోలీసులు శారీరకంగా, మానసికంగా అలసట చెందుతున్నారు.
ఇబ్బందుల్లో సిబ్బంది
రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది నియామకాలు జరగడం లేదు. దీనితో ఉన్న సిబ్బందిపైనే పూర్తి భారం పడుతోంది. రోజుల తరబడి 24గంటలు విధులు నిర్వర్తించడంతో పాటు ఎంత పనిచేస్తున్నా అనుకున్న సమయానికి పదోన్నతులు రాక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. విరామం లేకుండా విధులు నిర్వర్తించడంతో సిబ్బందిలో చాలామంది గుండెజబ్బులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
బ్రిటిష్‌కాలం నాటి మాన్యువల్
బ్రిటిష్‌కాలం నాటి పోలీస్ మాన్యువల్‌నే నేటికీ కొనసాగిస్తున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మాన్యువల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయ పడుతున్నారు. 1861లో బ్రిటిష్‌కాలంలో పోలీస్‌యాక్టును రూపొందించారు. పోలీస్ శాఖలో సంస్కరణల కోసం 1902లో ఏహెచ్‌ఆర్ ప్రేసర్, 1977లో మాజీ గవర్నర్ ధరమ్‌వీర్ నేతృత్వంలో ఏర్పడ్డ జాతీయ పోలీస్ కమిషన్, 1998లో రేబిరో, 2000లో మిలిమత్, 2005లో సోలీసొరాబ్జీ కమిటీలు పోలీస్‌శాఖలో కొన్ని సూచనలు, మార్పులు సూచించాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేయగా మరికొన్ని నేటికీ అమలుకు నోచుకోలేదు. 2006, 2013లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. పోలీస్ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, సేవల్లో మరింత పారదర్శకత పెంచేందుకు అనేక మార్పులు సూచించింది. మారుతున్న కాలానికి , పరిస్థితులకు అనుగుణంగా సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
1,999 మందికో పోలీసు..
జిల్లాలో సుమారుగా 51లక్షల54వేల మంది జనాభా ఉన్నారు. వీరిలో పురుషులు 25లక్షల 69వేల 688 మంది ఉండగా, 25లక్షల 84వేల 608 స్త్రీలు ఉన్నారు. వివిధ విభాగాల్లో కలిపి సుమారు 2,578 మంది సివిల్ పోలీసులు పనిచేస్తున్నారు. అంటే సుమారుగా 1,999 మందికి ఒక పోలీస్ పనిచేస్తున్నారన్న మాట. సిబ్బంది సరిపడనంతగా లేకపోవడంతో కేసులు కూడా పెండింగ్‌లో పడిపోతున్నట్టుగా సమాచారం.
పెరగాల్సిన మహిళా పోలీసులు..
మహిళల సంఖ్యకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉంది. గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఇటీవల రాష్ర్టంలో మహిళా పోలీసుల ఎంపికలో 33 శాతం రిజర్వేషన్లు పాటిస్తామని ప్రకటించారు. అదే విధానం రాష్ట్రంలో అమలు చేస్తే బావుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీస్‌స్టేషన్లలో మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉంది. కాని జిల్లాలో వివిధ స్థాయిల్లో సుమారుగా వంద మంది మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు.
ఒత్తిడికి గురవుతున్న మాట వాస్తవం
సమయంతో సంబంధం లేకుండా విధి నిర్వహణ చేయడం వల్ల పోలీసులు ఒత్తిడికి గురవుతున్నారు. విరామం లేకుండా డ్యూటీ చేయడంతో బీపీ, చక్కెర, గుండె సంబంధ వ్యాధులకు గురవుతున్నారు.
- జి.బ్రహ్మాజీరావు,
పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు.
వారాంతపు సెలవు ఇవ్వాలి
ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల మాదిరిగానే వారాంతపు సెలవులు ఇవ్వాలి. ఈ విషయంపై ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిల్లా నుంచి హోం మంత్రి ఉన్నందున మానవతా ధృక్పథంతో పరిశీలించాలి. - జి.బలరామమూర్తి,
పోలీసు అధికారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు.
సమర్థవంతంగా పనిచేస్తాం..
వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడం వల్ల మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుంటుంది. సెలవుల్లేక ఒత్తిడికి గురవుతున్నందున త్వరగా అలసట చెందుతున్నాం.
- ఎం.వి.రమణమూర్తి,
పోలీసు అధికారుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.
జిల్లాలో పోలీసుల ప్రస్థుత పరిస్థితి
హోదా ఉండాల్సింది ఉన్నది
అదనపు ఎస్పీలు 4 2
డీఎస్పీలు 8 6
సీఐలు 44 37
రిజర్వు ఇన్‌స్పెక్టర్లు 5 2
సబ్ ఇన్‌స్పెక్టర్లు 154 132
ఆర్.ఎస్.ఐ.లు 14 14
ఏ.ఎస్.ఐ.లు 217 125
హెడ్‌కానిస్టేబుల్స్ 515 507
సివిల్, ఆర్మ్డ్‌కానిస్టేబుల్స్ 2518 1954