గాంధీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడ్డ 13 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి మేజర్, ముగ్గురికి మైనర్ ఆపరేషన్లు చేసిన వైద్యులు.. వారి శరీరంలోకి దిగిన ఎనిమిది తుపాకీ పెల్లెట్లను వెలికితీశారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం గుండ్రేటిపల్లికి చెందిన దండు మహేశ్ (21)కు వీపు భాగంలో శస్త్రచికిత్స చేసి రెండు పెల్లెట్లు బయటికి తీశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు నాగేందర్‌బాబు (21) కాలులోకి దూసుకుపోయిన రెండు పెల్లెట్లను.. కామారెడ్డిజిల్లా నిజాంసాగర్‌కు చెందిన పి.మోహన్ తొడ, నడుము భాగాల్లో దిగిన రెండు పెల్లెట్లను వెలికి తీశారు.
మహబూబ్‌నగర్‌కు చెందిన లక్కం వినయ్ (20)కు ఛాతీపై కుడివైపు.. కర్నూల్ జిల్లా మంత్రాలయానికి చెందిన జగన్నాథ్ రంగస్వామి(20)కి పక్కటెముకల్లో దిగిన ఒక్కో పెల్లెట్‌ను బయటికి తీశారు. వీరంతా ఐసీయూలో కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఇక స్వల్ప గాయాలైన మరో ఎనిమిది మంది కోలుకున్నారని.. కానీ వారు మానసిక ఆందోళనలో ఉండటంతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వారిని మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాక డిశ్చార్జి చేస్తామన్నారు.
(చదవండి👉🏻 ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!)
మానసిక నిపుణులతో కౌన్సెలింగ్..
రైల్వేస్టేషన్ ఘటనతో క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారని.. వారికి ఆస్పత్రి మానసిక నిపుణులు కౌన్సెలింగ్ చేస్తున్నారని వైద్యులు తెలిపారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వీరు ఆత్మహత్యకు యత్నించే అవకాశాలూ ఉన్నాయని.. అందుకే కౌన్సెలింగ్ ఇచ్చి, వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సంబంధిత వైద్యాధికారి వెల్లడించారు.
(చదవండి👉🏻 ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి)
Comments
Please login to add a commentAdd a comment