అర్ధరాత్రి గ్యాస్‌ కలకలం | Gas Leak In Nalgonda Factor | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి గ్యాస్‌ కలకలం

Published Mon, Jul 2 2018 7:26 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Gas Leak In Nalgonda Factor - Sakshi

ఫ్యాక్టరీలో శాంపిల్స్‌ సేకరిస్తున్న కాలుష్య కంట్రోల్‌ బోర్డు అధికారులు, పారిశ్రామికవాడలో వాసన వస్తున్నట్లు గుర్తించిన కంపెనీ

భువనగిరి :  అది జూన్‌ 30వ తేదీ అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా గ్యాస్‌  వాసన రావడంతో జనం ఆందోళన చెందారు. తమ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకైందని భయంగా వంటింట్లోకి వెళ్లి చూసుకున్నారు. ఇలా కాలనీల ప్రజలందరూ చూసుకున్నారు.  ఎక్కడా లీక్‌ కాలేదు. రాత్రిపూట కాలనీ లవాసులందరూ వీధుల్లోకి వచ్చారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్యాస్‌ వాసన వస్తుండడంతో  పారిశ్రామికవాడ నుంచి వస్తుండొచ్చు అని అనుమానించారు. దీంతో ఆదివారం ఉదయం మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ పారిశ్రామిక వాడకు వెళ్లి అక్కడి నుంచి వాసన వస్తున్నట్లు తెలుసుకుని నల్లగొండ కాలుష్య కంట్రోల్‌బోర్డ్‌ అధికారులకు సమాచారం అందించారు. సమచారం అందుకు న్న అధికారులు పోలీసులతో పారిశ్రామిక వాడకు చేరుకుని కంపెనీని గుర్తించారు.

శాంపిల్స్‌ సేకరించిన అధికారులు
పట్టణ శివారులోని పారిశ్రామికవాడలో వాసన వస్తున్న కంపెనీనీ గుర్తించి కాలుష్యం కంట్రోల్‌ బోర్డ్‌ ఏఈఈ వీరేష్, అసెస్‌మెంట్‌ గ్రేడ్‌ 1 అధికారి రవీందర్‌లు శాంపిల్స్‌ను సేకరించారు. అంతకు ముందు కంపెనీలో ఏం ఉత్పత్తి అవుతుంది. ఏఏ పదార్థాలు ఉపయోగిస్తారు. ఎంతమోతాదులో ఉపయోగిస్తారు. వ్యర్థాలు ఎక్కడికి పంపుతారు. రా మెటీరియల్‌ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు. వంటి వివరాలను సేకరించారు. అనంతరం కంపెనీలోని మిషన్‌లను, ముడిపదార్థాలను పరిశీలించారు. అలాగే కంపెనీ అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు.

ఇంజిన్, కటింగ్‌ ఆయిల్‌ ఉత్పత్తి
ఇటీవలె అనుమతి పొంది ఇంజిన్, కటింగ్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే కంపెనీనీ పట్టణంలోని శివారులోని పారిశ్రామిక వాడలో సర్వే నంబర్‌ 860, ఫ్లా ట్‌ నెంబర్‌ 24 / ఆ–1లో ఏర్పాటు చేశారు. కాగా ఈ కంపెనీలో ఇంజిన్, కటింగ్‌ ఆయిల్‌ తయారు చేస్తారు. ఇందులో భాగంగా జూన్‌ 30వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఇంజన్‌ ఆయిల్‌ తయారుచేసేందుకు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. దీనిని ఉత్పత్తి చేసేందుకు రెండు రియాక్టర్లు ఉన్నాయి. మొదటి రియాక్టర్‌లో హైదరాబాద్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఐపీఈ(ఐసో ప్రోపైల్‌ ఆల్క హాల్‌), ఎంఐసీ(మిథైల్‌ ఐసోపుటైల్‌ కార్బి నల్‌) వేసి 55 డిగ్రీల టెంపరేచర్‌లో ఉంచారు. అక్కడి నుంచి రెండో రియాక్టర్‌లోకి వెళ్లినప్పుడు ఆ రెండు రా మెటీరియల్‌తో పాటు రెండో రియాక్టర్‌లో థానే నుంచి కొనుగోలు చేసిన జింక్‌ను కలి పారు. ఈ రియాక్టర్‌లో 90 డిగ్రీల టెంపరేచర్‌లో ఉంచారు.

ఇక్కడ నుంచి లిక్విడ్‌(ఆయిల్‌) రా వా ల్సి ఉండగా లిక్విడ్‌కి బదులు సాలిడ్‌ వచ్చింది. దీంతో సిబ్బంది అదే రోజు రాత్రి సాలీడ్‌ వచ్చిన ట్యాంకర్లు వాటికి సంబంధించిన మిషన్‌లను శుభ్రం చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వాసన సాధారణంగా జింక్‌ నుంచి వస్తుందని కంపెనీ సిబ్బంది చెప్పారు. సాధారణంగా ఒక్కోసారి ఇంజన్‌ ఆయిల్‌ తయారు చేయడానికి 200 కేజీల రా మెటీరియల్‌ ఉపయోగిస్తే 180 కేజీల ఆయిల్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఉత్పత్తిలో భాగంగా ట్రయల్‌ రన్‌ చేసే ప్రాథమిక దశలోనే సంఘటన జరిగింది.

త్వరలోనే ఫలితాలు
కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్వాసన సంబంధించి వివరాలు సేకరించాం. సేకరించిన ఉత్పత్తికి ఉపయోగించే రా మెటీరియల్‌ శాంపిల్స్‌ను ఉన్నత కార్యాలయానికి పంపి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్ష ఫలితాలు రాగానే నిబంధనలకు విరుద్ధంగా జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 

వీరేశ్, రవీందర్, కాలుష్య కంట్రోల్‌బోర్డు అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement