మా వయసు ఇంకా 24 ఏళ్లే!
ఇప్పటికింకా మా వయసు నిండా ఇరవై నాలుగేళ్లేనట...! ఈ మాట అంటున్నది మేం కాదు నాయనా... అన్నీ మాకే తెలుసంటూ అహంభావానికి పోతున్న సర్కారువాళ్లే. నవ యువతులైన మీకు పింఛన్లెందుకంటూ ఎకసెకాలకు దిగుతున్నారయ్యా. పోనీ మీ మాటే దీవెనగా మారి ఏడుపదుల వయసు కాస్తా మూడు పదులకు వెళ్లిపోతే మంచిదే. అదెలాగూ జరగదని మాకే కాదు లోకమంతా తెలిసిందే. మరి ఇదేం విడ్డూరమయ్యా మా నోటి కాడ కూడు తీసేస్తున్నారు.
ఇన్నాళ్లూ ఎంచక్కా తీసుకుంటున్న పింఛన్ డబ్బులు లాగేసుకుంటున్నారు. మాకు న్యాయం చేయండయ్యా ‘బాబూ’ అంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు కొనకనమిట్ల మండలం నాగరాజుకుంటకు చెందిన 74 ఏళ్ల వయసున్న పెద్దమ్మ, విజయలక్ష్మిలు. వైకల్యం ఉన్నా లేదని, భూమి లేదన్నా ఉందని, భర్త చనిపోయినా బతికున్నాడని, నేనే బతికున్నానని చెప్పినా ‘లేదు నీవు చనిపోయావని‘ ... ఇలా ఎన్నో విడ్డూరాలు చేస్తున్నారయ్యా ...
ప్రభుత్వం అన్యాయం చేసింది
నాకు 90 శాతం వైకల్యం ఉంది. కేవలం పింఛన్ సొమ్ముతో బతుకుతున్నా. పింఛన్ పెంచి ఆదుకుంటామన్న ప్రభుత్వం ఇలా అన్యాయం చేయడం దారుణం. పింఛన్ వెరిఫికేషన్లో సరైన పద్ధతులు పాటించలేదు. దీనివల్ల ఎంతో మంది నష్టపోతున్నారు. పాలకులు ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడకూడదు.
- లోకిరెడ్డి సుబ్బారెడ్డి, వికలాంగ సంఘ నాయకుడు
22 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు
నాకు 22 ఏళ్ల క్రితం వివాహమైంది. బతుకు దెరువుకోసం భర్తతో కలిసి క రీంనగర్ జిల్లా వెళ్లాం. అక్కడ బావి పనిచేస్తుండగా నా భర్త ప్రమాదవశాత్తు మరణించాడు. అప్పటి నుంచి తల్లి వద్ద ఉంటున్నా. నాకు భూమిలేదు. 20 ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నా. ఇప్పుడు నిలిపివేశారు.
- బత్తుల తిరుపతమ్మ, మర్రిపూడి
నడుములు వంగిపోయాయి..
ఆధార్ లేదంటూ పింఛన్ తొలగించారు
చిన్నకంభంలో మొత్తం 226 పింఛన్లుంటే 35 పింఛన్లను తొలగించారు. వీరిలో 25 మంది పైగా వృద్ధులకు కనీసం సెంటు భూమి కూడా లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నామె షేక్. అప్ఫాజ్ బీ. వయసు 80 సంవత్సరాలకు పైమాటే. నడుములు పూర్తిగా వంగిపోయాయి. ఎవరో ఒకరు సహకరిస్తేనే పింఛను కోసం నడవగలదు. అయితే ఈ వయసులో ఆధార్ కార్డు లేదంటూ పింఛను తొలగించారు. ఒంట్లో సత్తువ పూర్తిగా కోల్పోయిన ఈమె పని చేసుకోగలదా? సంపాదించగలదా? వృద్ధురాలిగా కనిపించడంలేదా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- షేక్ అప్ఫాజ్ బీ, చిన్న కంభం
పరిశిలన చేయకుండా పీకేశారు
మానసిక వికలాంగునిపై కనికరం కూడా లేని అధికారులు వెరిఫికేషన్ చేయకుండానే పింఛను గల్లంతు చేశారు. అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామానికి చెందిన షేక్ కరిముల్లా మానసిక వికలాంగుడు. ధ్రువీకరణ పత్రంలో 75 శాతం వికలత్వం నమోదు చేశారు. ఈయన పింఛన్ మణికేశ్వరంలో కాకుండా ఉత్తర అద్దంకిలో ఉన్నట్లు జాబితా వచ్చింది. దీనిని మార్చాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదు. చివరకు అతను అద్దంకిలో లేడంటూ పికేశారు. మళ్లీ నమోదు చేసుకోమంటున్నా అది ఎప్పటికి వస్తుందో తెలియడంలేదంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
- షేక్ కరిముల్లా, మానసిక వికలాంగుడు, మణికేశ్వరం (అద్దంకి)