సాక్షి, అనంతపురం : తాడిపత్రి గెర్దావ్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఫ్యాక్టరీ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కార్మికులు చనిపోయినా యాజమాన్యం సెలవు ఇవ్వలేదని కార్మికులు ఆందోళనకు దిగారని తెలుస్తోంది. దీంతో కార్మికులకు మద్దతుగా జనసేన నేతలు, కార్యకర్తలు గెర్దావ్ ఫ్యాక్టరీని ముట్టడించారు.
కాగా, ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. అక్కడ పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటేలా ఉందని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు.
గెర్దావ్ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గెర్దెవ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో యాజమాన్యం, కార్మికులు ఇద్దరిదీ తప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి మెరుగైన ఆర్థిక పరిహారం ఇవ్వాలని జేసీ సూచించారు. అంతేకాక మృతుల కుటుంబీకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు. ఎక్స్ గ్రేషియాపై ప్రభుత్వంలో మాట్లాడుతానని ఎంపీ చెప్పారు. కానీ, రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయటం సరికాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment