
జేసీ దివాకర్ రెడ్డి
సాక్షి, అనంతపురం : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులంత దొంగలు ఎవరూ లేరంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మంగళవారం అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగిన రైతు సదస్సులో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను విన్నవించేందుకు కొంతమంది కమ్యూనిస్టు నాయకులు అక్కడికి వచ్చారు.
వారిని ఉద్దేశించి మాట్లాడిన జేసీ చెప్పుకోలేని రీతిలో అసభ్య పదజాలాన్ని వినియోగించారు. తాను అసెంబ్లీకి వెళ్లినప్పుడు కమ్యూనిస్టులు అంటే గొప్పవారని, నిజాలను నిర్భీతిగా వెల్లడిస్తారని భావించానని చెప్పారు. అయితే రానురాను తన అభిప్రాయం సరికాదని తెలిసిందని అన్నారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కమ్యూనిస్టులు 16 రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
ఓ వైపు ఎంపీ అసభ్య పదజాలాన్ని వాడుతూ ఎదుటి వ్యక్తులను దూషిస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్నవారు బిగ్గరగా నవ్వారు. అంతేగాక జేసీ హావభావాలు కూడా కమ్యూనిస్టులను తీవ్ర మనస్థాపానికి గురి చేసేలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment