ఉలిక్కిపడిన పశ్చిమ
తూర్పుగోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాదంతో జిల్లాలో భయాందోళనలు
నరసాపురం(రాయపేట) : తూర్పుగోదావరి జిల్లా మామి డికుదురు మండలం నగరంలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాద ఘటనతో జిల్లాప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) పైప్‌లైన్లు నరసాపురం మండలం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కావడం, తుప్పుపట్టి పోవడంతో ఏ క్షణమైనా ప్రమా దం చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
250 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు
గ్యాస్ నిక్షేపాల తరలింపులో భాగంగా ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలోని గెయిల్ తీర ప్రాంతం నుంచి 250 కిలోమీటర్ల పైప్‌లైన్లు వేసింది. నరసాపురం మండలం కొత్తనవరసపురం, పాతనవరసపురం, యలమంచిలి మండలం ఏనుగువానిలంక, బాడవ, చించినాడ గ్రామాలలోని పొలాలు మధ్యన, నివాస గృహాలకు సమీపం నుంచి గ్యాస్ పైప్‌లైన్ ఉంది.
అనంతరం నరసాపురం మండలంలోని పలు గ్రామాల మధ్యగా పైప్‌లైన్‌ను విస్తరించారు. నరసాపురం, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు విస్తారంగా లభించడంతో ఓఎన్‌జీసీతవ్వకాలను మరింత విస్తృతం చేసింది. దీనిలోభాగంగా నరసాపురం పట్టణంలో ఓఎన్‌జీసీ టెంపుల్‌లాండ్‌ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
గతంలో ఎన్నోసార్లు గ్యాస్ లీకేజీ ఘటనలు
జిల్లాలోని గ్యాస్ పైప్‌లైన్లు కూడా తరచూ లీకేజీ అవుతున్నాయి. అనేకసార్లు గ్యాస్ లీక్ అయినట్లుగా రైతులు గుర్తించి సమీపంలోని ఓఎన్‌జీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే లీకేజీని అరికట్టేవారు. భూమిలో నుంచి గ్యాస్ ఎగదన్నడంతో ఆ ప్రాంతంలో శబ్దంతో కూడినబుడగలు వచ్చేవని, వాటిని చూసి ఓఎన్‌జీసీ అధికారులకు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని కొత్తనవరసపురం మాజీ సర్పంచి ఈద ఇశ్రాయేలు తెలిపారు.
తుప్పుపట్టిన పైప్‌లైన్లు
25 ఏళ్ల కిందట వేసిన పైప్‌లైన్లు కావడంతో తుప్పుపట్టాయని ఓఎన్‌జీసీ అధికారులే అనేక సందర్భాల్లో చెప్పారని స్థానికులు వివరించారు. పైప్‌లైన్ లీకేజీ అయినవెంటనే తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారని, శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని వాపోతున్నారు. లీకేజీలను అరికట్టడానికి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని, లేకపోతే నగరం లాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశముందని పలువ ఆందోళన వ్యక్తం చేశారు.
125 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ మారుస్తాం
కేజీ బేసిన్‌కు సంబంధించి గ్యాస్ పైప్‌లైన్ మొత్తం 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, దానిలో 125 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను త్వరలో మారుస్తామని ఓఎన్‌జీసీ ఈడీ, అసిస్టెంట్ మేనేజర్(రాజమండ్రి) పి.కృష్ణారావు తెలిపారు. నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 12న ఓఎన్‌జీసీ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేజీ బేసిన్‌లో రోజుకు 800 టన్నుల ఆయిల్, 31 లక్షల క్యూబిక్ మీటర్లు గ్యాస్ ఉత్పత్తి అవుతోందని వివరించారు.