The people
-
ఉలిక్కిపడిన పశ్చిమ
తూర్పుగోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాదంతో జిల్లాలో భయాందోళనలు నరసాపురం(రాయపేట) : తూర్పుగోదావరి జిల్లా మామి డికుదురు మండలం నగరంలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాద ఘటనతో జిల్లాప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) పైప్లైన్లు నరసాపురం మండలం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కావడం, తుప్పుపట్టి పోవడంతో ఏ క్షణమైనా ప్రమా దం చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 250 కిలోమీటర్ల మేర పైప్లైన్లు గ్యాస్ నిక్షేపాల తరలింపులో భాగంగా ఓఎన్జీసీ ఆధ్వర్యంలోని గెయిల్ తీర ప్రాంతం నుంచి 250 కిలోమీటర్ల పైప్లైన్లు వేసింది. నరసాపురం మండలం కొత్తనవరసపురం, పాతనవరసపురం, యలమంచిలి మండలం ఏనుగువానిలంక, బాడవ, చించినాడ గ్రామాలలోని పొలాలు మధ్యన, నివాస గృహాలకు సమీపం నుంచి గ్యాస్ పైప్‌లైన్ ఉంది. అనంతరం నరసాపురం మండలంలోని పలు గ్రామాల మధ్యగా పైప్‌లైన్‌ను విస్తరించారు. నరసాపురం, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు విస్తారంగా లభించడంతో ఓఎన్జీసీతవ్వకాలను మరింత విస్తృతం చేసింది. దీనిలోభాగంగా నరసాపురం పట్టణంలో ఓఎన్జీసీ టెంపుల్లాండ్ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో ఎన్నోసార్లు గ్యాస్ లీకేజీ ఘటనలు జిల్లాలోని గ్యాస్ పైప్లైన్లు కూడా తరచూ లీకేజీ అవుతున్నాయి. అనేకసార్లు గ్యాస్ లీక్ అయినట్లుగా రైతులు గుర్తించి సమీపంలోని ఓఎన్జీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే లీకేజీని అరికట్టేవారు. భూమిలో నుంచి గ్యాస్ ఎగదన్నడంతో ఆ ప్రాంతంలో శబ్దంతో కూడినబుడగలు వచ్చేవని, వాటిని చూసి ఓఎన్జీసీ అధికారులకు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని కొత్తనవరసపురం మాజీ సర్పంచి ఈద ఇశ్రాయేలు తెలిపారు. తుప్పుపట్టిన పైప్లైన్లు 25 ఏళ్ల కిందట వేసిన పైప్లైన్లు కావడంతో తుప్పుపట్టాయని ఓఎన్జీసీ అధికారులే అనేక సందర్భాల్లో చెప్పారని స్థానికులు వివరించారు. పైప్‌లైన్ లీకేజీ అయినవెంటనే తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారని, శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని వాపోతున్నారు. లీకేజీలను అరికట్టడానికి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని, లేకపోతే నగరం లాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశముందని పలువ ఆందోళన వ్యక్తం చేశారు. 125 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ మారుస్తాం కేజీ బేసిన్‌కు సంబంధించి గ్యాస్ పైప్‌లైన్ మొత్తం 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, దానిలో 125 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను త్వరలో మారుస్తామని ఓఎన్జీసీ ఈడీ, అసిస్టెంట్ మేనేజర్(రాజమండ్రి) పి.కృష్ణారావు తెలిపారు. నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 12న ఓఎన్జీసీ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేజీ బేసిన్లో రోజుకు 800 టన్నుల ఆయిల్, 31 లక్షల క్యూబిక్ మీటర్లు గ్యాస్ ఉత్పత్తి అవుతోందని వివరించారు. -
కార్మికుల నోట్లో మట్టి కొట్టిన ’బాబు’
‘అనంత’లో పరిశ్రమలన్నీ ఆయన హయాంలోనే మూత వైఎస్ హయాంలో పరిశ్రమలకు పునరుజ్జీవం సాక్షి, అనంతపురం : నిత్యం కరువు కాటకాలతో సతమతమవుతున్న జిల్లా ప్రజలు ఆర్థికంగా ఎదుగటానికి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ృషి చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న పరిశ్రమలను కూడా మూసేసి కార్మికుల నోట్లో మట్టికొట్టారు. దీంతో కార్మికులందరూ రోడ్ల మీద పడి జీవనోపాధి కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి కుటుంబాలకు దూరమయ్యారు. నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూపురం నియోజకవర్గంలోని తూముకుంట వద్ద దాదాపు 56 పరిశ్రమలు నెలకొల్పితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించకపోవడంతో వాటిలో దాదాపు 40 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. పరిగి వద్ద దాదాపు 150 ఎకరాల్లో ప్రభుత్వ సంస్థగా నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని అతి తక్కువ ధరకు బెంగళూరుకు చెందిన రేణుక షుగర్స్‌కు కట్టబెట్టారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని విక్రయించకూడదని అప్పట్లో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో గట్టి బందోబస్తు మధ్య ఫ్యాక్టరీలో వున్న పెద్ద పెద్ద యంత్రాలు తరలించేందుకు చంద్రబాబు సహకరించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పరిశ్రమలను మూయించి ప్రజాగ్రహానికి గురై అధికారానికి దూరమయ్యారు. జిల్లాలో అక్కడక్కడ ఉన్న పరిశ్రమలను చంద్రబాబు హయాంలో ఒక్కొక్కటిగా మూసేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు, పరిగి వద్ద వున్న చక్కెర ఫ్యాక్టరీ, మళుగూరు వద్ద ఉన్న ఐరన్ ఫ్యాక్టరీ, అనంతపురం శివారులో 23 ఎకరాల్లో వున్న డాల్డా ఫ్యాక్టరీ, ఏపీ లైటింగ్, పెనుకొండ వద్ద ఆల్విన్ కంపెనీ, రామగిరిలో బంగారు గనుల పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక హిందూపురం నియోజకవర్గం తూముకుంట వద్ద ఉన్న 56 పరిశ్రమల్లో ప్రస్తుతం అక్కడున్న వాటిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. కేవలం నీటి సదుపాయం లేకపోవడంతోనే పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలుసుకొని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దాదాపు 350 కిలోమీటర్ల పొడవున పీఏబీఆర్ డ్యాం నుంచి పైప్‌లైన్ వేసి పరిశ్రమలకు నీళ్లు ఇచ్చేందుకు ృషి చేశారు. దీంతో బాబు హయాంలో మూత పడిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా తెరుచుకునే సమయంలో వైఎస్ వృతి చెందారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం తిరిగి అదే పరిస్థితి నెలకొంది. పరిశ్రమల మూతతో ఉపాధి కోల్పోయిన కార్మికులు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత పడటం కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 15 వేల మంది కార్మికులు ఉన్నట్లుండి ఉపాధి కోల్పోయారు. గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు మూత పడటంతో ఉపాధి లేక దాదాపు 20 వేల మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. పెనుకొండలో వున్న ఆల్విన్ కంపెనీ మూత పడటంతో దాదాపు 3 వేల మంది ఉపాధి కోల్పోయారు. దేశంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 23 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుంటే కనీసం నూనె ఉత్పిత్తి కర్మాగారాలు ఏర్పాటు చేయడంలో కూడా పాలకులు శ్రద్ధ చూపలేక పోయారు. -
ప్రజల చూపంతా మోడీపైనే
మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప హొస్పేట, న్యూస్‌లైన్ : గుజరాత్ ముఖ్యమంత్రిని దేశ ప్రధానిగా చూడాలని దేశప్రజలు ఆకాంక్షిస్తున్నారని బీజేపీ నేత, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. హొస్పేటలోని సహకార కల్యాణ మంటంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చి నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి కార్యకర్తలు, నాయకులు కష్టించి పనిచేయాలన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రాథమిక స్థాయి నుంచి కార్యకలాపాలు చేపట్టామని తెలిపారు. బీజేపీ హయాంలో రాష్ర్టం ఎంతో అభివృద్ధి సాధించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదన్నారు. రైతుల సమస్యలపై మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం చెరుకు, వక్క తదితర పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదన్నారు. పాకిస్థాన్ సైనికులు భారత సైనికులను ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి హతమారుస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఇలాంటి సంఘటనలకు అస్కారం ఉండదన్నారు. దేశం ఆర్థిక, విద్య, సైనిక రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. ఇందుకు కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి సైనికుల్లా పని చేయాలన్నారు. బీజేపీలో కుమ్ములాటలవల్లే రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, నాయకులు రామలింగప్ప, అశోక్ గస్తీ, విధాన పరిషత్ ముఖ్యనేత శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యేలు సోమలింగప్ప తదితరులు పాల్గొన్నారు.