Peddatippasamudrum Mandal
-
అన్నమయ్య జిల్లా: గృహ ప్రవేశం జరుగుతున్న ఇంట విషాదం
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గృహప్రవేశం కార్యక్రమంలో ఇంటికి వచ్చిన బంధువులపై కరెంట్ తీగలు తెగిపడటంతో నలుగురు మృతిచెందారు. దీంతో, వేడుక జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగమాకులపల్లెలో గృహప్రవేశం జరిగిన ఇంట విషాదం నెలకొంది. ఓ ఇళ్లు గృహప్రవేశానికి వేసిన షామియాన గాలికి కరెంట్ తీగలపై పడింది. దీంతో, ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగి.. అక్కడున్న వారిపై పడటంతో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరికొందరు గాయపడటంతో వారిని వెంటనే బి.కొత్తకోట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. కాగా, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వేడుక జరుగుతున్న ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నారు. మృతుల వివరాలు ఇవే.. 1. లక్ష్మమ్మ 75, 2.ప్రశాంత్ 26, 3. లక్ష్మన్న 53, 4. శాంతమ్మ 48. -
అంతులేని విషాదం: దేవుడా ఇక మేం ఎవరి కోసం బతకాలి..
ఆరు నెలల పసిప్రాయంలోనే కూతురు చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని కన్నవారు ఎన్నో కలలు కన్నారు. అమ్మానాన్నల ఆశలను ఆవిరి చేస్తూ తనయుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. దేవుడా ఇక మేం ఎవరి కోసం బతకాలి.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. సాక్షి, అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం కాట్నగల్లుకు చెందిన కొక్కల శ్యామలమ్మ, నారాయణ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు సంతానం. ఆరు నెలల వయసులోనే కుమార్తె మృతి చెందింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు జగదీష్ (25)ను బాగా చదివించారు. గత రెండేళ్ల నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉన్నాడని ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు. రెండు నెలల నుంచి వారు తమ కుమారుడిని ఓ ఇంటివాడిని చేయాలని భావించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగదీష్ ఐదు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. జ్వరం తగ్గుముఖం పట్టడంతో ఇంటికి వచ్చేశారు. కాగా గురువారం మళ్లీ జ్వరం వచ్చి స్పృహ కోల్పోవడంతో వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అప్పటికే యువకుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తమ కళ్లెదుటే చెట్టంత కొడుకు మరణించాడనే వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే యువకుడు హఠాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చదవండి👉🏾 (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి) -
అనాథలైన అన్నాచెల్లెలు
జన్మనిచ్చిన తల్లి ఊహ తెలియకనే అనారో గ్యంతో చనిపోయింది. ఏడాదిన్నర క్రితం తండ్రి అనంత లోకాలకు వెళ్లిపోయాడు.కొండంత అండగా నిలిచిన తాతఅప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అన్నాచెల్లెళ్లు అనాథలుగా మారారు. కుటుంబాన్ని పోగొట్టుకున్న వారు ఇక మాకు దిక్కెవరంటూ చేస్తున్న రోదనలు అన్నీఇన్నీ కావు. వారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. పెద్దతిప్పసముద్రం: అప్పుల బాధ తాళలేక మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ నవాబుకోటకు చెందిన గుమ్మసముద్రం గంగులప్ప ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనకు సోమవారం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అంతిమ సం స్కారాలు చేశారు. తుమ్మరకుంట పంచాయతీ నవాబు కోటకు చెందిన గంగులప్ప, సుబ్బమ్మ దంపతులకు సుబ్బరాయప్ప, శ్రీరాములు కొడుకులు. చిన్న కుమారుడు సుబ్బరాయప్ప, కోడలు ఈశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఎనిమిదేళ్ల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. దీంతో వారి పిల్లలు మీనా, అనీల్ అనాథలుగా మిగిలారు. వారి పోషణ భారం గంగులప్ప మీద పడింది. తనకున్న మూడెకరాల పొలంలో ప్రభుత్వం ఉమ్మడి రైతులకు వేసిన బోరు ద్వారా టమాట పంట సాగు చేస్తూ భార్య, మనవడు, మనవరాలిని పోషించుకుంటున్నాడు. రెండేళ్లుగా వరుసగా టమాట పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. కుటుంబ పోషణ భారంగా మారింది. మనవరాలికి పెళ్లి ఎలా చేయాలో తెలియలేదు. దీనికితోడు పంట సాగు కోసం చేసిన రూ.1.10 లక్షల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక జీవితంపై విరక్తి చెంది ఆదివారం వేకువజామున వ్యవసాయ పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోయినా కొండంత అండగా నిలిచిన తాత హఠాన్మరణంతో ఆ ఇద్దరు పిల్లల ఆవేదన అంతా ఇంతా కాదు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఇంక మాకు దిక్కెవరని వారు చేస్తున్న రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. చేతులు చాచి దహన సంస్కారాలు చేశాం మాకు అమ్మా నాన్న లేకపోయినా అవ్వా, తాత మంచి చెడ్డా చూశారు. మా తాత ఆత్మహత్య చేసుకుని మాకు దూరం అయ్యాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దాతల సహకారంతో అంతిమ సంస్కారాలు చేశాం. –మీనా ఏం చేయాలో దిక్కు తోచడం లేదు చిన్నప్పుడే అమ్మ, ఇంటర్ చదివేటప్పుడు నాన్న చనిపోయాడు. చదువును ఆపేసి పొలం పనుల్లో తాతకు చేదో డు వాదోడుగా ఉంటున్నా. మా తాత చనిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. చెల్లెలు పెళ్లీడుకు వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – అనీల్ పూరి గుడిసెలో తల దాచుకుంటున్నాం ఇన్నాళ్లు పూరి గుడిసెలోనే తల దాచుకుంటున్నాం. చిన్న కొడుకుకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. వానొస్తే అది కూడా కారుతుంది. వైకుంఠ సమారాధన చేయాలన్నా చేతిలో చిల్లి గవ్వ లేదు. గవర్నమెంటోళ్లు మమ్మల్ని ఆదుకోవాలి. –సుబ్బమ్మ, రైతు భార్య -
టెంపో ఢీకొని ఇద్దరి దుర్మరణం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని టి.సదుం పంచా యతీ చెన్నరాయునిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని టెంపో ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసుల కథ నం మేరకు.. కర్ణాటక సరిహద్దులోని ఉప్పుకుంటపల్లికి చెందిన జయమ్మ (54) సమీపంలోని అంకాలమడుగు గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని సమీప బంధువు రామక్రిష్ణప్ప(58)తో కలిసి ద్విచక్ర వాహనంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న చెన్నరాయనిపల్లి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న టెంపో ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో జయమ్మ, రామక్రిష్ణప్ప తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ విషయం తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి చేరు కుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
35 ఏళ్లకు ఒక్కటైన అన్నదమ్ములు
* తండ్రి మరణించినా దూరం * బిడ్డల పెళ్లిళ్లకూ మాటలు కలవలేదు * వైఎస్సార్ సీపీ కోసం కలిసిన సోదరులు బి.కొత్తకోట, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కాయలవాండ్లపల్లెకు చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పప్పు రాజారెడ్డి, బి.కొత్తకోట సహకార గృహనిర్మాణ సంఘం అధ్యక్షుడు పప్పు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నదమ్ములు. వీరిద్దరూ బి.కొత్తకోటలో స్థిరపడ్డారు. వీరికి 19, 18 ఏళ్ల వయసులోనే మనస్పర్థలు రావడంతో విడిపోయూరు. అప్పటి నుంచి మాటలు లేవు. విడిపోయూక తొలుత అన్న రాజారెడ్డి వివాహం జరిగింది. తర్వాత రవీంద్రనాథ్‌రెడ్డి పెళ్లి జరిగింది. ఒకరి వివాహాలకు ఒకరు హాజరుకాలేదు. కొంత కాలానికి తండ్రి లక్ష్మీనారాయణరెడ్డి మరణించారు. కర్మక్రియలను సోదరులిద్దరూ వేర్వేరుగా జరిపారు. గడచిన మూడేళ్లలో రాజారెడ్డి కుమార్తె, రవీంద్రనాథ్‌రెడ్డి కుమార్తె వివాహలు జరిగారుు. ఈ పెళ్లిళ్ల సమయంలోనూ సోదరులు కలవలేదు. మనవళ్లు పుట్టినా మాటలు కలవలేదు. ఈ పరిస్థితుల్లో కొన్ని రోజులుగా సోదరుల మధ్యన మాటలు కలిశాయి. ఎదురుపడితే పలకరించుకుంటున్నారు. యోగక్షేమాలు చెప్పుకుంటున్నారు. చూసేవాళ్లు ఇది నిజమేనా అని అనుమానిస్తున్నారు. దీని వెనుక జరిగిందేమిటంటే..రవీంద్రనాథ్‌రెడ్డి తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యేప్రవీణ్కుమార్రెడ్డి వర్గీయుడు. ప్రవీణ్ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడంతో ఈయన కూడా పార్టీలోకి వచ్చేశారు. ఆయన సోదరుడు రాజారెడ్డి మొదటి నుంచి వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. మొదట్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి దూరంగా ఉన్న రాజిరెడ్డి ఇటీవల దగ్గరయ్యారు. పార్టీ సమావేశాలప్పుడు అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు ఎదురుపడడం లాంటి సందర్భాల్లో ఓ శుభవేళ మాటలూ కలిశాయి. అంతే ఇద్దరూ అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు. పాత మనస్పర్థలు మరచి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. సోదరులిద్దరూ కలిసి పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు.