శనగపప్పు...
తిండి గోల
మిర్చి బజ్జీ, ఆలూబజ్జీ, ఎగ్‌బజ్జీ, పకోడీ... ఇలా చాలా స్నాక్స్‌కి శనగపిండే కావాలి. లడ్డూ, బూందీ.. వంటి కొన్ని సంప్రదాయ స్వీట్లలో శనగపిండే కావాలి. ఆకుకూరలు, కూరగాయలు వండేటప్పుడు శనగపప్పు వాడితే అదో రుచి. నిత్యావసర సరుకులలో శనగపప్పు పాత్ర ఎంతటిదో మనందరికీ తెలిసిందే. చిక్పీ, బెంగాల్‌గ్రామ్ అని శనగపప్పుకు ఇంగ్లిష్‌లో పేర్లున్నాయి. శనగపప్పుకు తల్లి శనగలు. ఈ శనగలతో మనం చోళేమసాలా, సలాడ్.. వంటి వంటకాలెన్నో చేస్తుంటాం. బాగా ఎండబెట్టిన శనగల నుంచే శనగపప్పును తయారుచేస్తారు. ఉత్తరభారతదేశంలో దీని వాడకం చాలా ఎక్కువ. సాగుబడిలోనూ ఈ ప్రాంతమే ముందుంది. దాదాపు 7-8 వేల ఏళ్లక్రితమే దీన్ని మనవారు ఆహారపదార్ధంగా గుర్తించారు. లాటిన్ అమెరికా, స్పెయిన్ చిక్పీస్ అనే పదాన్ని ఉపయోగించారు.
టర్కీ, గ్రీసు దేశాలలో క్రీ.పూ.6790 నుంచి శనగలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. మూత్రపిండాలలో రాళ్లు కరిగించడానికి, రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలను నివారించడంలోనూ శనగల కషాయం మహత్తరంగా పనిచేస్తుందని, ఇది ఔషధకారిణి అని కూడా చెప్పుకునేవారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో శక్తి కోసం శనగలతో పానీయం తయారుచేసుకొని సేవించేవారట. ఇప్పటివరకు ఇక్రిశాట్ 28,000 రకాల జన్యువులను శనగలలో గుర్తించింది. వీటిలో 77 రకాల పంటలను ప్రపంచవ్యాప్తంగా రైతులు సాగు చేస్తున్నారు. ఈ 30 ఏళ్లలో పశ్చిమ ఆసియా దేశాలు ప్రపంచంలోనే అత్యధిక దిగుబడితో ముందున్నాయి. వాటిలో భారతదేశానిదే అగ్రస్థానం. కాబూలీ శనగలను అఫ్గనిస్తాన్ అత్యధికంగా పండిస్తుంది. ఆకుపచ్చని శనగలు మహారాష్ట్రీయులు పంట. అరుదుగా నల్లని శనగలు మాత్రం ఇటలీలోని ఆగ్నేయప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి.