pellets
-
కేటీఆర్‌తో ‘హస్క్ ఇంటర్నేషనల్’ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హస్క్ పెల్లెట్లు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు ‘హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్’ప్రతినిధులు ఆదివారం మంత్రి కె. తారక రామారావుతో లండన్‌లో భేటీ అయ్యారు. సుమారు 200 కోట్ల పెట్టుబడితో ఏటా వెయ్యి మెట్రిక్ టన్నుల బయో పెల్లెట్ల తయారీ యూనిట్ ఏర్పాటును ప్రతిపాదించింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హస్క్ (ధాన్యం ఊక/పొట్టు), పునర్వినియోగానికి వీలుండే ప్లాస్టిక్‌ను సహకార పద్ధతిలో సేకరించేందుకు హస్క్ ఇంటర్నేషనల్ ఆసక్తి చూపింది. రాష్ట్రంలో హస్క్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలకు పూర్తిగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్‌కు చెందిన ‘ఇంక్రెడిబుల్ హస్క్ యూకే’సీఈఓ కీత్ రిడ్జ్‌వే, ఇంక్రెడిబుల్ హస్క్ ఇండియా సీఈఓ సీకా చంద్రశేఖర్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ ఆత్మకూరి అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు లండన్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రతిష్టించిన భారీ అంబేడ్కర్ విగ్రహ నమూనాను మ్యూజియం అధికారులకు ఆయన బహూకరించారు. బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు ఆయన నివసించిన ఇంటినే మ్యూజియంగా మార్చారు. -
సికింద్రాబాద్ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడ్డ 13 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి మేజర్, ముగ్గురికి మైనర్ ఆపరేషన్లు చేసిన వైద్యులు.. వారి శరీరంలోకి దిగిన ఎనిమిది తుపాకీ పెల్లెట్లను వెలికితీశారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం గుండ్రేటిపల్లికి చెందిన దండు మహేశ్ (21)కు వీపు భాగంలో శస్త్రచికిత్స చేసి రెండు పెల్లెట్లు బయటికి తీశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు నాగేందర్‌బాబు (21) కాలులోకి దూసుకుపోయిన రెండు పెల్లెట్లను.. కామారెడ్డిజిల్లా నిజాంసాగర్‌కు చెందిన పి.మోహన్ తొడ, నడుము భాగాల్లో దిగిన రెండు పెల్లెట్లను వెలికి తీశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లక్కం వినయ్ (20)కు ఛాతీపై కుడివైపు.. కర్నూల్ జిల్లా మంత్రాలయానికి చెందిన జగన్నాథ్ రంగస్వామి(20)కి పక్కటెముకల్లో దిగిన ఒక్కో పెల్లెట్‌ను బయటికి తీశారు. వీరంతా ఐసీయూలో కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఇక స్వల్ప గాయాలైన మరో ఎనిమిది మంది కోలుకున్నారని.. కానీ వారు మానసిక ఆందోళనలో ఉండటంతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వారిని మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాక డిశ్చార్జి చేస్తామన్నారు. (చదవండి👉🏻 ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!) మానసిక నిపుణులతో కౌన్సెలింగ్.. రైల్వేస్టేషన్ ఘటనతో క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారని.. వారికి ఆస్పత్రి మానసిక నిపుణులు కౌన్సెలింగ్ చేస్తున్నారని వైద్యులు తెలిపారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వీరు ఆత్మహత్యకు యత్నించే అవకాశాలూ ఉన్నాయని.. అందుకే కౌన్సెలింగ్ ఇచ్చి, వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సంబంధిత వైద్యాధికారి వెల్లడించారు. (చదవండి👉🏻 ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి) -
తినుబండారాలనుకుని కొంగల కోసం దాచిన గుళికలను తిని..
ఏర్పేడు(చిత్తూరు జిల్లా): కొంగల కోసం ఇంట్లో దాచిన గుళికలను తినుబండారమనుకుని తినడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ఏర్పేడు మండలం, ముసలిపేడు పంచాయతీ, బత్తెనయ్య ఎస్టీ కాలనీలో సోమవారం విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కథనం.. ముసలిపేడు బత్తెనయ్య ఎస్టీ కాలనీకి చెందిన బాబు, గోవిందమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ఆలస్యంగా వెలుగులోకి.. పెళ్లి భోజనం వికటించి.. బాబు తరచూ కొంగలకు గుళికలు పెట్టి, మృతి చెందిన తర్వాత వాటిని తెచ్చుకుని తింటుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో గుళికల ప్యాకెట్ ఉంచి సోమవారం బాబు తన భార్య గోవిందమ్మతో కలిసి వ్యవసాయ కూలి పనులకు వెళ్లాడు. బాబు రెండో కుమారుడు నాని(3) ఇంట్లోని గుళికలను తినుబండారం అనుకుని వాటిని తినడంతో అపస్మారక స్థితికి చేరుకుని కొంత సేపటికే మృతిచెందాడు. విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గొంతులో గోలి ఇరుక్కుని చిన్నారి మృతి
చెన్నై , అన్నానగర్: నన్‌మంగళంలో బాలుడి గొంతులో గోలి ఇరుక్కోవడంతో ఊపిరి అందక కుప్పకూలిపోయిన చిన్నారి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. చెన్నై, కోవిలంబాక్కం సమీపం నన్మంగళం హస్తినాపురం రోడ్డు 6వ వీధికి చెందిన దీనదయాళన్. ఇతను కందన్ చావడిలోని ప్రైవేటు సంస్థలో డిజైనర్‌గా పని చేస్తూ వస్తున్నాడు. ఇతని భార్య ఇందు. ఈ దంపతులకు కనిష్ (3) అనే కుమారుడు ఉన్నాడు. గత నెల 31వ తేదీ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కనిష్, అక్కడు గోలిని తీసుకుని నోటిలో పెట్టుకున్నాడు. గోలి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక స్పృహతప్పి కింద పడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన ఇందు, స్థానికుల సహాయంతో చిన్నారిని పల్లికరనైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎగ్మూర్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి కనిష్ మృతి చెందాడు. దీనిపై పల్లికరనై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
చిన్నారి పాప.. ఎందుకీ శిక్ష?
‘ఆమె చేసిన తప్పేంటి? లోకం తెలియని పసిపాప. ఆమెకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను దేవుడిని కోరేది ఒక్కటే. దీనంతకీ కారణమైన వారిని కఠిన శిక్ష పడాలి’ ఓ తల్లి ఆవేదన ఇది. తన 20 నెలల కుమార్తె హిబా నిసార్ కంటిపాపను చిదిమేసిన వారిపై మార్సలా జాన్ వ్యక్తం చేసిన ఆక్రందన అందరినీ కదిలిస్తోంది. జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లోని శ్రీ మహరాజ హరిసింగ్ (ఎస్ఎంహచ్ఎస్) ఆస్పత్రి ఆప్తమాలజీ విభాగంలో నాలుగో నంబరు మంచంపై హిబా నిసార్ ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఏడుపు మాన్పించేందుకు ఆమె తల్లిదండ్రులు చాకెట్లు, స్వీట్లు ఇచ్చి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కంటి గాయం బాధను తట్టుకోలేక చిన్నారి రోదిస్తూనే ఉంది. షొపియాన్లో ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కుడి కంటికి గాయమైంది. ఇంట్లో ఆడుకుంటున్న హిబా కంట్లోకి పెల్లెట్ దూసుకొచ్చింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శత్రచికిత్స చేసి పెల్లెట్‌ను తొలగించారు. అయితే పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కుడి కంటిచూపు పోయే ప్రమాదముందని డాక్టర్లు చెప్పడంతో హిబా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏం జరిగింది? షోపియాన్‌లో ఆదివారం తెల్లవారుజామున అల్లర్లు చెలరేగడంతో భద్రతా దళాలు, అల్లరి మూకలకు మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పౌరుడొకరు ప్రాణాలు కోల్పోగా, 50 మందిపైగా గాయపడ్డారు. ఇదే గొడవలు హిబా కంటి గాయానికి కారణమయ్యారు. తమ ఇంటి దీపం హిబాకు గాయమైన క్రమాన్ని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో ఆమె తల్లి జాన్ వివరించారు. ‘మేము ఇంట్లో ఉండగా బయట టియర్ గ్యాస్ కాల్పులు కొనసాగాయి. బయటంతా పొగ కమ్మేయడంతో ఐదేళ్ల నా కుమారుడు శ్వాస పీల్చుకుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో నా పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోవాలని అనుకున్నాను. వెంటనే తలుపులు తీశాను. ముగ్గురు వ్యక్తులు(భద్రతా సిబ్బంది) నేరుగా మాపైకి పెల్లెట్లను ప్రయోగించార’ని వెల్లడించారు. హిబా కుటుంబం షొపియాన్ జిల్లా బాత్గండ్ ప్రాంతంలోని కాప్రిన్ గ్రామంలో నివసిస్తోంది. ఆదివారం ఇక్కడే అల్లర్లు జరిగాయి. వైద్యుల సలహా మేరకు హిబాను షొపియాన్ నుంచి శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. కొడుకు ఎలా ఉన్నాడో? తన పిల్లలను కాపాడుకునే క్రమంలో తన చేతికి కూడా గాయమైందని మార్సలా జాన్ తెలిపారు. హిబాను రక్షించేందుకు తన చేతిని ఆమె ముఖానికి అడ్డుగా పెట్టానని చెప్పారు. తన చేతి పక్క నుంచి పెల్లెట్ హిబా కంట్లోకి దూసుకుపోయిందన్నారు. తమ కొడుకు గురించి కూడా జాన్, ఆమె భర్త నిసార్ అహ్మద్ ఆందోళన చెందుతున్నారు. తన కుమారుడి దేహంలోకి పెల్లెట్లు దూసుకెళ్లాయేమో చూడాలని షొపియాన్లోని తన బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. పెల్లెట్ల బారి నుంచి కాపాడేందుకు తన కుమారుడిని మరోవైపుకు తోసేసినట్టు వెల్లడించారు. తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని దీనంగా చెప్పారు. హిబా ఆరోగ్య పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఎస్ఎంహచ్ఎస్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ‘ఆమె పరిస్థితి బాలేదు. చేతి వేళ్లు చూపించి చికిత్సకు చిన్నారి ఏవిధంగా స్పందిస్తుందో పరీక్షిస్తున్నాం. పెల్లెట్ కారణంగా కంటిలోని కార్నియా దెబ్బతింద’ని ఆప్తమాలజీ విభాగం డాక్టర్ ఒకరు వెల్లడించారు. చిన్నారి హిబా పడుతున్న యాతన ఆస్పత్రి సిబ్బందితో పాటు అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె కంటిచూపు కలకాలం ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు. -
'ఏమ్మా.. నీకు నాపై కోపంగా ఉందా?'
న్యూఢిల్లీ: 'ఏమ్మా.. నీకు నాపై కోపంగా ఉందా' అంటూ జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కశ్మీర్ బలగాల కాల్పుల్లో కంటిచూపు కోల్పోయిన బాధితురాలు ఇన్షా మాలిక్‌ను సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో అడిగారు. దీంతో ఆమె పక్కనే ఉన్న ఆ పాప తల్లి బోరుమని ఏడ్చింది. ఆ సన్నివేశం చూసి ముఖ్యమంత్రి ముఫ్తీ చలించిపోయారు. ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆందోళన పరిస్థితులు ఉన్న విషయం తెలిసిందే. దీని నుంచి బయటపడేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం ముఫ్తీ పెల్లెట్ గన్స్ బాధితులను పరామర్శించారు. 'నేను 16 ఏళ్ల ఇన్షాను ఆస్పత్రిలో కలిశాను. ఆమెను చూడగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. నాపై నీకు కోపంగా ఉందా అని ప్రశ్నించా.. ఆ మాటతో పక్కనే ఉన్న ఇన్షా తల్లి బోరుమని ఏడ్చింది. మేం ఎక్కడ తప్పు చేశామా నాలో నేను ప్రశ్నించుకున్నాను' అని ముఫ్తీ చెప్పారు. అనంతరం వైద్యులతో ఆ పాప చూపు గురించి మాట్లాడిన ముఫ్తీ తిరిగి తను ప్రపంచాన్ని చూసేందుకు ఉన్న అన్ని అవకాశాల్లో ప్రయత్నించాలని కోరారు. ఇన్షా కుటుంబానికి కూడా ఆమె హామీ ఇచ్చారు. తిరిగి ఆ పాప ఈ లోకాన్ని చూస్తుందని భరోసా ఇచ్చారు. మొత్తం వ్యయం ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇన్షా తొమ్మిదో తరగతి చదువుతోంది. అల్లర్లను అదుపు చేసే క్రమంలో బలగాలు ప్రయోగించిన పెల్లెట్స్ తాకి తన కంటిచూపును కోల్పోయింది.