
గోవింద్ అజయ్
సాక్షి, వరంగల్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్న వరంగల్ యువకుడు గోవింద్ అజయ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. స్టేషన్ ఘన్‌పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అజయ్.. ఆందోళనల్లో పాల్గొని ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడాడు. దీంతో, అజయ్ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారన్న విషయం తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో తనపై కేసులు పెడతారేమోనని భయపడిన అజయ్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన అజయ్ పేరెంట్స్.. అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అజయ్.. వాట్సాప్ మెసేజ్ రావడం వల్లే తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. తాను వెళ్లిన 10 నిమిషాలకు అక్కడ ఫైరింగ్ జరిగినట్టు తెలిపాడు. ఆర్మీ ఫిజికల్ టెస్టులో పాస్ అయి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఆర్మీకి ప్రిపేర్ కావడంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అప్లై చేశానన్నాడు. ఆందోళనల్లో భాగంగా కేసు అయితే ఉద్యోగం రాదనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు