Gas leak incidents
-
చివరికి మిగిలింది విషాదమే
గాందీ ఆస్పత్రి: దోమలగూడ వంట గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కాలిన గాయాలతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అయిదుగురిలో ముగ్గురు శుక్రవారం మృతి చెందారు. ధనలక్ష్మి, పద్మ, అభినవ్‌లు శుక్రవారం మరణించగా, బుధవారం శరణ్య మృతి చెందింది. దోమలగూడ రోజ్‌గార్ కాలనీకి చెందిన పద్మ అనే మహిళ బోనాల వేడుకలకు పద్మారావునగర్ బాపూజీనగర్‌లో నివసిస్తున్న కుమార్తె ధనలక్ష్మి, ఎల్బీనగర్లో ఉంటున్న సొంత చెల్లెలు నాగమణి కుటుంబాలను ఆహా్వనించింది. ధనలక్ష్మితోపాటు భర్త లాలాజీ శ్యామ్, కుమార్తె శరణ్య, కుమారులు అభినవ్, విహాన్‌లు, చెల్లెలు నాగమణి, భర్త ఆనంద్‌లు ఈ నెల 10న రోజ్‌గార్ కాలనీలోని పద్మ ఇంటికి చేరుకున్నారు. మంగళవారం పిండివంటలు చేసేందుకు స్టవ్‌ను వెలిగించగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఒకే గదిలో ఉన్న ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. అదే సమయంలో అల్లుడు శ్యామ్ బయటకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. మంటలను అదుపుచేసి గాయపడిన ఏడుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న క్షతగాత్రులను పీఐసీయూ, టీఎంటీ, బర్న్స్వార్డుల్లో వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. చికిత్స పొందుతూ బుధవారం శరణ్య (7), శుక్రవారం పద్మ (53) ధనలక్ష్మి (29) అభినవ్ (8) మృతి చెందారు. నేను ఎవరి కోసం బతకాలి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో పద్మారావునగర్ బాపూజీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. అత్త, భార్య, ఇద్దరు పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, మరో చిన్నారి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని తాను ఇంకా ఎవరికోసం బతకాలని శ్యామ్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను బాపూజీనగర్‌కు తరలించి ముషీరాబాద్ మొరంబంద శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గాయపడిన మరో చిన్నారి విహాన్ (3) ఆల్వాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు ఆనంద్, నాగమణిల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. -
వంటగ్యాస్ సిలిండర్ లీక్...ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు చెలరేగి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం దోమలగూడలోని రోజ్ కాలనీలో విషాదాన్ని నింపింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన పద్మ వచ్చే ఆదివారం బోనాల పండగ కోసం పద్మారావు నగర్లో నివసించే కూతురు ధనలక్ష్మి, అల్లుడు శ్యామ్, మనవరాలు శరణ్య, మనవళ్లు అభినవ్, విహాన్లను ఇంటికి తీసుకువచ్చింది. ఎల్బీనగర్కు చెందిన సొంత చెల్లెలు నాగమణి, మరిది ఆనంద్‌ను కూడా పండగకు ఆహ్వానించింది. వీరిలో అల్లుడు శ్యామ్ మినహా మిగతా వారంతా ఒకే ఒక చిన్న గదిలో ఉన్నారు. మంగళవారం పిండి వంటలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్టవ్‌ను వెలిగించడంతో గ్యాస్ లీకై ంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి గది అంతటా వ్యాపించాయి. పొగ వ్యాపించింది. గదిలోని ఏడుగురు మంటల్లో చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు. సాహసం చేసిన స్థానికులు.. గదిలోంచి అరుపులు రావడంతో సమీపంలో నివసించే గోవిందరావు అనే వ్యక్తి మరో ఇద్దరు యువకులతో కలిసి లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంతో బయటకు తీసుకువచ్చారు. లేనిపక్షంలో ఏడుగురూ మంటల్లో మసైపోయేవారని స్థానికులు చెప్పారు. అప్పటికే గదిలోని దుస్తులు, పరుపులు చాలా వరకు కాలిపోయాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఏడుగురిని స్థానికులు గదిలోంచి బయటకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు. దోమలగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని బాధితులను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాంగ్రెస్ ఇన్చార్జి అనిల్‌కుమార్ యాదవ్, నగేష్ ముదిరాజ్, కార్పొరేటర్ రచనశ్రీ, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు సందర్శించారు. గాయాలతో గాంధీ ఆస్పత్రిలో.. వంట గ్యాస్ లీకేజీ ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన వేడి గాలులను పీల్చడంతో శ్వాసకోశ నాళాలు, గుండె, ఇతర అంతర్గత అవయవాలు దెబ్బ తిన్నాయని చెప్పారు. పద్మ 40 శాతం, ధనలక్ష్మి 60, అభినవ్ 50, శరణ్య 30, విహాన్ 40, ఆనంద్ 36, నాగమణి 60 శాతం కాలిన గాయాలతో పీఐసీయూ, టీఎంటీ, బర్న్స్ వార్డుల్లో వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గాయపడిన చిన్నారులకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించామన్నారు. టీఎంటీలో నలుగురు క్షతగాత్రులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వివరించారు. -
అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీక్
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువులు లీకై బ్రాండిక్స్ సీడ్స్–2 కంపెనీలో పనిచేసే 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రెండో షిఫ్ట్‌లో సుమారు 2 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు టీ బ్రేక్ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో ఉద్యోగినులకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. వాంతులు, వికారంతో అనేకమంది స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. 45 మందిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లారు. మిగతా ప్లాంట్లలో సిబ్బందిని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించండి: మంత్రి అమర్నాథ్ అచ్యుతాపురం ఘటనపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టితో మాట్లాడారు. గ్యాస్ లీక్‌కు కారణాలను తెలుసుకున్నారు. తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: విశాఖ తీరంలో అరుదైన జీవి.. రాలిన ఆకులా చదునైన శరీరం, ఇదే ప్రత్యేకత -
అప్పు నిప్పుకు కుటుంబం ఆహుతి
సాక్షి, ఖమ్మం: చేసిన వ్యాపారం కలిసి రాలేదు. అప్పు లేమో ఎక్కువయ్యాయి. సొంత ఆస్తులు అమ్మేసి తీరుద్దామనుకున్నాడు. కానీ అనుకున్నట్టు ఆస్తులు చేతికి రాలేదు. దీంతో రుణాలు తీర్చే మార్గం లేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇంట్లో గ్యాస్ లీక్ చేసి నిద్రపోతున్న భార్య, కూతుర్లతో పాటు తనపైనా పెట్రోల్ పోసుకొని నిప్పం టించుకున్నాడు. ఆ ప్రమాదంలో భార్యాభర్తలు, ఓ కూతురు కాలి ముద్దయ్యారు. మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో సోమవారం తెల్లవారు జామున ఈ విషాదం జరిగింది. తన చావుకు తన తల్లి సూర్యవతి, అక్క మాధవి, ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేందర్ రావే కారణమని రాసిన సూసైడ్ నోట్ బాధితుడి కారులో దొరికింది. వ్యాపారాల్లో భారీ నష్టం పట్టణంలోని పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ (38) గతంలో పాల్వంచలో మీ సేవా కేంద్రం నడిపించాడు. నష్టాలు వచ్చి మూసే శాడు. తర్వాత వైజాగ్‌లో మగ్గం వర్క్ వ్యాపారం చేసినా నష్టాలే వచ్చాయి. ఓ ఆన్లైన్ యాప్‌లోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయినట్టు సమాచారం. సుమారు రూ.30 లక్షల మేర అప్పు అయినట్టు తెలుస్తోంది. వీటిని తీర్చేందుకు మరికొంత అప్పు కోసం స్థానికంగా పలువురిని సంప్రదించినా ఫలితం లేకపోవడం, ఇల్లు అమ్ముదామనుకున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్థానికుల వద్ద వాపోయేవాడని తెలిసింది. తన తల్లి, అక్క.. ఎమ్మెల్యే కొడుకేనా? తల్లి సూర్యవతి ఇటీవల కొత్తగూడెం ఆస్పత్రిలో పనిచేసి రిటైర్ కాగా.. ఆ వచ్చిన డబ్బు తనకిస్తే అప్పులు తీరుస్తానని రామకృష్ణ అడుగుతున్నాడు. అయితే ఆయన అక్క మాధవి ఆస్తిలో వాటా కోసం తల్లిని అడుగుతోందని, తనకు ఆస్తి దక్కకుండా చేస్తోందని మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. రామకృష్ణ–మాధవి మధ్య ఆస్తి తగాదా సెటిల్మెంట్కు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, టీఆర్ఎస్ నేత రాఘవేందర్రావును సంప్రదించినట్టు సమాచారం. అయితే పాల్వంచలోని ఇంటితో పాటు గోకవరం, హైదరాబాద్, రాజమండ్రిల్లోని ఇళ్ల స్థలాల పంపకంలో అక్క మాధవి, తల్లికి అనుకూలంగా తీర్పు చెప్పి తనకు అన్యాయం చేశాడని రామకృష్ణ భావించినట్లు సమాచారం. తల్లి బయటకు వచ్చి కేకలు వేయడంతో.. అప్పులు తీర్చు మార్గం లేక సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రామకృష్ణ తన ఇంట్లో గ్యాస్ లీక్ చేశాడు. తర్వాత నిద్రలో ఉన్న భార్య శ్రీలక్ష్మి (33), కవల కుమార్తెలు సాహిత్య (13), సాహితితో పాటు తనపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. మంటలు తాళలేక సాహితి కేకలేస్తూ ఇంటి తలుపు గడి తీసి బయటకు వచ్చి పడిపోయింది. పక్కనే మరో గదిలో తల్లి సూర్యవతి వెంటనే బయటకు వచ్చి పెద్దగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు చేరుకున్నారు. ఫైర్ ఇంజన్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను ఆర్పేశాయి. అప్పటికే నాగ రామకృష్ణ, ఆయన భార్య శ్రీ లక్ష్మి, సాహిత్య మంటల్లో పూర్తిగా కాలిపోయారు. పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు, సీఐ సత్యనారాయణ సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. శ్రీలక్ష్మి తమ్ముడు జనార్దన్ ఫిర్యాదు మేరకు రాఘవేందర్ రావు, తల్లి సూర్యవతి, అక్క మాధవిపైన, తనతో పాటు మరో ఇద్దరి మృతికి కారణమైన రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. కలకలం రేపిన సూసైడ్ నోట్ ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపింది. తన చావుకు రాఘవేందర్ రావు, తల్లి సూర్యవతి, అక్క మాధవే కారణమంటూ నోట్లో పేర్కొన్నాడు. నోట్‌ను ఇంటి ముందు పార్క్ చేసిన కారులో పెట్టి స్నేహితుడికి వాట్సప్ ద్వారా విషయం చెప్పాడు. కారులోని సూసైడ్ నోట్‌ను ఏఎస్పీ రోహిత్ రాజు స్వాధీనం చేసుకున్నారు. కాగా, 6 నెలలుగా ఏపీలోని రంపచోడవరంలో ఉంటున్న రామకృష్ణ ఇటీవలే పాల్వంచలోని ఇంటికి రాగా ఆయన భార్య శ్రీలక్ష్మి ఆదివారం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇంతలోనే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవేందర్‌రావుపై ఇప్పటికే భూసెటిల్మెంట్లు, పైరవీల ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో చక్రం తిప్పుతారనే విమర్శలున్నాయి. గతంలో పాల్వంచ పట్టణానికి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి తనకు చెందాల్సిన స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో కొందరు అడ్డుపడుతున్నారని ఆత్మహత్య చేసుకొని సూసైడ్ నోట్ రాశారు. అందులో ఎమ్మెల్యే కొడుకు రాఘవేందర్రావు పేరు కూడా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ పునరావృతమైంది. సాహితి పరిస్థితి విషమం మంటల్లో 80 శాతం కాలిన రామకృష్ణ కుమార్తె సాహితి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఏఎస్పీ రోహిత్ రాజు ఆమెతో మాట్లాడారు. తాము నిద్రలో ఉండగా తండ్రి పెట్రోల్ పోశాడని, వాసన రావడంతో లేచి చూడగా నిప్పంటించాడని, మంటలు తట్టుకోలేక తాను బయటకు వచ్చినట్టు సాహితి చెప్పిందని ఏఎస్పీ వెల్లడించారు. కావాలనే కుట్ర చేశారు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను రామకృష్ణకు ఎలాంటి అన్యాయం చేయలేదు. గత నెల 26న రామకృష్ణ తన తల్లి సూర్యవతి, అక్క మాధవితో కలిసి నా దగ్గరికి వచ్చాడు (నేను పిలవలేదు). వారి సమస్య విని అన్యాయం చేయొద్దని తల్లికి చెప్పి పంపా. కుటుంబ విషయం కాబట్టి వాళ్లనే పరిష్కరించుకోమన్నా. లేఖలో నా పేరెందుకు రాశాడో తెలియదు. నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే నన్ను ఇబ్బంది పెట్టాలని కొందరు కుట్ర పన్నారు. నేను ఎక్కడికీ పారిపోలేదు. – వనమా రాఘవేందర్రావు -
గ్యాస్ లీక్ ఘటన యాజమాన్య వైఫల్యమే
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరగటానికి పరిశ్రమ యాజమాన్య వైఫల్యమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పడానికి తాము సిద్దంగా లేమని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల సూచనల మేరకే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైతే ఫ్యాక్టరీని జనావాసాల మధ్య నుంచి తరలిస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా గ్రామాలలో పూర్తిగా కెమికల్ శుద్ది చేసిన తర్వాతే ప్రజలని ఇళ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. చంద్రబాబులా తాము ఏది పడితే అది మాట్లాడలేమన్నారు. రేపటి నుంచి బాధితులకి నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. టీడీపీది డ్రామా కంపెనీ.. స్క్రిప్ట్ చదివి నాటకం రక్తి కట్టించామా లేదా అని చూసుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు. చదవండి : ఆ కుటుంబాలకు పరిహారం అందించండి: సీఎం జగన్ -
సిలిం‘డర్’..టేక్ కేర్
సాక్షి, సిటీబ్యూరో: 20 రోజులు... మూడు ‘బ్లాస్ట్’లు... ఒకరు బలి, 13 మందికి తీవ్ర గాయాలు... భారీగా ఆస్తినష్టం... వెరసి ప్రస్తుతం నగరవాసులకు సిలిం‘డర్’ పట్టుకుంది. ఇటీవల కాలంలో తరచుగా ‘గ్యాస్’ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మలక్‌పేట, సరూర్‌నగర్ పరిధుల్లో ఆదివారమే రెండు ఉదంతాలు వెలుగులోకి రాగా... గత నెల్లో చిలకలగూడ ఏరియాలో మరోటి చోటు చేసుకుంది. ఏడాదికి 40 నుంచి 50 వరకు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నా... ఆస్తి నష్టం మాత్రం భారీగా చోటు చేసుకుంటోంది. గ్యాస్ వినియోగంపై వినియోగదారులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. ఏడు చోట్ల లీక్‌కు చాన్స్... గ్యాస్ సిలిండర్... ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండే నిత్యావసర వస్తువు. మన వంటింట్లో ఉండే సిలిండర్‌లో బ్యూటేన్, ప్రొఫైన్ అనే రసాయిన వాయువులు కలిసి ఉంటాయి. 14.5 కేజీల బరువున్న ఈ వాయువులను అత్యధిక ఒత్తిడితో గ్యాస్ సిలిండర్‌లో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ బండ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడిగా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. సాధారణంగా స్టౌ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ... గ్యాస్ లీకేజ్ అనేది ఏడు ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది. సిలిండర్, స్టౌవ్‌లను కలుపుతూ రబ్బర్ ట్యూబ్ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టౌకు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా స్టౌకు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్ సాగే గుణం కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంతం రంధ్రం ఏర్పడితే చాలు. దీని లోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్ లీక్ అవుతుంది. మెల్లమెల్లగా ఇల్లంతా వ్యాపిస్తుంది. మరోపక్క స్టౌకు ఉండే నాబ్స్, రెండు నాబ్స్‌నూ కలిపే పైప్, కొత్త సిలిండర్ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్ నాబ్‌ల నుంచీ లీక్ అయ్యే అవకాశం ఉంది. ‘తెరిచి ఉన్నా’ ఫలితం నిల్... వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకైన గ్యాస్ వాటి నుంచి బయటకు వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకైన తరవాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు తెరిచి ఉన్నా... వెంటిలేటర్లు ఉన్నా వాటి ద్వారా బయటకు పోయే అవకాశం ఉండదు. లీకైన గ్యాస్ అంటుకోవడానికి అనేక రకాలుగా ప్రేరణలు ఉంటాయి. గ్యాస్ వ్యాపించి ఉన్న గదిలో లైట్ వేసినా, అగ్గిపుల్ల, లైటర్ వెలిగించినా, ఏదైనా బరువైన వస్తువు ఎత్తుమీద నుంచి కిందపడినా వచ్చే స్పార్క్ వల్ల అంటుకుంటుంది. మరోపక్క మన ఇంట్లో ఉండే ఫ్రిజ్‌లు కూడా గ్యాస్ మండటానికి ప్రేరణలుగానే పని చేస్తాయి. ఫ్రిజ్‌లో కూలింగ్ పెరిగినప్పుడు ఆగిపోయి, తగ్గిన వెంటనే మళ్లీ స్టార్ట్ అయ్యే పరి/ê్ఞనం ఉంటుంది. దీన్నే రిలే మెకానిజం అంటారు. ఇలా రిలే జరిగేటప్పుడు ఫ్రిజ్ నుంచి ‘టక్’ మనే శబ్దం వస్తుంది. అందులో ఉత్పన్నమయ్యే స్పార్క్ వల్లే ఈ శబ్దం వెలువడేది. ఇంట్లో వ్యాపించిన గ్యాస్ దీనివల్లా అంటుకునే ప్రమాదం ఉంది. మలక్‌పేట ప్రమాదానికి ఇదే కారణమని తెలుస్తోంది. 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది... ఇల్లంతా వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది. తలుపులు, కిటికీలతో పాటు కాస్త బలహీనంగా ఉన్న గోడలు సైతం విరిగిపోతాయి. ఒక్కసారిగా గ్యాస్ అంటుకుని ఆరిపోవడం వల్ల భారీ ఆగి్నప్రమాదం సైతం సంభవించదు. అయితే ఆ సమీపంలో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోవడమో, 60 శాతం వరకు కాలిపోవడమో జరుగుతుంది. అనేక ప్రమాదాల్లో గ్యాస్ సిలిండర్ ఏమాత్రం చెక్కు చెదరదు. దీన్ని చూసి అనేక మంది గ్యాస్ వల్ల జరిగిన పేలుడు కాదని భావిస్తారు. ఇలాంటి బ్లాస్ట్ల్ని కెమికల్ ఎక్స్ప్లోజన్ అని, సిలిండర్ కూడా ఛిద్రం అయిపోతే దాన్ని మెకానికల్ ఎక్స్ప్లోజన్ అని సాంకేతికంగా అంటారు. చూద్దామనుకునేలోపే పేలింది చైతన్యపురి: ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .... సాలార్జంగ్ మ్యూజియంలో పనిచేసే రమేష్ అలియాస్ రాము (31), పెయింటర్‌గా పనిచేసే లక్ష్మణ్ అన్నదమ్ములు. ప్రగతినగర్‌లోని రెండు గదుల ఇంట్లో అన్నదమ్ములు కుటుంబాలు నివాసం ఉంటున్నారు. రమే‹Ùకు బార్య పద్మ, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. లక్ష్మణ్‌కు ఏడాది క్రితమే మల్లికతో వివాహం జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో గ్యాస్ వాసన వస్తుండటంతో రమేష్ లేచి ప్రమాదం పసిగట్టి ఇంట్లో వారందరిని బయటకు పంపించారు. గ్యాస్ వాసన ఎందుకు వస్తుందో చూద్దాం అని లక్ష్మణ్ లైట్ స్విచ్ ఆన్ చేశాడు. దీంతో విస్ఫోటనం జరిగి పెద్ద పేలుడు శబ్దంతో రెండు గదుల్లో మంటలు అంటుకున్నాయి. బయట ఉన్న ఇతర కుటుంబ సభ్యులకు ఏంజరిగిందో అర్ధం అయ్యేలోపే అన్నదమ్ములకు మంటలంటుకున్నాయి. వీరి గదికి ఎదురుగా ఉన్న వృద్ధురాలు లీలమ్మ (62)కు కూడా మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల ఇండ్లకు ఈ సెగతగిలింది. పోలీసులు ఫైర్ ఇంజన్‌ను రప్పించి మంటలు ఆరి్పంచారు. గాయపడ్డ రమే‹Ù, లక్ష్మణ్, లీలమ్మలను ఆసుపత్రికి తరలించారు. సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉలిక్కిపడ్డ ఆస్మాన్‌ఘడ్ మలక్‌పేట: మాడ్గుల మండలం ఫీరోజ్నగర్ గ్రామానికి చెందిన లక్ష్మయ(50), భార్య యాదమ్మ(45)తో కలిసి ఆస్మాన్‌ఘడ్ వెంకటాద్రినగర్‌లోని అస్మాన్ విల్లాలో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు నెలలుగా నివాసం ఉంటున్నారు. లక్ష్మయ్య జియగూడ మండీలో ప్యాగో ట్రాలీ ఆటో నడుపుతుండగా, అదే విల్లాలో యాదమ్మ పనిచేస్తోంది. హస్తినాపురంలో నివాసం ఉంటున్న లక్ష్మయ్య రెండో కూతురు భాగ్యలక్ష్మి పిల్లలు తేజస్విని (9), మోక్షజ్ఞ(7) తలకొండపల్లిలో జరిగే ఫంక్షన్‌కు వెళ్లడానికి సాయంత్రం ఇక్కడికి వచ్చారు. నలుగురూ కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. శనివారం అర్ధరాత్రి గదిలో ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ గ్యాస్ లీకై పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇంటో నిద్రిస్తున్న నలుగురికీ మంటలు అంటుకుని తీవ్రగాయాలు అయ్యాయి. పేలుడు శబ్దం టీవీ టవర్ సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్ వరకు వినిపించింది. అప్రమత్తమైన పోలీసులు, కాలనీవాసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పోలీసులు 108లో సికింద్రాబాద్‌లోని గాం«ధీ ఆసుపత్రికి తరలించారు. నగర జాయింట్ సీపీ, ఈస్ట్‌జోన్ ఇంచార్జ్ డీసీపీ రమే‹Ù, అడిషనల్ డీసీపీ గోవిందరెడ్డి, ఇంచార్జ్ ఏసీపీ దేవేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ లీక్, ఫ్రిడ్జ్‌లో వెనుక భాగంలో ఉన్న సిలిండర్ థర్మో స్ట్రాటర్ స్పార్క్ కరెంట్ షాక్‌తో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమీప ఇండ్లకిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పార్కింగ్ చేసిన కారు, ఆటోలు దెబ్బతిన్నాయి. -
గెర్దావ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తతపై స్పందించిన జేసీ!
-
గెర్దావ్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. స్పందించిన జేసీ!
సాక్షి, అనంతపురం : తాడిపత్రి గెర్దావ్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఫ్యాక్టరీ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కార్మికులు చనిపోయినా యాజమాన్యం సెలవు ఇవ్వలేదని కార్మికులు ఆందోళనకు దిగారని తెలుస్తోంది. దీంతో కార్మికులకు మద్దతుగా జనసేన నేతలు, కార్యకర్తలు గెర్దావ్ ఫ్యాక్టరీని ముట్టడించారు. కాగా, ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటేలా ఉందని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. గెర్దావ్ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గెర్దెవ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో యాజమాన్యం, కార్మికులు ఇద్దరిదీ తప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి మెరుగైన ఆర్థిక పరిహారం ఇవ్వాలని జేసీ సూచించారు. అంతేకాక మృతుల కుటుంబీకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు. ఎక్స్ గ్రేషియాపై ప్రభుత్వంలో మాట్లాడుతానని ఎంపీ చెప్పారు. కానీ, రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయటం సరికాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. -
అర్ధరాత్రి గ్యాస్ కలకలం
భువనగిరి : అది జూన్ 30వ తేదీ అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా గ్యాస్ వాసన రావడంతో జనం ఆందోళన చెందారు. తమ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకైందని భయంగా వంటింట్లోకి వెళ్లి చూసుకున్నారు. ఇలా కాలనీల ప్రజలందరూ చూసుకున్నారు. ఎక్కడా లీక్ కాలేదు. రాత్రిపూట కాలనీ లవాసులందరూ వీధుల్లోకి వచ్చారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్యాస్ వాసన వస్తుండడంతో పారిశ్రామికవాడ నుంచి వస్తుండొచ్చు అని అనుమానించారు. దీంతో ఆదివారం ఉదయం మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ పారిశ్రామిక వాడకు వెళ్లి అక్కడి నుంచి వాసన వస్తున్నట్లు తెలుసుకుని నల్లగొండ కాలుష్య కంట్రోల్‌బోర్డ్ అధికారులకు సమాచారం అందించారు. సమచారం అందుకు న్న అధికారులు పోలీసులతో పారిశ్రామిక వాడకు చేరుకుని కంపెనీని గుర్తించారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు పట్టణ శివారులోని పారిశ్రామికవాడలో వాసన వస్తున్న కంపెనీనీ గుర్తించి కాలుష్యం కంట్రోల్ బోర్డ్ ఏఈఈ వీరేష్, అసెస్మెంట్ గ్రేడ్ 1 అధికారి రవీందర్‌లు శాంపిల్స్‌ను సేకరించారు. అంతకు ముందు కంపెనీలో ఏం ఉత్పత్తి అవుతుంది. ఏఏ పదార్థాలు ఉపయోగిస్తారు. ఎంతమోతాదులో ఉపయోగిస్తారు. వ్యర్థాలు ఎక్కడికి పంపుతారు. రా మెటీరియల్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు. వంటి వివరాలను సేకరించారు. అనంతరం కంపెనీలోని మిషన్లను, ముడిపదార్థాలను పరిశీలించారు. అలాగే కంపెనీ అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు. ఇంజిన్, కటింగ్ ఆయిల్ ఉత్పత్తి ఇటీవలె అనుమతి పొంది ఇంజిన్, కటింగ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే కంపెనీనీ పట్టణంలోని శివారులోని పారిశ్రామిక వాడలో సర్వే నంబర్ 860, ఫ్లా ట్ నెంబర్ 24 / ఆ–1లో ఏర్పాటు చేశారు. కాగా ఈ కంపెనీలో ఇంజిన్, కటింగ్ ఆయిల్ తయారు చేస్తారు. ఇందులో భాగంగా జూన్ 30వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఇంజన్ ఆయిల్ తయారుచేసేందుకు ట్రయల్‌రన్ నిర్వహించారు. దీనిని ఉత్పత్తి చేసేందుకు రెండు రియాక్టర్లు ఉన్నాయి. మొదటి రియాక్టర్లో హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న ఐపీఈ(ఐసో ప్రోపైల్ ఆల్క హాల్), ఎంఐసీ(మిథైల్ ఐసోపుటైల్ కార్బి నల్) వేసి 55 డిగ్రీల టెంపరేచర్లో ఉంచారు. అక్కడి నుంచి రెండో రియాక్టర్‌లోకి వెళ్లినప్పుడు ఆ రెండు రా మెటీరియల్‌తో పాటు రెండో రియాక్టర్లో థానే నుంచి కొనుగోలు చేసిన జింక్‌ను కలి పారు. ఈ రియాక్టర్లో 90 డిగ్రీల టెంపరేచర్లో ఉంచారు. ఇక్కడ నుంచి లిక్విడ్(ఆయిల్) రా వా ల్సి ఉండగా లిక్విడ్కి బదులు సాలిడ్ వచ్చింది. దీంతో సిబ్బంది అదే రోజు రాత్రి సాలీడ్ వచ్చిన ట్యాంకర్లు వాటికి సంబంధించిన మిషన్లను శుభ్రం చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వాసన సాధారణంగా జింక్ నుంచి వస్తుందని కంపెనీ సిబ్బంది చెప్పారు. సాధారణంగా ఒక్కోసారి ఇంజన్ ఆయిల్ తయారు చేయడానికి 200 కేజీల రా మెటీరియల్ ఉపయోగిస్తే 180 కేజీల ఆయిల్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఉత్పత్తిలో భాగంగా ట్రయల్ రన్ చేసే ప్రాథమిక దశలోనే సంఘటన జరిగింది. త్వరలోనే ఫలితాలు కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్వాసన సంబంధించి వివరాలు సేకరించాం. సేకరించిన ఉత్పత్తికి ఉపయోగించే రా మెటీరియల్ శాంపిల్స్‌ను ఉన్నత కార్యాలయానికి పంపి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్ష ఫలితాలు రాగానే నిబంధనలకు విరుద్ధంగా జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీరేశ్, రవీందర్, కాలుష్య కంట్రోల్‌బోర్డు అధికారులు -
ఉలిక్కిపడిన పశ్చిమ
తూర్పుగోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాదంతో జిల్లాలో భయాందోళనలు నరసాపురం(రాయపేట) : తూర్పుగోదావరి జిల్లా మామి డికుదురు మండలం నగరంలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాద ఘటనతో జిల్లాప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) పైప్లైన్లు నరసాపురం మండలం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కావడం, తుప్పుపట్టి పోవడంతో ఏ క్షణమైనా ప్రమా దం చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 250 కిలోమీటర్ల మేర పైప్లైన్లు గ్యాస్ నిక్షేపాల తరలింపులో భాగంగా ఓఎన్జీసీ ఆధ్వర్యంలోని గెయిల్ తీర ప్రాంతం నుంచి 250 కిలోమీటర్ల పైప్లైన్లు వేసింది. నరసాపురం మండలం కొత్తనవరసపురం, పాతనవరసపురం, యలమంచిలి మండలం ఏనుగువానిలంక, బాడవ, చించినాడ గ్రామాలలోని పొలాలు మధ్యన, నివాస గృహాలకు సమీపం నుంచి గ్యాస్ పైప్‌లైన్ ఉంది. అనంతరం నరసాపురం మండలంలోని పలు గ్రామాల మధ్యగా పైప్‌లైన్‌ను విస్తరించారు. నరసాపురం, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు విస్తారంగా లభించడంతో ఓఎన్జీసీతవ్వకాలను మరింత విస్తృతం చేసింది. దీనిలోభాగంగా నరసాపురం పట్టణంలో ఓఎన్జీసీ టెంపుల్లాండ్ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో ఎన్నోసార్లు గ్యాస్ లీకేజీ ఘటనలు జిల్లాలోని గ్యాస్ పైప్లైన్లు కూడా తరచూ లీకేజీ అవుతున్నాయి. అనేకసార్లు గ్యాస్ లీక్ అయినట్లుగా రైతులు గుర్తించి సమీపంలోని ఓఎన్జీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే లీకేజీని అరికట్టేవారు. భూమిలో నుంచి గ్యాస్ ఎగదన్నడంతో ఆ ప్రాంతంలో శబ్దంతో కూడినబుడగలు వచ్చేవని, వాటిని చూసి ఓఎన్జీసీ అధికారులకు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని కొత్తనవరసపురం మాజీ సర్పంచి ఈద ఇశ్రాయేలు తెలిపారు. తుప్పుపట్టిన పైప్లైన్లు 25 ఏళ్ల కిందట వేసిన పైప్లైన్లు కావడంతో తుప్పుపట్టాయని ఓఎన్జీసీ అధికారులే అనేక సందర్భాల్లో చెప్పారని స్థానికులు వివరించారు. పైప్‌లైన్ లీకేజీ అయినవెంటనే తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారని, శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని వాపోతున్నారు. లీకేజీలను అరికట్టడానికి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని, లేకపోతే నగరం లాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశముందని పలువ ఆందోళన వ్యక్తం చేశారు. 125 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ మారుస్తాం కేజీ బేసిన్‌కు సంబంధించి గ్యాస్ పైప్‌లైన్ మొత్తం 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, దానిలో 125 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను త్వరలో మారుస్తామని ఓఎన్జీసీ ఈడీ, అసిస్టెంట్ మేనేజర్(రాజమండ్రి) పి.కృష్ణారావు తెలిపారు. నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 12న ఓఎన్జీసీ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేజీ బేసిన్లో రోజుకు 800 టన్నుల ఆయిల్, 31 లక్షల క్యూబిక్ మీటర్లు గ్యాస్ ఉత్పత్తి అవుతోందని వివరించారు.