సిలిం‘డర్‌’..టేక్‌ కేర్‌ | Gas Cylinders Leakage Accidents Frequently In City | Sakshi
Sakshi News home page

సిలిం‘డర్‌’..టేక్‌ కేర్‌

Published Mon, Mar 2 2020 10:27 AM | Last Updated on Mon, Mar 2 2020 10:27 AM

Gas Cylinders Leakage Accidents Frequently In City - Sakshi

ప్రగతి నగర్‌లో గ్యాస్‌ పేలుడుతో ఇంట్లో మంటలు

సాక్షి, సిటీబ్యూరో: 20 రోజులు... మూడు ‘బ్లాస్ట్‌’లు... ఒకరు బలి, 13 మందికి తీవ్ర గాయాలు... భారీగా ఆస్తినష్టం... వెరసి ప్రస్తుతం నగరవాసులకు సిలిం‘డర్‌’ పట్టుకుంది. ఇటీవల కాలంలో తరచుగా ‘గ్యాస్‌’ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మలక్‌పేట, సరూర్‌నగర్‌ పరిధుల్లో ఆదివారమే రెండు ఉదంతాలు వెలుగులోకి రాగా... గత నెల్లో చిలకలగూడ ఏరియాలో మరోటి చోటు చేసుకుంది. ఏడాదికి 40 నుంచి 50 వరకు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నా... ఆస్తి నష్టం మాత్రం భారీగా చోటు చేసుకుంటోంది. గ్యాస్‌ వినియోగంపై వినియోగదారులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు.  

ఏడు చోట్ల లీక్‌కు చాన్స్‌... 
గ్యాస్‌ సిలిండర్‌... ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండే నిత్యావసర వస్తువు. మన వంటింట్లో ఉండే సిలిండర్‌లో బ్యూటేన్, ప్రొఫైన్‌ అనే రసాయిన వాయువులు కలిసి ఉంటాయి.   14.5 కేజీల బరువున్న ఈ వాయువులను అత్యధిక ఒత్తిడితో గ్యాస్‌ సిలిండర్‌లో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ బండ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడిగా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. సాధారణంగా స్టౌ ఆఫ్‌ చేసి ఉన్నప్పటికీ... గ్యాస్‌ లీకేజ్‌ అనేది ఏడు ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది. సిలిండర్, స్టౌవ్‌లను కలుపుతూ రబ్బర్‌ ట్యూబ్‌ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టౌకు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా స్టౌకు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్‌ సాగే గుణం కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంతం రంధ్రం ఏర్పడితే చాలు. దీని లోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్‌ లీక్‌ అవుతుంది. మెల్లమెల్లగా ఇల్లంతా వ్యాపిస్తుంది. మరోపక్క స్టౌకు ఉండే నాబ్స్, రెండు నాబ్స్‌నూ కలిపే పైప్, కొత్త సిలిండర్‌ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్‌ నాబ్‌ల నుంచీ లీక్‌ అయ్యే  అవకాశం ఉంది.  

‘తెరిచి ఉన్నా’ ఫలితం నిల్‌... 
వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకైన గ్యాస్‌ వాటి నుంచి బయటకు వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకైన తరవాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు  తెరిచి ఉన్నా... వెంటిలేటర్లు ఉన్నా వాటి ద్వారా బయటకు పోయే అవకాశం ఉండదు. లీకైన గ్యాస్‌ అంటుకోవడానికి అనేక రకాలుగా ప్రేరణలు ఉంటాయి. గ్యాస్‌ వ్యాపించి ఉన్న గదిలో లైట్‌ వేసినా, అగ్గిపుల్ల, లైటర్‌ వెలిగించినా, ఏదైనా బరువైన వస్తువు ఎత్తుమీద నుంచి కిందపడినా వచ్చే స్పార్క్‌ వల్ల అంటుకుంటుంది. మరోపక్క మన ఇంట్లో ఉండే ఫ్రిజ్‌లు కూడా గ్యాస్‌ మండటానికి ప్రేరణలుగానే పని చేస్తాయి. ఫ్రిజ్‌లో కూలింగ్‌ పెరిగినప్పుడు ఆగిపోయి, తగ్గిన వెంటనే మళ్లీ స్టార్ట్‌ అయ్యే పరి/ê్ఞనం ఉంటుంది. దీన్నే రిలే మెకానిజం అంటారు. ఇలా రిలే జరిగేటప్పుడు ఫ్రిజ్‌ నుంచి ‘టక్‌’ మనే శబ్దం వస్తుంది. అందులో ఉత్పన్నమయ్యే స్పార్క్‌ వల్లే ఈ శబ్దం వెలువడేది. ఇంట్లో వ్యాపించిన గ్యాస్‌ దీనివల్లా అంటుకునే ప్రమాదం ఉంది. మలక్‌పేట ప్రమాదానికి ఇదే కారణమని తెలుస్తోంది.  

12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది... 
ఇల్లంతా వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్‌ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్‌ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్‌ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది. తలుపులు, కిటికీలతో పాటు కాస్త బలహీనంగా ఉన్న గోడలు సైతం విరిగిపోతాయి. ఒక్కసారిగా గ్యాస్‌ అంటుకుని ఆరిపోవడం వల్ల భారీ ఆగి్నప్రమాదం సైతం సంభవించదు. అయితే ఆ సమీపంలో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోవడమో, 60 శాతం వరకు కాలిపోవడమో జరుగుతుంది. అనేక ప్రమాదాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ఏమాత్రం చెక్కు చెదరదు. దీన్ని చూసి అనేక మంది గ్యాస్‌ వల్ల జరిగిన పేలుడు కాదని భావిస్తారు. ఇలాంటి బ్లాస్ట్‌ల్ని కెమికల్‌ ఎక్స్‌ప్లోజన్‌ అని, సిలిండర్‌ కూడా ఛిద్రం అయిపోతే దాన్ని మెకానికల్‌ ఎక్స్‌ప్లోజన్‌ అని సాంకేతికంగా అంటారు.  

చూద్దామనుకునేలోపే పేలింది 
చైతన్యపురి:  ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో  జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .... సాలార్‌జంగ్‌ మ్యూజియంలో పనిచేసే రమేష్‌ అలియాస్‌ రాము (31), పెయింటర్‌గా పనిచేసే లక్ష్మణ్‌ అన్నదమ్ములు. ప్రగతినగర్‌లోని రెండు గదుల ఇంట్లో అన్నదమ్ములు కుటుంబాలు నివాసం ఉంటున్నారు. రమే‹Ùకు బార్య పద్మ, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. లక్ష్మణ్‌కు ఏడాది క్రితమే మల్లికతో వివాహం జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో గ్యాస్‌ వాసన వస్తుండటంతో రమేష్‌ లేచి ప్రమాదం పసిగట్టి ఇంట్లో వారందరిని బయటకు పంపించారు.  

గ్యాస్‌ వాసన ఎందుకు వస్తుందో చూద్దాం అని  లక్ష్మణ్‌ లైట్‌ స్విచ్‌  ఆన్‌ చేశాడు. దీంతో విస్ఫోటనం జరిగి పెద్ద పేలుడు శబ్దంతో రెండు గదుల్లో మంటలు అంటుకున్నాయి. బయట ఉన్న ఇతర కుటుంబ సభ్యులకు ఏంజరిగిందో అర్ధం అయ్యేలోపే అన్నదమ్ములకు మంటలంటుకున్నాయి. వీరి గదికి ఎదురుగా ఉన్న వృద్ధురాలు లీలమ్మ (62)కు కూడా మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల ఇండ్లకు ఈ సెగతగిలింది. పోలీసులు ఫైర్‌ ఇంజన్‌ను రప్పించి మంటలు ఆరి్పంచారు. గాయపడ్డ రమే‹Ù, లక్ష్మణ్, లీలమ్మలను ఆసుపత్రికి తరలించారు.   సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.  

ఉలిక్కిపడ్డ ఆస్మాన్‌ఘడ్‌ 
మలక్‌పేట:  మాడ్గుల మండలం ఫీరోజ్‌నగర్‌ గ్రామానికి చెందిన లక్ష్మయ(50), భార్య యాదమ్మ(45)తో కలిసి ఆస్మాన్‌ఘడ్‌ వెంకటాద్రినగర్‌లోని  అస్మాన్‌ విల్లాలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రెండు నెలలుగా నివాసం ఉంటున్నారు. లక్ష్మయ్య జియగూడ మండీలో ప్యాగో ట్రాలీ ఆటో నడుపుతుండగా, అదే విల్లాలో యాదమ్మ పనిచేస్తోంది. హస్తినాపురంలో నివాసం ఉంటున్న లక్ష్మయ్య రెండో కూతురు భాగ్యలక్ష్మి పిల్లలు తేజస్విని (9), మోక్షజ్ఞ(7) తలకొండపల్లిలో జరిగే ఫంక్షన్‌కు వెళ్లడానికి  సాయంత్రం ఇక్కడికి వచ్చారు. నలుగురూ కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. శనివారం అర్ధరాత్రి గదిలో ఉన్న ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ గ్యాస్‌ లీకై పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇంటో నిద్రిస్తున్న నలుగురికీ మంటలు అంటుకుని తీవ్రగాయాలు అయ్యాయి.

పేలుడు శబ్దం టీవీ టవర్‌ సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ వరకు వినిపించింది. అప్రమత్తమైన పోలీసులు, కాలనీవాసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పోలీసులు 108లో సికింద్రాబాద్‌లోని గాం«ధీ ఆసుపత్రికి తరలించారు. నగర జాయింట్‌ సీపీ, ఈస్ట్‌జోన్‌ ఇంచార్జ్‌ డీసీపీ రమే‹Ù, అడిషనల్‌ డీసీపీ గోవిందరెడ్డి, ఇంచార్జ్‌ ఏసీపీ దేవేందర్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్‌  సిలిండర్‌ లీక్, ఫ్రిడ్జ్‌లో వెనుక భాగంలో ఉన్న సిలిండర్‌ థర్మో స్ట్రాటర్‌ స్పార్క్‌ కరెంట్‌ షాక్‌తో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమీప ఇండ్లకిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పార్కింగ్‌ చేసిన కారు, ఆటోలు దెబ్బతిన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement