కోడికీ మేకకు టోల్ ఫీజు
కైకలూరు :
కొల్లేరు సుందరతీరంలో శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారు కొలువై ఉంది. సర్కారు కాల్వపైనుంచే ఇనుప వంతెన దాటి కొల్లేటికోటలో అమ్మ సన్నిదికి చేరాలి. ఆదివారాలు, జాతర సమయంలో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పందిరిపల్లిగూడెం గ్రామస్తులు కాలువ దాటడానికి సర్కారు కాల్వపై మూడేళ్ల కిందట ఇనుప వంతెన కట్టుకున్నారు. దీనిపై వెళ్లాలంటే టోల్‌ఫీజు కట్టాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. గ్రామానికి చెందిన నేపాల కొండయ్య అనే వ్యక్తి ఏడాదికి రూ.25 లక్షలను గ్రామపెద్దలకు చెల్లించి ఈ వంతెన ‘టోల్ ఫీజు‘ కాంట్రాక్టును దక్కించుకున్నారు. అంతకుముందు బాగానే ఉన్నా ఈ ఏడాది ఆరంభం నుంచి రేట్ల మోత మోగిపోతోంది.
మహానేత మరణంతో ఆగిన వారధి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ వారధి నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించగా, ఆయన అకాలమరణంతో నిర్మాణం ఆగిపోయింది. ఎన్నికల సమయంలో కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వారధి నిర్మిస్తామన్నారు. నేడో రేపో శంకుస్థాపన చేస్తున్నామని కామినేని రెండున్నరేళ్లలో మూడుసార్లు ప్రకటించినా అవన్నీ నీటిమీది రాతలే.
దేనికెంత రేటంటే
ఆటోకు రానుపోను రూ.50గా పెద్దలు నిర్ణయించారు. కానీ ‘కాంట్రాక్టరు‘ మాత్రం సొంత రేట్లు అమలుచేస్తున్నాడు. ఆటోకు రూ.100 వసూలు చేయడంతో పాటు ఆటోలో ప్రయాణికులు ఒక్కొక్కరి నుంచి అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు.
మోటరు సైకిల్‌కు రానుపోను రూ.10 నిర్ణయిస్తే వసూళ్లు మాత్రం రూ.20 నుంచి ఒక్కోసారి రూ.40కి చేరుతోంది. వంతెనపై ఆవు, గెదే తీసుకువెళితే ఒక్కోదానికి రూ.50 చెల్లించాలి.
కోడికి, మేకకు రూ.5 చొప్పున కట్టాలి.
చేపల వాహనానికి రూ.300. నాలుగు చక్రాల వాహనాలకు అనుమతి లేదన్న ప్రకటన అంతా ఉత్తిదే. సుమారు 150 మీటర్ల పొడవుండే ఈ వంతెన జనం, వాహనాల బరువును తట్టుకోలేక ప్రమాదం జరిగితే దానికి బాధ్యులెవరనేదానికి జవాబు లేదు.