ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
ఆళ్లగడ్డ: సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం అలవరుచుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠకోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ అన్నారు. శనివారం ఆళ్లగడ్డ పట్టణంలో భక్తుల డోలత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ రామానుజన్ స్వాముల వారు ఆరాధించిన నవనీత కృష్ణుడి విగ్రహంతో పలువురి గృహాల్లో పర్యటించారు. స్వామి విగ్రహాన్ని ఆయా గృహాల్లోని ఊయలలో కొలువుంచి అర్చనలు, పూజలు నిర్వహించారు. నవనీత కృష్ణుడి విగ్రహం తమ గృహాల్లో కొలువై పూజలు అందుకుంటే ఆ ఇల్లు బృందావనం అవుతుందని భక్తుల విశ్వాసం. ప్రత్యేక పూజల అంనతరం పీఠాధిపతి భక్తులను అక్షింతలతో ఆశీర్వాదించారు.
పీఠాధిపతికి ఘనస్వాగతం
అహోబిల పీఠాధిపతి ఆళ్లగడ్డ పట్టణానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పట్టణ వాసులు ఆయన వాహనానికి ఎదురేగి ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి వెంట అహోబిలం ప్రధానర్చకులు వేణుగోపాలన్, మఠం ప్రతినిథి సంపత్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులున్నారు.