గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న సామగ్రి
హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు చెలరేగి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం దోమలగూడలోని రోజ్ కాలనీలో విషాదాన్ని నింపింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన పద్మ వచ్చే ఆదివారం బోనాల పండగ కోసం పద్మారావు నగర్‌లో నివసించే కూతురు ధనలక్ష్మి, అల్లుడు శ్యామ్, మనవరాలు శరణ్య, మనవళ్లు అభినవ్, విహాన్‌లను ఇంటికి తీసుకువచ్చింది.
ఎల్‌బీనగర్‌కు చెందిన సొంత చెల్లెలు నాగమణి, మరిది ఆనంద్‌ను కూడా పండగకు ఆహ్వానించింది. వీరిలో అల్లుడు శ్యామ్ మినహా మిగతా వారంతా ఒకే ఒక చిన్న గదిలో ఉన్నారు. మంగళవారం పిండి వంటలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్టవ్‌ను వెలిగించడంతో గ్యాస్ లీకై ంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి గది అంతటా వ్యాపించాయి. పొగ వ్యాపించింది. గదిలోని ఏడుగురు మంటల్లో చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు.
సాహసం చేసిన స్థానికులు..
గదిలోంచి అరుపులు రావడంతో సమీపంలో నివసించే గోవిందరావు అనే వ్యక్తి మరో ఇద్దరు యువకులతో కలిసి లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంతో బయటకు తీసుకువచ్చారు. లేనిపక్షంలో ఏడుగురూ మంటల్లో మసైపోయేవారని స్థానికులు చెప్పారు. అప్పటికే గదిలోని దుస్తులు, పరుపులు చాలా వరకు కాలిపోయాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఏడుగురిని స్థానికులు గదిలోంచి బయటకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు.
దోమలగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని బాధితులను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాంగ్రెస్ ఇన్‌చార్జి అనిల్‌కుమార్ యాదవ్, నగేష్ ముదిరాజ్, కార్పొరేటర్ రచనశ్రీ, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, దోమలగూడ ఇన్‌స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు సందర్శించారు.
గాయాలతో గాంధీ ఆస్పత్రిలో..
వంట గ్యాస్ లీకేజీ ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన వేడి గాలులను పీల్చడంతో శ్వాసకోశ నాళాలు, గుండె, ఇతర అంతర్గత అవయవాలు దెబ్బ తిన్నాయని చెప్పారు. పద్మ 40 శాతం, ధనలక్ష్మి 60, అభినవ్ 50, శరణ్య 30, విహాన్ 40, ఆనంద్ 36, నాగమణి 60 శాతం కాలిన గాయాలతో పీఐసీయూ, టీఎంటీ, బర్న్స్ వార్డుల్లో వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గాయపడిన చిన్నారులకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించామన్నారు. టీఎంటీలో నలుగురు క్షతగాత్రులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment