penumantra
-
ఘరానా మోసగాడి అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి: అద్దె వాహానాలను విక్రయిస్తూ ఘరానా మోసాలకు పాల్పడిన మెడపాటి మురళీ అనే వ్యక్తిని పెనుమంట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు మీడియా ముందు హజరుపరిచారు. నిందితుడు అద్దె పేరుతో వాహనాలు తీసుకుని వాటిని విక్రయించినట్లు చెప్పారు. ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి కోటి రూపాయల విలువ చేసే 13 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు నిందితుడు 13 కార్లను అద్దెకు తీసుకుని వాటిని అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపామన్నారు. ఈ క్రమంలో నిందితుడు మొరళీని ఇవాళ అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈజీ మని జల్సాలకు అలవాటు పడిన నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం
పెనుమంట్ర : జగనన్న స్పూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలు మడమ తిప్పని పోరాటం కొనసాగించాలని పార్టీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాసు పిలుపునిచ్చారు. మార్టేరులోని నాలుగు రోడ్ల కూడలిలో ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక హోదా భావితరాల కోసం ఎంతో అవసరమన్నారు. భవిష్యత్‌లో పిల్లల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక హోదా అత్యవసరమన్నారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం కరివేపాకులా తీసి పారేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హోదా ఇస్తామని వాగ్దానం చేసిన మోదీ ఇప్పుడు మాట తప్పడం అన్యాయమన్నారు. హోదా కోసం టీడీపీ నేతలు కేంద్రంపై చిత్తశుద్ధితో పోరాటం చేయడంలేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయటం చరిత్రాత్మకమని కొనియాడారు. వారి త్యాగం తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. జగనన్న హోదా కోసం రాజీలేని పోరు సాగిస్తున్నారని అన్నారు. సోమవారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలను, నాయకులను కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన నేతలు కార్యకర్తలు శిబిరంలో కూర్చుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా నాయకులు వైట్ల కిషోర్, అల్లం బులిరెడ్డి, ఆచంట, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర మండలాల పార్టీ కన్వీనర్లు ముప్పాల వెంకటేశ్వరరావు, రుద్రరాజు శివాజీరాజు, దంపనబోయిన బాబూరావు, కర్రి వేణుబాబు, వెలగల శ్రీనివాసరెడ్డి, దొంగ దుర్గాప్రసాద్, పడాల కేశవరెడ్డి, వెలగల నారాయణరెడ్డి, వై.వరప్రసాద్, కర్రి సురేష్‌రెడ్డి, చింతపల్లి చంటి, రామచంద్రరావు, కొవ్వూరి వేణుమాధవరెడ్డి, కవురు శెట్టి, గుడాల సుబ్బారావు ఆదివారం నాటి రిలే దీక్షలో కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు తిరుపతి పెదకాపు, ఉన్నమట్ల మునిబాబు, అల్లం భాస్కరరెడ్డి, బుర్రా రవికుమార్, గుడిమెట్ల సత్యనారాయణరెడ్డి, వీరవల్లి స్వామి, బళ్ల బద్రి, పడాల కేశవరెడ్డి, షేక్ సాహెబ్, చిర్ల నరసింహారెడ్డి, కోనాల గంగాధరరెడ్డి, ఈది ప్రవీణ్ తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. -
కంప్యూటర్ విద్య.. అదో మిథ్య
పెనుమంట్ర, న్యూస్‌లైన్ : విద్యార్థులకు ప్రాథమిక దశనుంచే కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అమల్లోకి తెచ్చిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగపడకపోగా, మరోవైపు వందలాది మంది కంప్యూటర్ ఫ్యాకల్టీ (బోధనా సిబ్బంది)ని రోడ్డున పడేసింది. కంప్యూటర్ విద్య అటకెక్కడంతో ఇప్పటికే 440 మంది బోధకులు ఉద్యోగాలను కో ల్పోగా, వచ్చే నెలలో మరో 24మంది రోడ్డున పడనున్నారు. మూడేళ్ల ముచ్చట... జిల్లాలో 279 ఉన్నత పాఠశాలల్లో 2010లో కంప్యూటర్ విద్యాబోధన చేపట్టారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున ఫ్యాకల్టీలను నియమించారు. ఐదేళ్లపాటు విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించే బాధ్యతను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ ఒక్కొక్క పాఠశాలకు ఒక జనరేటర్, 11 కంప్యూటర్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్‌ను సరఫరా చేయడంతోపాటు, ఇద్దరేసి ఫ్యాకల్టీలను కూడా నియమించింది. వారికి తొలుత రూ.1,400 జీతం నిర్ణయించగా, కొంతకాలానికి రూ.2వేలకు పెంచారు. 2011లో కంప్యూటర్ టీచర్స్ 3 నెలలకు పైగా సమ్మె చేయడంతో జీతాన్ని రూ.2,600కు పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15న 196, నవంబర్ 15 నాటికి 24 పాఠశాలలకు కంపెనీ కాంట్రాక్టు పూర్తికావడంతో కంప్యూటర్ ల్యాబ్‌లకు తాళంవేసి కంప్యూటర్లను ప్రధానోపాధ్యాయులకు సదరు కంపెనీ అప్పగించింది. ఫ్యాకల్టీలను విధుల నుంచి తప్పించింది. దీంతో 440 మంది ఉద్యోగులు రోడ్డునపడాల్సి వచ్చింది. మిగిలిన 12 పాఠశాలల్లో పనిచేస్తున్న 24 మంది జనవరి 30నాటికి కాంట్రాక్ట్ ముగియనుండటంతో వారుకూడా నిరుద్యోగులుగా మారనున్నారు. మరో 47 పాఠశాలల కు మాత్రం 2014 చివరి వరకూ గడువు వుంది. ఇదిలావుండగా, కంప్యూటర్ ల్యాబ్‌లు మూతపడటం, ఫ్యాకల్టీలను తొలగించడంతో 232 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన నిలిచిపోరుుంది. -
తుఫాను ప్రభావం: పెనుమంట్ర ఎమ్మార్వో మృతి
పశ్చిమగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ఓ అధికారి ప్రాణాన్ని బలిగొంది. హెలెన్ ప్రభావంతో చెట్లు విరిగిపడ్డాయి. సహాయ కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించేందుకు పెనుమంట్ర తహసీల్దార్ దంగేటి సత్యనారాయణ తన కారులో అధికారులతో కలిసి బయల్దేరారు. అయితే, తుఫాను గాలుల వల్ల విరిగిన చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉన్నాయి. వెనుక నుంచి లారీ వస్తుండటం, దగ్గరలో మలుపు ఉండటంతో కారు ఓ చెట్టును ఢీకొంది. దీంతో తహసీల్దార్ సత్యనారాయణ అక్కడికక్కడే మరణించారు. పేరుపాలెం వద్ద కూడా ఓ చెట్టు పడిపోయి మరో వ్యక్తి మరణించినట్లు తెలిసింది. పేరుపాలెం వద్ద సముద్రం పది అడుగుల మేర ముందుకొచ్చింది. ఈదురుగాలులు వీస్తున్నాయి. 80-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వృక్షాలు నేలకూలుతున్నాయి. కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి. పదివేలమందిని ఇక్కడినుంచి తరలించారు. పెదమైనివానిలంక, చినమైనివాని లంక ప్రాంతాల్లో వంతెన కూలిపోయేలా ఉంది. ప్రజలను బలవంతంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కలెక్టర్ సిద్దార్థ జైన్ తెలిపారు.